అనుమతులు పరిమితం.. అమ్మకాలు అనంతం..

by Dishafeatures2 |
అనుమతులు పరిమితం.. అమ్మకాలు అనంతం..
X

దిశ, నిఘా ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి డెవలప్‌మెంట్ చేసి ప్రపంచ స్థాయి కీర్తిని సంపాదిస్తుంటే.. కొంతమంది అధికారులు రియల్ వ్యాపారులతో కలిసి యాదాద్రి ప్రతిష్టను మసకబారుస్తున్నారు. యాదాద్రి పరిధిలో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న వెంచర్లలో నిబంధనలు గాలికొదిలేసి.. ప్లాట్ల క్రయవిక్రయాలు చేస్తున్నా.. అధికారుల మౌనమే రాజ్యమేలుతోంది.

భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో పీఆర్ఆర్ఆర్ యాజమాన్యం ఏర్పాటు చేసిన 'యాదాద్రి ఐకాన్'కు అనుమతులు గొరంత ఉంటే.. కొండంతగా చేసి అమ్మేస్తుండడం గమనార్హం. ఈ వెంచర్‌కు కేవలం 5 ఎకరాల్లో మాత్రమే వైటీడీఏ అనుమతులు ఉన్నాయి. కానీ అంతకు నాలుగు రెట్ల విస్తీర్ణంలో ప్లాట్ల అమ్మకాలు సాగిస్తున్నారు.

నిజానికి ఈ వెంచర్ ఇంకా అండర్ డెవలప్‌మెంట్ ప్రాసెస్‌లోనే ఉంది. పూర్తిగా డెవలప్‌మెంట్ చేసేందుకు ఇంకా ఏడాదికి పైగానే సమయం పడుతుంది. కానీ యాజమాన్యం ఇప్పటికే ప్లాట్ల అమ్మకాలను షురూ చేసింది. వాస్తవానికి వెంచర్ డెవలప్‌మెంట్ కాకుండా ఎలాంటి ప్లాట్ల విక్రయాలు చేయోద్దనేది నిబంధన. కానీ వెంచర్ యాజమాన్యం వాటిని గాలికొదిలేసింది. దీనికి కొంతమంది అధికారులు వంత పాడడంతో మూడు పువ్వులు.. ఆరు కాయలుగా రియల్ వ్యాపారం జోరుగా సాగుతోంది.

జేసీ ఆదేశాల మేరకు రిజాయిండర్..

పీఆర్ఆర్ఆర్ వెంచర్ యాజమాన్యం అక్రమ బాగోతంపై 'దిశ' దిన పత్రికలో కథనం ప్రచురితమయ్యింది. 5 ఎకరాలకు అనుమతులు తీసుకుని ఎక్కువ విస్తీర్ణంలో ప్లాట్ల విక్రయించడం.. వెంచరులో డెవలప్‌మెంట్ లేకుండానే కస్టమర్లకు మాయ మాటలు చెప్పి ప్లాట్లను అంటగడుతున్నారనేది అందులోని సారాంశం. దీనిపై భువనగిరి మున్సిపాలిటీ క్షేత్రస్థాయిలో పరిశీలించామని, ఆ వెంచర్ డెవలప్‌మెంట్ ప్రాసెస్‌లో ఉందంటూ యాదాద్రిభువనగిరి జేసీ దీపక్ తివారీ ఆదేశాల మేరకు రిజాయిండర్ విడుదల చేసింది.

అయితే వెంచర్ డవలప్‌మెంట్ చేయకుండానే ప్లాట్ల విక్రయాలు చేయడంపై ఎలాంటి సమాచారం అందులో పేర్కొనలేదు. ఆ విషయంపై స్పష్టత ఇవ్వకపోవడం.. కస్టమర్లను మరింతగా గందరగోళంలో పడేసిందనే చెప్పాలి. డెవలప్‌మెంట్ చేయకుండా ప్లాట్లను విక్రయిస్తే.. అధికారులు పట్టించుకోరా..? అసలు వెంచర్ డెవలప్ లేకుండానే ప్లాట్లు అమ్ముకోవచ్చా..? అన్నది అధికారులకే తెలియాలి.

