నిండా మునిగిన రైతన్న... అకాల వర్షంతో పంటలన్నీ ఆగమాగం

by Sumithra |
నిండా మునిగిన రైతన్న... అకాల వర్షంతో పంటలన్నీ ఆగమాగం
X

దిశ, వలిగొండ : ఈదురుగాలులతో కూడిన వర్షం మండలాన్ని ముంచెత్తి ప్రజలకు, రైతులకు మరోసారి తీవ్రనష్టాన్ని మిగిల్చింది. మంగళవారం రాత్రి బలమైన ఈదురుగాలులు, వడగల్లతో బీభత్సం సృష్టించి మండల వాసులను భయాందోళనకు గురిచేసింది. సుమారు మూడు, నాలుగు గంటల పాటు ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలతో భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి వందలాది ఎకరాల వరి చేన్లు నేలరాలి చేతికంది వచ్చిన పంటలు బుగ్గిపాలయ్యాయి. ధాన్యం నేలరాడడంతో పాటు పంటలు నేలకొరగడంతో ఆరుగాలం కష్టించి అప్పులు చేసి వరి పంటలకు పెట్టుబడులు పెట్టి పండించిన రైతన్న నిండా మునిగాడు. మరోవైపు పంటనుకోసి కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన ధాన్యం భారీ వర్షానికి వరదలో కొట్టుకపోయింది.

మండల కేంద్రంలోని రాత్రి కురిసిన వర్షానికి మార్కెట్ యార్డ్ లో నిల్వ ఉంచిన ధాన్యం నీటిలో కొట్టుకపోయింది. తడిచిన ధాన్యాన్ని నీటిలోంచి తోడి రైతులు ఎండబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా పలుగ్రామాలలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పెద్ద ఎత్తున వర్షపు నీరు చేరింది. ఈ వర్ష బీభత్సానికి విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడడంతో మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాలలో వాసులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అకాల వర్షానికి నష్టపోయిన రైతులను ప్రభుత్వం పంట నష్టం అంచనా వేసి తమను ఆదుకోవాలని. అదేవిధంగా నీటమునిగి తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు ప్రజలు కోరుతున్నారు.

Next Story