కొత్త అడ్వకేట్ జనరల్ ఎవరు? రేసులో సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది

by Disha Web Desk |
కొత్త అడ్వకేట్ జనరల్ ఎవరు? రేసులో సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్నారు. కొత్త ప్రభుత్వం కొన్ని గంటలలో కొలువు తీరనున్నది. ఈ తరుణంలో కీలక స్థానాలలో ఎవరు ఉండబోతున్నారన్న చర్చ రాష్ట్రమంతా జరుగుతోంది. న్యాయ వ్యవస్థలో కీలకమైన అడ్వకేట్ జనరల్ ఎవరని హైకోర్టు కారిడార్లు, క్యాంటీన్లు, న్యాయవాదుల ఛాంబర్లతో పాటు ప్రభుత్వ వర్గాలు, ప్రజలల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం తరఫున మొదటి లాయర్ న్యాయ కోవిదుడు, ప్రజల మేలు కోరేవాడు ఉండాలనేది అందరి ఆకాంక్ష. అడ్వకేట్ జనరల్ పదవి కోసం ప్రధానంగా ముగ్గురు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన న్యాయవాదులందరు ఉద్యమ ఆకాంక్షలు తెలిసినవారు, తమతో ఉద్యమంలో ఉన్నవారు ఆ కుర్చీలో కూర్చోవాలని కోరుకుంటున్నారు.

న్యాయవాద వర్గాల్లో సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది పి.నిరూప్ రెడ్డి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఆయన సుప్రీం కోర్టులో గత మూడు దశాబ్దాలుగా న్యాయవాదిగా సేవలు అందిస్తున్నారు. తెలంగాణ నుంచి సీనియర్ న్యాయవాదిగా గుర్తించబడిన మొదటి న్యాయవాది ఆయనే. 1986 లో న్యాయవాద వృత్తిలోకి వచ్చారు. ఆయన తండ్రి కూడా ప్రముఖ న్యాయవాది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ మాజీ స్పీకర్, ఐదు దఫాలుగా ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర మంత్రిగా పనిచేసిన పి.రామచంద్రరెడ్డి దగ్గర సంగారెడ్డి జిల్లా కోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు హై కోర్టు న్యాయవాదిగా, అడ్వకేట్ జనరల్ కార్యాలయంలో ప్రత్యేక జీపీగా పని చేశారు. ఆ తర్వాత సుప్రీం కోర్టులో మాజీ సొలిసిటర్ జనరల్ ఆఫీసులో జూనియర్‌గా చేరారు.

1992 నుంచి సొంత ప్రాక్టీసు ప్రారంభించి మంచి గుర్తింపు పొందారు. గత సంవత్సరం వీరికి సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాదిగా గుర్తింపు లభించింది. తెలంగాణా నుంచి ఈ గుర్తింపు పొందిన మొదటి న్యాయవాది కూడా ఆయనే. నిరూప్ తెలంగాణ ఉద్యమంలో విశేష కృషి చేశారని పలువురు న్యాయవాదులు చెప్తున్నారు. ఢిల్లీ వేదికగా ఉద్యమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. మలిదశ ఉద్యమ కాలమంతా వారానికి రెండు రోజులు తెలంగాణలోనే ఉంటూ స్వరాష్ట్రం కోసం ఉద్యమించిన ఘనత ఆయనకు ఉన్నదని గుర్తు చేస్తున్నారు. అలాగే మేఘాలయ రాష్ట్రానికి అదనపు అడ్వకేట్ జనరల్‌గా, గోవా రాష్ట్ర సీనియర్ స్టాండింగ్ కౌన్సిల్‌గా పని చేశారు. తెలంగాణలో ప్రజా సంఘాలతో కలిసి ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతూ పరిపాలనలో మార్పుకు బలంగా కృషి చేశారు. తెలంగాణ ఉద్యమకారుడు, గొప్ప న్యాయవాది, అనుభవజ్ఞుడు, మేధావి, ప్రజల మేలుకోరే నిరూప్ అడ్వకేట్ జనరల్ కావాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Next Story

Most Viewed