టీఎస్ రెరాకు ఫిర్యాదుల పర్వం..

భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని రాయగిరి- మోత్కూర్ రహదారిలో యాదాద్రి ఐకాన్ పేరుతో పీఆర్ఆర్ఆర్ సంస్థ వెంచర్ ఏర్పాటు చేసింది. వైటీడీఏ విధించిన నియమాలన్నీ ఆ సంస్థ రూపొందించిన బ్రోచర్లలో కనిపిస్తాయి. కానీ తీరా వెంచర్‌కి వెళ్లి చూస్తే ఎటువంటి డెవలప్మెంట్ కనిపించదు. ప్లాట్ల విక్రయాలు మాత్రం దర్జాగా సాగుతున్నాయి. ఈ వెంచర్‌పై ఇప్పటికే టీఎస్ రెరాకు సైతం పలువురు కస్టమర్లు ఫిర్యాదు చేశారు.

నీ అంతు చూస్తాం..

యాదాద్రి ఐకాన్ పేరుతో పీఆర్ఆర్ఆర్ యాజమాన్యం చేస్తోన్న మోసాలపై పలువురు కస్టమర్లు 'దిశ'ను సంప్రదించారు. దీంతో దిశ ప్రతినిధి క్షేత్రస్థాయి పర్యటన చేసి పీఆర్ఆర్ఆర్ మోసాలపై కథనం ప్రచురించింది. దాన్ని జీర్ణించుకోలేని వెంచర్ యాజమాన్యం 'మా పైనే వార్త రాస్తావా.. నీ అంతు చూస్తాం.. ప్లాట్లను అమ్ముకోవాలని కలెక్టర్ మాకు రాసిచ్చిండు. మాపై ఎట్లా రాస్తావు..?' అంటూ బెదిరింపులకు దిగారు. వెంచర్ డెవలప్‌మెంట్ చేయకుండానే ప్లాట్లు విక్రయించడం తప్పనే విషయం చెప్పేందుకు ప్రయత్నించినా.. యాజమాన్యం వినలేదు. మేం ప్రతి వెంచరులో ఇలాగే చేస్తాం.. ఇది మాకు కొత్త కాదంటూ దబాయించింది.

కస్టమర్లు నిలువు దోపిడీ..

నిజానికి యాదాద్రి ఐకాన్ పేరుతో 19 ఎకరాల్లో పీఆర్ఆర్ఆర్ సంస్థ వెంచర్ ఏర్పాటు చేసింది. కానీ వైటీడీఏ అనుమతులు కేవలం 5 ఎకరాలకు మాత్రమే ఉంది. పైగా ఎలాంటి డెవలప్‌మెంట్ పనులు పూర్తి కాలేదు. అయినా రంగురంగుల బ్రోచర్లు చూపి.. కస్టమర్లకు ప్లాట్లను అంటగట్టేస్తున్నారు. తీరా ప్లాట్లు అమ్మడం పూర్తయ్యాక.. ఎలాంటి డెవలప్‌మెంట్ చేయకుండానే చేతులేత్తేయడం షరా మాములే. ఇప్పటికే ఇలాంటి ఘటనలు భువనగిరి, యాదగిరిగుట్ట పరిధిలోని అనేక వెంచర్లలో జరిగాయి.

ప్లాట్లు కొని మోసపోయిన బాధితులు స్థానిక పోలిస్ స్టేషన్లను ఆశ్రయించడం ఇక్కడ కామన్ అయిపోయింది. ఇది రియల్ వ్యాపారులకు వరంగా మారింది. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం మేల్కొని ఈ దందాను అడ్డుకుంటుందా..? లేదా దినపత్రికల్లో వచ్చిన కథనాలకు రిజాయిండర్ ఇచ్చి చేతులు దులుపుకుంటుందా..? అన్నది వేచి చూడాల్సిందే.


Next Story

Most Viewed