మహిళా భవనం స్థలంలో బస్తీ దవాఖాన వద్దు

by Disha Web Desk 1 |
మహిళా భవనం స్థలంలో బస్తీ దవాఖాన వద్దు
X

పెర్కిట్ జాతీయ రహదారిపై మహిళా సంఘాల రాస్తారోకో..

దిశ ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని కోటార్ మూర్ లో గల గ్రామ మహిళా సంఘ భవన ఏరియాలో బస్తీ దావాఖాన వద్దంటూ పెర్కిట్, కొటార్ మూర్ కు చెందిన మహిళా సంఘాల సభ్యులు సోమవారం మహిళా సంఘ భవనం ఎదుట ధర్నా నిర్వహించి రాస్తారోకో కు దిగారు. మా మహిళా భవనం.. మాకే కావాలంటూ.. మా భవన స్థలంలో ఏ భవనాలు నిర్మించవద్దని నినాదాలు చేశారు.

మా మహిళా భవనంలో గతంలో ప్రజల సౌకర్యం కోసం మినీ ఆరోగ్య కేంద్రం సేవల కోసం గదిని కేటాయించామని, ప్రస్తుతం ఆ గదికి పల్లె దవాఖాన పేరిట హెల్త్ అధికారులు బోర్డు పెట్టుకున్నారని మహిళా సంఘాల సభ్యులు మండిపడ్డారు. మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మంత్రి హరీష్ రావు నిధులు మంజూరు చేయించి మహిళా భవనానికి ప్రహరీ గోడ నిర్మాణం చేయిస్తే స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ పొద్దుటూరి మురళీధర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహన్ లు కూల్చివేయడం ఏంటని మహిళలు నిలదీశారు.

మహిళా భవనానికి సంబంధించిన ప్రహరీని మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారని అధికారులపై, నాయకులపై మహిళా సంఘాల సభ్యులు మండిపడ్డారు. అనంతరం పెర్కిట్లో జాతీయ రహదారిపై మహిళలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ.. రాస్తారోకో నిర్వహించారు. అనంతరం వారు మున్సిపల్ కౌన్సిలర్ మురళీధర్ రెడ్డి, కమిషనర్ ప్రసాద్ చౌహన్ ల వద్దకు వెళ్లి మహిళా సంఘం ప్రహరీ కూల్చివేతపై సమాధానం చెప్పాలని పట్టుబట్టారు.

ఆర్మూర్ లో అన్ని కుల సంఘాలకు, స్వచ్ఛంద సంస్థలకు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇస్తున్న పది శాతం స్థలాల లాగే, బస్తీ దవాఖానకు సైతం స్థలం మంజూరు చేయాలని, అదేవిధంగా మహిళా సంఘం భవనం జోలికి అధికారులు రావొద్దన్నారు. మహిళా సంఘ భవనం ఆవరణలోకి మరో భవనం నిర్మిస్తామంటూ అంటూ వస్తే ఊరుకునేది లేదని మహిళా సంఘాల సభ్యులు హెచ్చరించారు. అదేవిధంగా మహిళా సంఘం భవనంలో గల ఆరోగ్య కేంద్రాన్ని కూడా తొలగించాలని మహిళలు డిమాండ్ చేశారు.

తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయ్యాక మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇంత వరకు ఇవ్వలేదని మహిళలు వారి ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. జాతీయ రహదారిపై సుమారు అరగంట మహిళల రాస్తారోకోతో భారీగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఇంతలో ఆర్మూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మహిళలను సముదాయించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల అధ్యక్షురాళ్లు గుండం రూప, చేపూర్ విజయ, చిటిమేల రాజగంగు, తాళ్ల సుమలత, అస్మ, బి.రేణుక, ప్రవీణ్ సుల్తానా అదేవిధంగా బిల్డింగ్ నిర్మాణ సమమంలో ఓబీలు పనిచేసిన మహిళా సంఘం ప్రతినిధులు మెరుగు లలిత, తొగర్ల కమల, కే.సుజాత, మహిళా సంఘాల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed