పీఎఫ్ఐ నిందితులపై నాంపల్లి కోర్టుకు NIA రిక్వెస్టు

by GSrikanth |
పీఎఫ్ఐ నిందితులపై నాంపల్లి కోర్టుకు NIA రిక్వెస్టు
X

దిశ, తెలంగాణ బ్యూరో: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంస్థకు చెందిన నలుగురిని అరెస్టు చేసిన ఎన్ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) 30 రోజుల పాటు పోలీసు కస్టడీకి ఇవ్వాలని నాంపల్లి కోర్టును రిక్వెస్టు చేసింది. ఒకే రోజున రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో 38 చోట్ల సోదాలు చేసిన ఎన్ఐఏ సమీర్, ఫిరోజ్, ఉస్మాన్, ఇమ్రాన్‌ అనే నలుగురు యువకులను అరెస్టు చేసింది. నిజామాబాద్ పోలీసు స్టేషన్‌లో జూలైలో నమోదైన కేసుకు సంబంధించిన వ్యవహారంలో ఆగస్టులో ప్రత్యేక ఎఫ్ఐఆర్‌ను రూపొందించిన ఎన్ఐఏ ఖాదర్‌ను ప్రధాన నిందితుడిగా పేర్కొన్నది. కరాటే పేరుతో శిక్షణ ఇస్తున్న పీఎఫ్ఐ అసాంఘిక కార్యకలాపాలకు ప్రేరేపిస్తున్నదని, ఉగ్రవాద యాక్టివిటీస్‌కు వాడుకుంటున్నదని ఎన్ఐఐ ఆరోపించింది. ఈ విషయాలను రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నది.

ఒక మతానికి చెందినవారిని టార్గెట్ చేస్తూ పీఎఫ్ఐ కార్యకర్తలను ఉద్రేకపూరిత ప్రసంగాలతో రెచ్చగొడుతున్నదని, దాడులకు అవసరమైన శారీరక దారుఢ్యాన్ని పొందడానికి ఆ తరహా ట్రెయినింగ్ ఇస్తున్నదని ఎన్ఐఏ పేర్కొన్నది. కత్తులు, ఇనుప రాడ్లను వాడడం, దాడికి ఉపయోగించడం లాంటి అంశాలను కూడా శిక్షణలో భాగంగా నేర్పిస్తున్నదని పేర్కొన్నది. సోదాల సమయంలో స్వాధీనం చేసుకున్న కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు, మొబైల్ ఫోన్లు, సాహిత్యం తదితరాలన్నింటిలో ఈ వివరాలు, ఆధారాలు లభ్యమయ్యాయని పేర్కొన్నది. భారత ప్రభుత్వంపై కుట్రకు పాల్పడే పథకాలు, వీడియోలు కూడా లభ్యమైనట్లు తెలిపింది. ఈ సంస్థ తన నిర్వహణ కోసం నిధులను కూడా వేర్వేరు మార్గాల్లో సమకూర్చుకుంటూ ఉన్నట్లు వివరించింది.

Next Story

Most Viewed