12 జడ్పీ స్థానాలపై నజర్.. మహారాష్ట్రలో బీఆర్‌ఎస్ స్కెచ్ ఇదే!

by Disha Web Desk 4 |
12 జడ్పీ స్థానాలపై నజర్.. మహారాష్ట్రలో బీఆర్‌ఎస్ స్కెచ్ ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ పార్టీని దేశ వ్యాప్తంగా విస్తరిస్తామని చెబుతున్న సీఎం కేసీఆర్ ఆ మేరకు వేగంగా అడుగులు వేస్తున్నారు. తొలుత తమకు కలిసొస్తుందని భావిస్తున్న పక్క రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలపై సీఎం కేసీఆర్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో మహారాష్ట్రలో తొలుత తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు గులాబీ బాస్ పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా మహారాష్ట్రలో జడ్పీ స్థానాలపై సీఎం కేసీఆర్ గురి పెట్టారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం తర్వాత తమకు కలిసొచ్చిన స్థానిక సంస్థలతోనే బీఆర్ఎస్ ప్రస్థానాన్ని ఇతర రాష్ట్రాల్లో ప్రారంభించాలని స్కెచ్ వేశారు.

పోటీ అక్కడి నుంచే..

భారత రాష్ట్ర సమితి తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాల్లో పోటీకి సిద్ధమైంది. మహారాష్ట్రలోని 34 జిల్లా పరిషత్ స్థానాలకు గాను 12 స్థానాల్లో పోటీకి సై అంటుంది. ఈ నెలలో బీఆర్ఎస్ చీఫ్ సీఎం కేసీఆర్ విదర్భలో మూడో బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే మహారాష్ట్రలో బీఆర్ఎస్ రెండు బహిరంగ సభలను నిర్వహించింది. ఇటీవల కందర్ లోహలో రెండో సభను బీఆర్ఎస్ నిర్వహించిన సంగతి తెలిసిందే.

మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేసీఆర్ ఇప్పటికే పార్టీ కమిటీలను ఏర్పాటు చేయాలని ఆ పార్టీ లీడర్లను ఆదేశించారు. తెలంగాణ మోడల్‌ను, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు. అయితే ఇటీవల మహారాష్ట్రలోని మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, జ్పడీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు బీఆర్ఎస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. పార్టీ ముఖ్య నేతలు తెలిపిన సమచారం ప్రకారం.. కేసీఆర్ ప్రతి రోజు మహారాష్ట్రలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై టెలికాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్నట్లు తెలిసింది.

టెలికాన్ఫరెన్స్‌లో ఆ అంశాలపై గైడెన్స్

మహారాష్ట్రలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఇప్పటికే ఎంపిక చేసిన కొంత మంది నాయకులతో కేసీఆర్ టెలికాన్ఫరెన్స్‌లలో జిల్లా పరిషత్ ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. 2024 అక్టోబర్‌లో మహారాష్ట్రలో జరిగే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై యాక్షన్ ప్లాన్ ను ముఖ్య నేతలకు సీఎం కేసీఆర్ వివరించినట్లు తెలుస్తోంది.

పార్టీ యాక్టివిటీస్ విషయంలో కేసీఆర్ వారికి పలు అంశాల్లో డైరెక్షన్ ఇచ్చినట్లు సమచారం. అయితే ఇప్పటికే ఉత్తర్ ప్రదేశ్, ఒడిసా, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, ఇతర రాష్ట్రాల నేతలు బీఆర్ఎస్‌లో చేరిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలో లోకల్ బాడీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో కేసీఆర్ అక్కడ స్పెషల్ ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. తూర్పు ప్రాంతంలోని విదర్భ రీజియన్‌లో మీటింగ్ పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. త్వరలోనే వెస్ట్ ప్రాంతంలో కూడా మరో మీటింగ్ ఉండనున్నట్లు తెలుస్తోంది.

త్వరలోనే సీఎం కేసీఆర్ మహారాష్ట్రలోని ముంబాయి, పూణే, నాగ్ పూర్, ఔరంగాబాద్‌లలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలను ప్రారంభించనున్నట్లు సమాచారం. తద్వారా పార్టీ కార్యక్రమాలను మహారాష్ట్రలో మరింత పెంచాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు తెలిసింది. మరి కేసీఆర్ ప్లాన్ మరాఠీ గడ్డపై ఏ మేరకు ప్రభావం చూపుతుంది. 12 జడ్పీ స్థానాల్లో గులాబీ పార్టీ ఏ మేరకు ప్రభావం చూపనుందన్నది మరి కొన్ని రోజుల్లో తేలనుంది.

Next Story

Most Viewed