దేశవ్యాప్తంగా సీక్రెట్ రెయిడ్స్.. మెడికల్ కాలేజీల్లో మళ్లీ మొదలైన గుబులు!

by Disha Web Desk 2 |
దేశవ్యాప్తంగా సీక్రెట్ రెయిడ్స్.. మెడికల్ కాలేజీల్లో మళ్లీ మొదలైన గుబులు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీలకు మళ్లీ గుబులు మొదలైంది. ప్రైవేట్ మెడికల్ కాలేజీల యాజమాన్యాలతో పాటు ప్రభుత్వ కాలేజీల ఆఫీసర్లూ ఆందోళనలో ఉన్నారు. దేశ వ్యాప్తంగా నేషనల్ మెడికల్ కమిషన్​సీక్రెట్ రెయిడ్స్​ఇప్పుడు మెడికల్ కాలేజీలకు షాక్ ఇస్తున్నాయి. తాజాగా రాష్ట్రంలో ఓ ప్రైవేట్ కళాశాల గుర్తింపు రద్దు చేయడంతో మిగతా కాలేజీల్లోనూ కాస్త భయాందోళన నెలకొన్నది. ఈ నెలలో మరోసారి ఎన్ఎంసీ తనిఖీలకు రానున్నది. దీంతో నిబంధనలు ప్రకారం లేని కాలేజీల పర్మిషన్లు రద్దు చేయనున్నారు. ఇది ఇప్పుడు మెడికల్ కాలేజీలకు గుబులు పెట్టిస్తోన్నది. గడిచిన రెండు నెలల్లో దేశ వ్యాప్తంగా దాదాపు 40 మెడికల్ కాలేజీలకు పర్మిషన్లు క్యాన్సిల్ కావడంతో ప్రైవేట్ మెడికల్ కాలేజీల యాజమాన్యాలు తలలు పట్టుకుంటున్నాయి. వీటిలో మెజార్టీ తొలిసారి గ్రీన్​సిగ్నల్​పొందినవే కావడం గమనార్హం.

మౌలిక సదుపాయాలు, మ్యాన్ ​పవర్ ​మస్ట్

మెడికల్ కాలేజీకి పర్మిషన్​రావాలంటే ఎన్ఎంసీ రూల్స్​తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. వీటిలో మౌలిక సదుపాయాలు, మ్యాన్​పవర్​తప్పనిసరిగా నిబంధనలు ప్రకారం ఉండాల్సిందే. తొలిసారి ఎన్ఎంసీ తనిఖీ చేసిన తర్వాత లోపాలు గుర్తిస్తే సవరించుకునేందుకు అవకాశం ఇస్తుంది. అప్పటికీ మార్పులు చేయకపోతే ఆ ఏడాది అడ్మిషన్స్‌ ప్రక్రియ కొనసాగించడానికి వీలుండదు. పర్మిషన్లు వచ్చిన తర్వాత కూడా ఎన్ఎంసీ మధ్యలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించే అవకాశం ఉన్నది. అప్పుడు కూడా ప్రొఫెసర్లు, ల్యాబ్‌లు, ఫ్యాకల్టీ, నాన్​ఫ్యాకల్టీ స్టాఫ్, ఎక్విప్​మెంట్లు, క్లినికల్స్ కొరకు ఆసుపత్రి రూల్స్ ప్రకారం బెడ్లు, సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ వంటివి లేకుంటే వెంటనే పర్మిషన్‌ను రద్దు చేస్తూ ఎన్ఎంసీ ఉత్తర్వులు ప్రకటిస్తుంది.

ఇవి అనుమానాలు..?

ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్​కాలేజీల్లో చాలామంది ప్రొఫెసర్లు, ఫ్యాకల్టీ రూల్స్​ప్రకారం లేరనేది ఎన్ఎంసీ అనుమానం. కొన్ని కాలేజీల్లో ప్రొఫెసర్లు, టీచింగ్ ఫ్యాకల్టీ రోజుల తరబడి రాకుండా కాలేజీలను నెట్టుకొస్తున్నారనే అభిప్రాయం ఎన్ఎంసీలో ఉన్నది. మరికొన్ని కాలేజీల్లో చుట్టపు చూపుగా వస్తున్న స్టాఫ్ కూడా ఉన్నారని ఎన్ఎంసీ అధికారులు ఇటీవల తనిఖీల్లో గుర్తించారు. దీని వలన విద్యార్ధులకు క్వాలిటీ ఎడ్యుకేషన్​అందడం లేదని ఎన్ఎంసీ వాదన. అంతేగాక సేప్టీ కొరకు సీసీ కెమెరాలు, డ్యూటీ అవర్స్​కౌంట్‌కు బయోమెట్రిక్ వంటివి కూడా ఏర్పాటు చేయని కాలేజీలు ఉన్నట్లు నేషనల్ మెడికల్​కమిషన్​ఆఫీసర్లు చెబుతున్నారు. దీంతోనే సీక్రెట్ రెయిడ్స్​చేపడుతున్నట్లు పేర్కొంటున్నారు. వివిధ రకాల సోర్సుతో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా దేశ వ్యాప్తంగా 102 కాలేజీలపై తమకు అనుమానం ఉన్నదని ఎన్ఎంసీ తాజాగా ప్రకటించింది. ఇందులో ప్రభుత్వ కాలేజీలూ ఉన్నట్లు పేర్కొనడం ఇప్పుడు సంచలనమైంది. ఇదిలా ఉండగా, తెలంగాణలో జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు ప్రాసెస్​వేగంగా జరుగుతుంది. అయితే అందులో అవసరమైన ప్రొఫెసర్లు, స్టాఫ్​సరిగ్గా లేరనేది స్వయంగా వైద్యాధికారులే చెబుతున్నారు. ఈ నేపథ్యలో ఎన్ఎంసీ రెయిడ్స్‌లో అధికారులు ఏం చెబుతారో? అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. రూల్స్ ప్రకారం లేకుంటే ప్రభుత్వ కాలేజీల పర్మిషన్లను కూడా ఎన్ఎంసీ రద్దు చేసే ప్రమాదం ఉన్నది.

Next Story