అసలు మార్కులు 97.. వేసింది 77.. ఇంటర్ వాల్యుయేషన్‌లో ఇష్టారాజ్యం

by Rajesh |
అసలు మార్కులు 97.. వేసింది 77.. ఇంటర్ వాల్యుయేషన్‌లో ఇష్టారాజ్యం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇంటర్ బోర్డు వైఫల్యం మరోసారి బయటపడింది. వాల్యుయేషన్ ప్రక్రియలో డొల్లతనంతో మరోసారి ఇది రుజువైంది. అసలు మార్కులు 97 వస్తే.. 77 వేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రీవెరిఫికేషన్‌లోనూ ఈ తప్పును సరిదిద్దుకోకపోగా ఆ తప్పును కప్పి పుచ్చుకునేందుకు మరో తప్పు చేశారు. జవాబుపత్రాన్ని డౌన్‌లోడ్ చేసుకుని చూడటంతో ఈ విషయం బట్టబయలైంది. హైదరాబాద్‌కు చెందిన సంహిత అనే యువతి ఎంఈసీ చదువుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో సెకండియర్ పరీక్షలు రాసింది. ఏప్రిల్ 24న ఫలితాలు రిలీజ్ అవ్వగా మొత్తం 926 మార్కులు సాధించింది. సెకండియర్ కామర్స్‌లో 77 రావడంతో రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకుంది. జవాబు పత్రాన్ని చూసుకున్నాక 97 మార్కులు వచ్చాయని తేలింది. ఈ అంశాన్ని బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని సమాచారం.

వాల్యుయేషన్‌లో ఇష్టారాజ్యం

ఇంటర్ వాల్యుయేషన్ ప్రక్రియలో ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతోనే ఇలాంటి తప్పిదం జరిగిందనే విమర్శలు వస్తున్నాయి. అసిస్టెంట్ ఎగ్జామినర్ వద్దే ఈ తప్పు జరిగినట్లుగా తెలుస్తోంది. వచ్చిన మార్కులను కౌంట్ చేసి వేసే సమయంలో ఈ తప్పు జరిగే చాన్స్ ఉందని చెబుతున్నారు. అసిస్టెంట్ ఎగ్జామినర్ ఒరిజినల్‌గా 97 మార్కులు వస్తే 77 వేసినట్లుగా తెలుస్తోంది. ఈ అంశాన్ని స్క్రూటినీ పరిశీలించి సదరు అసిస్టెంట్ ఎగ్జామినర్‌ను ప్రశ్నించగా.. భయం వల్లనో, నిర్లక్ష్యం వల్లనో మార్కులను దిద్ది తాను వేసిందే.. కరెక్ట్ అన్నట్లుగా వ్యవహరించారనే అనుమానం వ్యక్తమవుతోంది. ఫలితాలు విడుదలయ్యాక రీవెరిఫికేషన్‌లో అయినా తప్పును సరిదిద్దుకోవాల్సి ఉన్నా బోర్డు సైతం నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రీ వెరిఫికేషన్‌కు 48 వేల దరఖాస్తులు

గతంలో బీఆర్ఎస్ సర్కార్ హయాంలో గ్లోబరీనా సంస్థకు ఇంటర్ వాల్యుయేషన్‌కు టెండర్లు ఇవ్వడంతో ఎంతో మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. ఆ బాధతో ఎందరో ఆత్మహత్య చేసుకున్నారు. ఆ ఘటన నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న తరుణంలో మళ్లీ మార్కుల విషయంలో ఇలాంటి తప్పిదం జరగడంపై విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నల్లగొండ వాల్యుయేషన్ కేంద్రంలో ఈ తప్పు జరిగిందని సమాచారం. మార్కులు తప్పుగా వేయడంతో ఈ ఒక్క విద్యార్థినికే అన్యాయం జరిగిందా? ఇంకా ఇతర విద్యార్థులకు ఇలాగే జరిగిందా? అనే అనుమానాలు మొదలయ్యాయి. రీవెరిఫికేషన్‌కు మొత్తం 48 వేల అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. అందులో దాదాపు 70 మందికి 2 నుంచి 10 మార్కుల వరకు పెరిగాయని సమాచారం. అయితే ఎక్కువ మార్కులు వచ్చినా తక్కువ వేయడంతో సంహితకు న్యాయం చేయాలనే డిమాండ్లు వస్తున్నాయి.

97 మార్కులు వేయాల్సిందే..

నాకు అన్ని సబ్జెక్టుల్లో మంచి మార్కులు వచ్చాయి. కామర్స్ సబ్జెక్టులో తక్కువ రావడంతో అనుమానం వచ్చి రీవెరిఫికేషన్‌కు అప్లికేషన్ పెట్టాను. అప్పుడు మళ్లీ 77 మార్కులే వేశారు. జవాబు పత్రం ఆధారంగా 97 మార్కులు వచ్చాయని నిర్ధారించుకున్నాను. అందులో జవాబులకు వేసిన మార్కులను దిద్దినట్లుగా స్పష్టంగా అర్థమవుతోంది. ఈ నెల 20వ తేదీన ఈ విషయాన్ని బోర్డు దృష్టికి తీసుకెళ్లాను. ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. 97 మార్కులు వేసి న్యాయం చేయాలి.

- సంహిత, ఇంటర్ ఎంఈసీ విద్యార్థిని

Next Story

Most Viewed