పోలీసులకు తలనొప్పిగా మారిన వరుస ఘటనలు..

by Disha Web Desk 20 |
పోలీసులకు తలనొప్పిగా మారిన వరుస ఘటనలు..
X

దిశ, భిక్కనూరు : ప్రశాంతంగా ఉన్న పట్టణంలో వరుసగా జరుగుతున్న ఘటనల పై పోలీస్ శాఖ సీరియస్ గా ఉంది. ఇదివరకు ఎన్నడూ లేని విధంగా మండల కేంద్రమైన భిక్కనూరులో గొడవలు జరగడం, తన్నుకోవడం, కొట్లాటలకు దిగడం వంటి ఘటనలు పెరిగిపోతుండడం వెనుక కారణాలు ఏమై ఉంటాయన్న కోణంలో పోలీసులు సీక్రెట్ విచారణ చేపట్టారు. క్షణికావేశంతో జరుగుతున్న ఘటనలే అయినప్పటికీ, ఇదివరకెన్నడు జరగని విధంగా గొడవలు జరిగి రక్తాలు కారేటట్టు కొట్టుకోవడం, తన్నుకోవడం వంటి ఘటనలు చోటు చేసుకుంటుండడం, సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నవేల, శాంతి భద్రతలకు భంగం కలిగే ప్రమాదం పోంచి ఉందన్న ఉద్దేశంతో ముందు జాగ్రత్త చర్యగా ఈ సీక్రెట్ ఎంక్వయిరీ చేపట్టారు. మునుపెన్నడూ లేనివిధంగా వరుసగా జరుగుతున్న గొడవల పై జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి కూడా సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. రిపోర్టు తయారు చేసి పంపాలని కూడా స్థానిక పోలీసులను ఆదేశించినట్లు తెలుస్తోంది.

నాయకుల ఆగడాలు మితిమీరడం వల్లే ఈ ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయా అన్న కోణంలో కూడా విచారణ సాగిస్తున్నారు. ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగాల్లో స్థిర పడాల్సిన నేతలు కొందరు అనవసర విషయాల్లో కలుగజేసుకొని కొట్లాటలకు దిగుతూ భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారన్న వాస్తవాన్ని పోలీసులు జరిపిన అంతర్గత విచారణలో తేలింది. అయితే ఈ విషయాన్ని వారు ఎందుకు గ్రహించలేకపోతున్నారన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. ఆ రెండు పార్టీల నాయకుల మధ్యే తరచూ గొడవలు జరగడం పోటాపోటీగా స్టేషన్ కు వెళ్లి ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం వంటి పరిస్థితులు స్థానిక పోలీసులకు తలనొప్పిగా మారాయి. ఒక పార్టీ నాయకులిచ్చిన ఫిర్యాదులను మాత్రమే పరిగణలోకి తీసుకొని, మిగతా పార్టీ నాయకుల పై తప్పుడు కేసులునమోదు చేస్తూ వన్ సైడ్ గా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలను ఇప్పటికే స్థానిక పోలీస్ శాఖ మూఠ కట్టుకుంది. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవలసిన జాగ్రత్తల పై దృష్టి సారించాల్సిన అవసరం పోలీస్ శాఖకు ఎంతైనా ఉంది.

Next Story