సీఎం కేసీఆర్ వద్దకు ఫైలు.. దసరా నుంచి పట్టాలెక్కనున్న కొత్త పథకం!

by GSrikanth |
సీఎం కేసీఆర్ వద్దకు ఫైలు.. దసరా నుంచి పట్టాలెక్కనున్న కొత్త పథకం!
X

సొంత జాగా ఉన్న పేదలు ఇల్లు నిర్మించుకునేందు రూ.3 లక్షల చొప్పున ఇవ్వనున్నట్టు సీఎం కేసీఆర్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పథకం దసరా నుంచి కొత్త ఇండ్ల నిర్మాణం పట్టాలెక్కనుంది. రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఇందుకోసం విధివిధానాలను రూపొందించి సీఎం కేసీఆర్‌కు పంపింది. తొలుత సెగ్మెంట్‌కు మూడు వేల ఇండ్లు మంజూరు ఇవ్వాలని భావించినా ఆర్థిక కష్టాల కారణంగా వెయ్యికి కుదించారు. పునాదులు తీసిన తర్వాత తొలి పేమెంట్ ఇవ్వాలని అధికారులు మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. లబ్ధిదారుల ఎంపిక బాధ్యత ఎమ్మెల్యేలకు అప్పగించే యోచనలో ఉన్నట్టు తెలిసింది. దీనిపై సీఎం కేసీఆర్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: ఇండ్ల నిర్మాణానికి ఆర్థికసాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ అవుతున్నది. ఇందుకోసం హౌసింగ్ శాఖ విధివిధానాలను రూపొందించి సీఎం కేసీఆర్‌కు ఫైలును పంపింది. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌కు తొలివిడత వెయ్యి ఇండ్లకు మాత్రమే మంజూరు చేయాలని సర్కారు భావిస్తన్నట్టు సమాచారం. తొలుత మూడు వేల ఇండ్లు నిర్మించాలని భావించినప్పటికీ కేంద్రం నుంచి నిధులు వచ్చే ఆశలు సన్నగిల్లడంతో సొంత నిధులపైనే ఆధార పడాల్సి వస్తుంది. దీంతో వెయ్యి ఇండ్లకు కుదించినట్టు తెలిసింది. సొంత స్థలం ఉంటే ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షలు ఇచ్చేందుకు ప్రభుత్వం పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద అర్హుల ఎంపిక కీలకంగా మారనుంది. హౌసింగ్ సంస్థ మార్గదర్శకాల ప్రకారం గ్రామస్థాయిలో టీఆర్ఎస్ కార్యకర్తలకు ఈ పథకం వర్తించడం కష్టతరంగా మారుతుందనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్​ఫైల్‌ను పక్కన పెట్టారని సమాచారం. కొన్ని కీలక మార్పులు చేసిన తర్వాతే అప్రూవ్ చేసే అవకాశం ఉన్నది. హౌసింగ్ సంస్థ రూపొందించిన విధివిధానాల ప్రకారం..లబ్ధిదారుల ఎంపిక బాధ్యత కలెక్టర్లకు ఉండే అవకాశం ఉన్నది. ఈ మేరకు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికే అవకాశం ఇవ్వాలని, గరిష్ఠంగా రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించాలని అధికారులు ప్రభుత్వానికి పంపించిన రిపోర్టులో సూచించారు. డబుల్​బెడ్ రూం ఇండ్ల కోసం ఎదురుచూస్తున్న వారికి కూడా ఈ ఇండ్ల మంజూరులో చాన్స్​ఇవ్వనున్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల కోసం దరఖాస్తులు చేసుకొని ఉండి.. ఇండ్లు రాని వారికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. మంజూరులో ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించనున్నారు. ఆయా ప్రాంతాల్లోని ఎస్సీ, ఎస్టీలు, పేదలు, వారి స్థితిగతులను పరిగణలోకి తీసుకొని లబ్థిదారులను ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు.

సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా..

