ఫోన్ ట్యాపింగ్ కేసులో BIG ట్విస్ట్.. కీలక పాత్ర పోషించిన ఆ ఛానల్ ఎండీ!

by Disha Web Desk 2 |
ఫోన్ ట్యాపింగ్ కేసులో BIG ట్విస్ట్.. కీలక పాత్ర పోషించిన ఆ ఛానల్ ఎండీ!
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: మరొక్క రోజు మాత్రమే కస్టడీ గడువు ఉన్న నేపథ్యంలో ఫోన్​ట్యాపింగ్​కేసులో విచారణాధికారులు దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ప్రణీత్​రావు టీంలో పని చేసిన పలువురి నుంచి వివరాలు సేకరించారు. కాగా, ఈ కేసులో కీలకంగా ఉన్న ఓ సీనియర్​పోలీస్​అధికారి ఇప్పటికే అమెరికా పారిపోయినట్టుగా, ఓ ఛానల్ ఎండీతో కలిసి ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు ప్రణీత్ రావు విచారణలో వెల్లడించినట్టు తెలిసింది. జూబ్లీహిల్స్​ఏసీపీ వెంకటగిరి నేతృత్వంలోని ప్రత్యేక విచారణ బృందం గత ఆరు రోజులుగా ప్రణీత్​రావును ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే. ప్రధానంగా ఎవరి సూచనలు, ఆదేశాల మేరకు ఫోన్ల ట్యాపింగ్​చేశారు? అన్న అంశానికి సంబంధించి వేసిన ప్రశ్నల్లో చాలా వాటికి ప్రణీత్ రావు జవాబు ఇవ్వలేదని తెలిసింది. పై అధికారుల సూచనల మేరకే పని చేశా అని మాత్రం చెప్పినట్టుగా తెలియవచ్చింది.

కాగా, ఎస్ఐబీ కార్యాలయంలో ప్రణీత్​రావు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న ఆఫీస్‌లో పని చేసిన ఆరుగురు అధికారులతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు ముందు వేర్వేరు నియోజకవర్గాల్లో వార్​రూంలు ఏర్పాటు చేయటంలో సహకరించిన పలువురు పోలీసు అధికారులను దర్యాప్తు అధికారులు గుర్తించారు. వీరిలో ప్రస్తుతం వరంగల్​అర్బన్‌లో పని చేస్తున్న ఇద్దరు సీఐలు కూడా ఉన్నారు. వీరిలో ఓ సీఐ బీఆర్ఎస్​పార్టీలో అత్యంత కీలక నాయకునికి బంధువని సమాచారం. ప్రణీత్​రావు టీంలోని సిబ్బందితోపాటు ఈ ఇద్దరు సీఐలను విచారణాధికారులు ప్రశ్నించినట్టుగా తెలిసింది. అయితే, వీళ్లు కూడా ప్రణీత్​రావు తరహాలోనే జవాబులు ఇచ్చినట్టుగా సమాచారం. మాకేం తెలియదు, పైనుంచి అందిన ఆదేశాల మేరకే పని చేశామని చెప్పినట్టుగా తెలిసింది.

మరిన్ని అరెస్టులు...

ఈ వ్యవహారానికి సంబంధించి ఓ అధికారితో మాట్లాడగా ఫోన్​ట్యాపింగ్​కేసులో మరిన్ని అరెస్టులు ఉంటాయని చెప్పారు. పై నుంచి అందిన సూచనల మేరకే అంతా చేశామని తప్పించుకునే ధోరణిలో ప్రణీత్​రావు టీంలో పని చేసిన వారు చెబుతున్నా..వార్​రూం ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర వహించిన వారిని ఇప్పటికే గుర్తించామని ఆయన తెలిపారు. ఇలా ప్రైవేట్​వ్యక్తుల ఇళ్లల్లో వార్​రూంలు ఏర్పాటు చేసి ఫోన్లను ట్యాప్​చేయటం నేరమని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఫోన్​ట్యాపింగ్​వ్యవహారంలో ప్రణీత్​రావుకు సహకరించిన వారి అరెస్టులు జరగడం ఖాయమని తెలిపారు.

అమెరికాకు ఆ అధికారి...

ఫోన్​ట్యాపింగులు జరిగినపుడు ఎస్ఐబీలో కీలక స్థానంలో ఉన్న ఓ అధికారి ఇప్పటికే అమెరికా పరారైనట్టుగా తెలుస్తోంది. ప్రణీత్​రావును విచారించినపుడు సదరు అధికారి పేరు వెల్లడించినట్టు సమాచారం. నిజానికి ప్రణీత్​రావు అరెస్ట్​కాగానే తన పేరు బైటకు రావటం ఖాయమని భావించిన సదరు అధికారి అన్ని ఏర్పాట్లు చేసుకుని అమెరికాకు చెక్కేసినట్టుగా సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఓ ఛానల్ ఎండీ ఉన్నట్టు తెలియడంతో పోలీస్ బృందం శుక్రవారం రాత్రి సదరు ఛానల్ ఎండీ నివాసంలో తనిఖీలు జరిపారు. కొన్ని కీలక డాక్యుమెంట్లు సీజ్ చేసినట్టు సమాచారం. ఛానల్ ఆఫీస్‌లో ప్రత్యేక సర్వర్ రూం ఏర్పాటు చేసి వేర్వేరు పార్టీల నాయకులు, వ్యాపార, వాణిజ్య, పారిశ్రామికవేత్తల ఫోన్లు ట్యాప్ చేసి వివరాలు సేకరించినట్టు ప్రణీత్ రావు విచారణలో చెప్పినట్టు తెలిసింది. కాగా, ఏ క్షణమైనా పోలీస్ దాడులు జరగొచ్చని ఊహించిన సదరు ఛానల్ ఎండీ విదేశాలకు పారిపోయినట్టు సమాచారం.

నేటితో ముగియనున్న కస్టడీ..

ఇక, ప్రణీత్​రావు కస్టడీ నేటితో ముగియనుంది. ఈ క్రమంలో పోలీసులు సాయంత్రం ఆయనను నాంపల్లిలోని కోర్టులో హాజరు పరిచి ఆ తర్వాత చెంచల్‌గూడ జైలుకు రిమాండ్​చేయనున్నారు. దానికి ముందు అతనికి వైద్య పరీక్షలు జరిపిస్తారు. కస్టడీలో ప్రణీత్​రావు వెల్లడించిన వివరాలను దర్యాప్తు బృందం నివేదిక రూపంలో కోర్టుకు సమర్పించనుంది.



Next Story