హోమియోపతీ కార్యాలయంలో డాక్టర్ ఎక్కడ సార్లూ...?

by Aamani |
హోమియోపతీ కార్యాలయంలో  డాక్టర్ ఎక్కడ సార్లూ...?
X

దిశ,భూదాన్ పోచంపల్లి: హోమియోపతీ ఒక ప్రాచీన వైద్యవిధానమని, దీర్ఘకాలిక వ్యాధులు, బీపీ ,షుగర్ ,కిడ్నీలో రాళ్ల సమస్యలు ఉన్నవారు దీనిని ఎక్కువగా ఎంచుకుంటారు. ఇప్పటికీ గ్రామీణ ప్రాంత ప్రజలు హోమియోపతీ మందులు వాడుతూ తమ రోగాలను నయం చేసుకుంటున్నారు. ఈ సదుద్దేశ్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మండల కేంద్రంలో హోమియోపతీ ఆరోగ్య కేంద్రాలను స్థాపించింది. ప్రతి కార్యాలయంలో ఒక వైద్యాధికారిని సిబ్బందిని నియమించి ప్రజలకు సేవలు అందిస్తుంది. కానీ కొన్ని చోట్ల వైద్యులు లేక సిబ్బంది లేక కార్యాలయాలు వెలవెలబోతున్నాయి. వివరాల్లోకి వెళితే యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో ఉన్న హోమియోపతి కార్యాలయంలో వైద్యాధికారి లేక కార్యాలయానికి తాళం వేసి ఉంటుంది. ప్రజలు నిత్యం తమ బాధలను చెప్పుకొని మందులు తీసుకొని వెళ్ళేవారు.

కానీ ఎప్పుడు చూసినా తాళం వేసి ఉండటంతో నిరాశగా ఎదురు తిరగాల్సిన పరిస్థితి. గతంలో ఇక్కడ విధులు నిర్వర్తించిన వైద్యాధికారి లలిత సోమ, మంగళ, బుధవారాల్లో కొలనుపాకలో, గురు, శుక్ర, శనివారాలలో పోచంపల్లి లో అందుబాటులో ఉండే వారు.గత సంవత్సరం జూలైలో ఈమె మేడ్చల్ కు బదిలీ అయ్యారు. అప్పటినుండి నేటి వరకు సుమారు 8 నెలలుగా కార్యాలయం పేరుకే తెరుస్తున్నారు కానీ డాక్టర్ మాత్రం అందుబాటులో లేరు. ఇది తెలియని గ్రామీణ ప్రాంత ప్రజలు రోజూ వస్తూ ఉంటూ నిరీక్షించి సాయంత్రం ఇళ్లకు తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రతి నెల మండల వ్యాప్తంగా హోమియోపతి మందులు వాడే సంఖ్య సుమారు 400 నుంచి 500 ఉండటంతో వారు నిత్యం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి కార్యాలయం తెరిపించి వైద్య అధికారిని నియమించాలని మండల ప్రజలు కోరుతున్నారు.

హోమియోపతి వైద్యుడిని నియమించాలి : వంగూరి పారిజాత,పోచంపల్లి వాసి

పోచంపల్లి పట్టణంలో పాటు ఇతర గ్రామాల నుంచి సైతం గతంలో మండల కేంద్రంలోని హోమియోపతీ కార్యాలయానికి వచ్చి మందులు తీసుకెళ్లేవాళ్ళం. ప్రస్తుతం 8 నెలలుగా మందులు ఇచ్చేవారు లేక ఇబ్బందులు పడుతున్నాం. ఎక్కువగా కీళ్ల నొప్పులు ఒంటి నొప్పులతో బాధపడుతున్న జబ్బులకు ఈ మందులు దోహదపడతాయి. హోమియోపతి వైద్యులు అందుబాటులో లేక బయట మందులు కొనాలంటే ఆర్థికంగా ఇబ్బంది అవుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి వైద్యుడిని ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాము.



Next Story

Most Viewed