2014లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా పేదరికాన్ని నిర్ధారించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఆ సమయంలో సొంత ఇల్లు లేనట్టుగా నమోదు కావాలని, సొంత స్థలం, ప్రభుత్వం మంజూరు చేసిందా..? అనే పూర్వ వివరాలు ఆన్‌లైన్‌లో పక్కాగా ఉండాలని, గతంలో ప్రభుత్వం నుంచి గృహం పొంది ఉండరాదని పేర్కొన్నది. కచ్చితంగా గ్రామసభల్లో లబ్ధిదారుల జాబితాను ప్రకటించాలని, అభ్యంతరాలు వస్తే దానిపై మండల స్థాయి అధికారితో విచారణ చేయించాలని, గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 75 గజాలు, పట్టణ ప్రాంతాల్లో 50 గజాల నుంచి 75 గజాల మధ్య జాగా ఉండాలని, కింద ఒక గది, పైన మరో గది నిర్మించుకునేందుకు అనుమతించే పక్షంలో కనీస స్థలం 35 గజాలకూ ఒకే చేయాలని మార్గదర్శకాలు రూపొందించారు.

సొంత నిధులే శరణ్యం

ప్రతి నియోజకవర్గంలో 3 వేల ఇండ్ల నిర్మాణానికి సాయం అందించాలని సర్కారు తొలుత భావించింది. ఆర్థిక ఇబ్బందులు కారణంగా ఆ సంఖ్యను కాస్తా వెయ్యికి కుదించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వచ్చే నిధులకు రాష్ట్ర ప్రభుత్వం కొంత మొత్తాన్ని కలిపి ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. 3 లక్షలు ఇవ్వాలన్నది కేసీఆర్ ప్లాన్. ఈ నేపథ్యంలో 1.69 లక్షల పీఎంఏవై అర్బన్ పథకంలో ఇండ్లను మంజూరు చేయాలని కేంద్రానికి లేఖ రాశారు. గతంలో ఇచ్చిన ఇండ్లకు యూసీలు ఇవ్వాలని కేంద్రం మెలిక పెట్టింది. దాంతోపాటు ఈ 1.69 లక్షల ఇండ్లకు ముందుగా లబ్ధిదారుల జాబితా ఇవ్వాలని, లేని పక్షంలో నిధులు ఇవ్వడం సాధ్యం కాదని కుండబద్దలు కొట్టింది. రాష్ట్రం దగ్గర జాబితా లేకపోవడంతో ఈ పథకం రాదని తేలిపోయింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా నిధులు వెచ్చించాల్సి వస్తున్నది.

తొలి ప్రాధాన్యం ఎవరికి?

రాష్ట్ర ప్రభుత్వం ముందు కొత్త సమస్య వచ్చింది. ప్రస్తుతం హౌసింగ్, రెవెన్యూ అధికారులు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉంటుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేలకు, మంజూరులో పార్టీ కార్యకర్తలకు కచ్చితంగా ప్రాధాన్యం ఇస్తామని సీఎం కేసీఆర్ నుంచి మొదలుకుని ఎమ్మెల్యే వరకు చెప్తూనే ఉన్నారు. ఇప్పుడిచ్చిన నిబంధనల ప్రకారం ఆ చాన్స్​ ఉండదు. అందుకే కొన్ని మార్పులకు సీఎం కేసీఆర్ సూచనలు చేసినట్లు అధికారులు చెప్తున్నారు.

ఖర్చుల పేరిట రూ. 25 వేలు కోత!!

ఈ దసరా వరకు మార్గదర్శకాలు సిద్ధం చేసి, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇండ్ల నిర్మాణాలు మాత్రం వచ్చే ఏడాది వరకు మొదలుకానున్నాయి. ప్రభుత్వం అందించే రూ.3 లక్షల్లో రూ. 25 వేల వరకు వివిధ రూపాల్లో తగ్గించనున్నట్లు సమాచారం. పునాదులు దాటి, స్లాబ్ లెవల్‌కు వచ్చిన తర్వాతే తొలి బిల్లు ఇవ్వాలని అధికారులు నిబంధనలు పెట్టారు. ముందుగా రూపాయి ఇవ్వొద్దని, గతంలో ఆ విధంగా ఇస్తే అక్రమాలు జరిగాయని నివేదించారు. దీంతో వచ్చే ఏడాదిలోనే బిల్లుల చెల్లింపు ప్రక్రియ మొదలుకానుంది.

Also Read : ఇండ్ల నిర్మాణ పథకం మార్గదర్శకాలు సిద్ధం.. తొలి ప్రాధాన్యత వారికే..?

Next Story