కలెక్టరేట్ లో ఏసీబీ దాడులు..

by Disha Web Desk 20 |
కలెక్టరేట్ లో ఏసీబీ దాడులు..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నూతన కలెక్టరేట్ లో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఒక రైతుకు సంబంధించిన ఐదు గుంటల భూమి సర్టిఫికెట్ స్కెచ్ కోసం పదివేల లంచం తీసుకుంటూ నిజామాబాద్ ల్యాండ్ సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ శ్యాంసుందర్ రెడ్డి ఏసీబీకి చిక్కాడు. ఏసీబీ అధికారుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మోర్తాడ్ మండలం ధర్మవరం గ్రామానికి చెందిన దుగ్గెన రాజేందర్ అనే రైతు తన ఐదు గుంటల భూమికి సరిహద్దు సర్టిఫికెట్ తో పాటు లోకేషన్ స్కెచ్ రిపోర్ట్ (మ్యాప్) కోసం దరఖాస్తు చేసుకోగా ఏడీ శ్యాంసుందర్ రెడ్డితో పాటు, సూపరింటెండెంట్ ముచ్చటి వెంకటేష్, జూనియర్ అసిస్టెంట్ రహిమలు లంచం డిమాండ్ చేశారు.

బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. రైతు రాజేందర్ నుంచి పదివేల లంచం తీసుకుంటుండగా ఏసీ అధికారులు శ్యాంసుందర్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రికార్డుల ప్రకారం ఫైల్ ప్రాసెస్ కోసం లంచం డిమాండ్ చేసిన ముగ్గురిని అరెస్ట్ చేసి కరీంనగర్ ఏసీబీ కోర్టు ముందు హాజరు పరుస్తామని అధికారులు తెలిపారు. నిజామాబాద్ కొత్త కలెక్టరేట్ నిర్మాణం తర్వాత ఏసీబీ దాడులు మొదటివి కావడం కలకలం రేపింది. ఏసీబీ దాడులతో కొత్త కలెక్టరేట్లో అధికార వర్గాల్లో అలజడి మొదలైంది.


Next Story