నిరుద్యోగి.. నిర్వేదం

by Disha Web Desk 12 |
నిరుద్యోగి.. నిర్వేదం
X

నిరుద్యోగులు పల్లెలు వదిలి పట్టణాల బాట పట్టారు. ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ ఉద్యోగాల వేటలో ఉన్న ఊరికి, కన్నవారికి దూరమై పండుగలు పబ్బాలకు దూరంగా ఉంటున్నారు. కాలే కడుపుతో బాధలను దిగమింగుతూ తమ బతుకులు చిన్నవే అయినా ఉన్నతమైన కలల కోసం నిద్రాహారాలు మాని పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఉద్యోగం కోసం సంవత్సరాలుగా వేచి చూస్తూ పరీక్షలు రాస్తున్నారు. ఈ సమయంలో ప్రశ్నపత్రాల లీకేజీలతో ఒక్కసారిగా తెలంగాణ టీఎస్పీఎస్సీ పెద్ద అణు బాంబు పేల్చింది. ఆ ఘటనతో యావత్తు తెలంగాణ నిరుద్యోగ యువత గుండెకు గాయం చేసింది. తెలంగాణ రాష్ట్రం వస్తే ఆత్మహత్యలు లేని తెలంగాణ వస్తుంది. మన ఉద్యోగాలు మనకు వస్తాయని ప్రత్యేక రాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసుకున్న నిరుద్యోగ యువతకు మాత్రం నిర్వేదమే మిగిలింది.

దిశ, నల్లగొండ : నిరుద్యోగులు పల్లెలు వదిలి పట్టణాల బాట పట్టారు. ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ ఉద్యోగాల వేటలో ఉన్న ఊరికి, కన్నవారికి దూరమై పండుగలు పబ్బాలకు దూరంగా ఉంటున్నారు. కాలే కడుపుతో బాధలను దిగమింగుతూ తమ బతుకులు చిన్నవే అయినా ఉన్నతమైన కలల కోసం నిద్రాహారాలు మాని పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఉద్యోగం కోసం సంవత్సరాలుగా వేచి చూస్తూ పరీక్షలు రాస్తూ ఉన్న సమయంలో పేపర్ లీకులతో ఒక్కసారిగా తెలంగాణ టీఎస్పీఎస్సీ పెద్ద అణుబాంబును పేల్చింది. ఆ ఘటనతో యావత్తు తెలంగాణ నిరుద్యోగ యువత గుండెకు గాయం చేసింది. తెలంగాణ రాష్ట్రం వస్తే ఆత్మహత్యలు లేని తెలంగాణ వస్తుంది. ఉద్యోగాలు మనకు వస్తాయని ప్రత్యేక రాష్ట్రం స్వప్నం సాకారం చేసుకున్నా నిరుద్యోగ యువతకు మాత్రం నిర్వేదమే మిగిలింది.

నల్లగొండ జిల్లా మల్టీ జోన్-2లో జోనల్ వ్యవస్థలో 5వ జోన్ నల్లగొండ, యాదాద్రి, సూర్యాపేట, జనగామ నాలుగు జిల్లాలు ఉన్నాయి. మొన్నటికి మొన్న కానిస్టేబుల్ దేహదారుడ్య పరీక్షల్లో 26 వేల మంది నల్లగొండలో పాల్గొంటే 12,124మంది అర్హత సాధించారు. ఎస్ఐ దేహదారుడ్య పరీక్షల్లో 19,260మందికి గాను 9,235 అర్హత సాధించారు. వీళ్లు నల్లగొండ జిల్లా కేంద్రానికి అందుబాటులో ఉన్న వారు మాత్రమే ఉమ్మడి నల్లగొండ జిల్లా అభ్యర్థులు చాలా మేరకు హైదరాబాద్‌లో కూడా దేహదారుడ్య పరీక్షలకు హాజరయ్యారు.

ఇది ఇలా ఉంటే ఉమ్మడి నల్లగొండ నుంచి పోటీ పరీక్షల కోసం దాదాపు 3లక్షల పై చిలుకు మంది అభ్యర్థులు గ్రూప్స్‌కు, ఇతర ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. ఒక్క నల్లగొండ జిల్లా కేంద్రంలోనే దాదాపు 15 ప్రైవేటు స్టడీ సర్కిల్స్, దొడ్డి కొమురయ్య లైబ్రరీ, ఏబీవీపీ, సెంట్రల్ లైబ్రరీ, ఎన్జీ కళాశాల లైబ్రరీలలో కలిపి దాదాపు 15 వేల మంది నిరుద్యోగులు ప్రతి రోజు చదువుతున్నారు. భువనగిరి, సూర్యాపేట, మిర్యాలగూడ, కోదాడ ఈ పట్టణాల్లో కూడా వేలాది మంది గ్రామాల నుంచి నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం హాస్టళ్లు, కిరాయి రూముల్లో ఉంటూ చదువుతున్నారు.

మానసిక క్షోభకు గురవుతున్నా

ఎన్నో సంవత్సరాలుగా నోటిఫికేషన్లు లేక ఉన్న నోటిఫికేషన్లకు ప్రిపేర్ అవుతున్నాను. ఈ సందర్భంలో ఇలా పేపర్లు లీకు అవుతున్నాయనే వార్త నాతోపాటు నా తోటి నిరుద్యోగులను మానసిక క్షోభకు గురి చేసింది. ఎంత చదివినా ప్రయోజనం లేదనిపిస్తుంది. ఇకనైనా మా బాధను అర్థం చేసుకొని పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాలి. టీఎస్పీఎస్సీ ని రద్దు చేయాలి.- షేక్ ఖాజా మోయినుద్దీన్, కోదాడ

కేసీఆర్‌కు మేమంటే ఏంటో చూపిస్తాం..

పేద కుటుంబంలో పుట్టిన ఉన్నత చదువులు చదువుకున్న. రాత్రి, పగలు తేడా లేకుండా కంటి మీద కునుకు లేకుండా ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నాను. ఉద్యోగాల కోసం సాధించుకున్న తెలంగాణలో ఇలా పేపర్లు లీక్ చేస్తూ కేసీఆర్ ప్రభుత్వం మాకు అన్యాయం చేస్తున్నారు. నిరుద్యోగులంతా కలిసి వచ్చే ఎన్నికల్లో మేము ఏంటో చూపిస్తాం. అక్రమాలకు పాల్పడిన నిందితులను వెంటనే శిక్షించాలి. టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డిని వెంటనే తొలగించాలి.:- మూడవత్ నాగు, నల్లగొండ

మాకు న్యాయం చేయాలి

ప్రభుత్వం మాకు న్యాయం చేయాలి. ఉద్యోగం కోసం మా కన్నా వారికి దూరంగా తిని తినక చదువుతూ ఉద్యోగాల కోసమే వేచి చూస్తున్నాం. ఈ తరుణంలో ఇలా పేపర్ లీకులు చేస్తుంటే చదవాలా వద్దా అనే అయోమయానికి గురవుతున్నాం. దీనిపై సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు చేసి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి. సీఎం కేసీఆర్ ఈ విషయంపై స్పందించాలి.- : యుగేందర్, కనగల్



Next Story