దళిత బంధు మాకెందుకు ఇవ్వరు...గొట్టిపర్తి గ్రామస్తుల సూటి ప్రశ్న

by Disha Web Desk 15 |
దళిత బంధు మాకెందుకు ఇవ్వరు...గొట్టిపర్తి గ్రామస్తుల సూటి ప్రశ్న
X

దిశ,తుంగతుర్తి : మా ఓట్లతో గెలిచి ఈనాడు మమ్మల్ని విస్మరిస్తారా ? దళిత బంధు పథకం గ్రామంలోని అధికార పార్టీ వార్డు మెంబర్లు, నాయకులకే ఇస్తారా..? మా పట్ల చులకన ఎందుకు..? మా క్కూడా ఈ పథకం ఇవ్వాలి అంటూ మండలంలోని గొట్టిపర్తి గ్రామానికి చెందిన దళితులు మంగళవారం తుంగతుర్తి మండల పరిషత్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. అనంతరం ఎంపీడీవో భీమ్ సింగ్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళిత బంధు పథకంలో అర్హులైన వారిని మరిచి తమ ఓట్లతో గెలుపొందిన ప్రజాప్రతినిధులకే అందుతున్నాయని పేర్కొన్నారు. తాము ఓట్లు వేయకుంటే ప్రస్తుతం దళిత బంధు పొందుతున్న వారంతా ప్రజా ప్రతినిధిలు అయ్యే వారా ? అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికలప్పుడే గుర్తొస్తున్న తామంతా ప్రభుత్వం అందించే వివిధ పథకాలను అందుకోడానికి ఎందుకు గుర్తుకు రామని ప్రశ్నించారు. గ్రామంలో తమకు సొంత ఇండ్లు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన పేద దళితులను గుర్తించి దళిత బంధు ప్రకటించాలని కోరారు. కార్యక్రమంలో చింతకుంట్ల సైదులు, మహేష్,సైదులు ధనమ్మ, స్వప్న, యాకమ్మ, శంకర్, యాకయ్య, నరసయ్యతో పాటు దళిత కుటుంబాలు పాల్గొన్నాయి.



Next Story