నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడ్డ వ్యక్తి నారాయణ

by GSrikanth |
నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడ్డ వ్యక్తి నారాయణ
X

దిశ, చిలుకూరు: 1940వ దశకంలో నిజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు, ఉమ్మడి నల్లగొండ జిల్లా సీపీఐ మాజీ కార్యదర్శి, చిలుకూరు మాజీ ఎంపీపీ దొడ్డా నారాయణరావును ఆదివారం హైదరాబాద్‌లో సీపీఐ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సభలో సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా ఆయన్ను సత్కరించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నారాయణరావు పేరు ఎందరికో సుపరిచితం. 95 ఏళ్ల వయస్సు దాటినా, ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నా తాను నమ్మిన సిద్ధాంతం కోసం కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో ఎక్కడ సీపీఐ సమావేశం, సభలు జరిగినా నేటికీ పాల్గొంటూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఆదివారం జరిగిన సభలో సీపీఐ జాతీయ మాజీ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, ప్రజాకవి, వాగ్గేయకారుడు జయరాజ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మాజీ ఇంజినీర్ ఇన్ చీఫ్ హనుమంతరావుతో పాటు దొడ్డా నారాయణరావును సన్మానించారు. ఆయన వెంట సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గన్నా చంద్రశేఖర్, సూర్యాపేట జిల్లా సీపీఐ కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, గీతపనివారల సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు కొండా కోటయ్య ఉన్నారు. ఈ సన్మానంపై ఉమ్మడి నల్లగొండ జిల్లా సీపీఐ శ్రేణులతో పాటు పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.



Next Story

Most Viewed