రోజురోజుకు మారుతున్న తుంగతుర్తి రాజకీయాలు

by Disha Web Desk 22 |
రోజురోజుకు మారుతున్న తుంగతుర్తి రాజకీయాలు
X

దిశ, తుంగతుర్తి: రాష్ట్ర, జిల్లా స్థాయిలో రోజురోజుకు తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటున్న తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయాలు విచిత్ర స్థాయిలో మారుతున్నాయి. ప్రధానంగకాంగ్రెస్ పార్టీలో నెలకొన్న ఈ పరిస్థితులు అందరి నోట హాట్ హాట్ టాపిక్ గా నిలిచాయి. ఇప్పటికే పార్టీ తరఫున టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య 24 ఉండగా శనివారం మోత్కుపల్లి నరసింహులు చేరికతో ఆ సంఖ్య 25 కు చేరింది. దీంతో ఆయన పేరు ప్రధానంగా తెరపైకొచ్చింది.మోత్కుపల్లి నరసింహులు కాంగ్రెస్ పార్టీలో చేరుతారంటూ దాదాపు రెండు మాసాలుగా తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచారం జరిగింది. అంతేకాదు..పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్టు ఆశిస్తున్నట్లు కూడా జరుగుతున్న ప్రచారంలో ప్రధాన అంశమైంది. అయితే ఇదంతా ప్రచారమే తప్ప ఇందులో వాస్తవం లేదంటూ ఆ పార్టీలోనే చాలామంది కొట్టి పారేశారు. కానీ ప్రచారానికి తగ్గట్టుగానే మోత్కుపల్లి నరసింహులు చేరికతో పార్టీలో ఈ అంశానికి శనివారంతో తెరపడింది.

ఇక టికెట్ పైనే ప్రధాన దృష్టి

కాంగ్రెస్ పార్టీ తరఫున తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే అంశం మోత్కుపల్లి నరసింహులులో ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు. అధికార బీఆర్ఎస్ పార్టీలో తనకు అనుకున్నంత ప్రియార్టీ లేకపోవడంతో ఆయన చూపంత కాంగ్రెస్ పార్టీ వైపు మరలింది. దీనికి తోడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎస్సీ రిజర్వుడు గా ఉన్న నకిరేకల్, తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గాల వైపు దృష్టి మళ్లింది. అయితే అక్కడ మారిన రాజకీయ పరిస్థితులతో నకిరేకల్ అసెంబ్లీ వైపు చూడలేని పరిస్థితి మోత్కుపల్లికి ఏర్పడింది. ఇక మిగిలింది తుంగతుర్తి మాత్రమే. తుంగతుర్తి నియోజకవర్గ రాజకీయాలతో పాటు ఇక్కడి నేతలు కూడా తనకు కొత్తేమీ కాదంటూ భావించిన మోత్కుపల్లి చివరికి తన దృష్టిని ఇటువైపు మళ్లించారు. దీనికి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆశీస్సులు కూడా బలంగా లభిస్తున్నాయంటూ ప్రచారాలు జరుగుతున్నాయి. చివరికి అనుకున్నట్టుగానే మోత్కుపల్లి నరసింహులు కాంగ్రెస్ పార్టీ అధినేత ఖర్గే సమక్షంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ద్వారా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.

ఇక ప్రస్తుత పరిస్థితి...

తుంగతుర్తి అసెంబ్లీ అభ్యర్థిత్వాన్ని దక్కించుకోవడానికి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ప్రధాన పాయింటుగా మోత్కుపల్లి ఎంచుకున్నారు. అంతేకాకుండా కర్ణాటక రాష్ట్రానికి చెందిన డీకే శివకుమార్, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మద్దతు కూడా పొందినట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి, మోత్కుపల్లి నరసింహులు మధ్య చాలా కాలం నుంచి మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ అనుబంధమే ప్రస్తుతం మోత్కుపల్లి కాంగ్రెస్ పార్టీలో చేరికతో పాటు టికెట్ కోసం జరిగే ప్రయత్నాలకు అనుకూలమైనట్లు ప్రచారాలు జరుగుతున్నాయి.

రెండు, మూడు రోజుల క్రితం వరకు కూడా అభ్యర్థిత్వం జాబితాలో మోత్కుపల్లి పేరు చోటుచేసుకోలేదనే ప్రచారం కూడా కొనసాగింది. అయితే ప్రస్తుతం ఒకరిద్దరి నేతలతో పాటు మోత్కుపల్లి పేరు కూడా పరిశీలనలో చేరినట్లుగా బలమైన ప్రచారం కొనసాగుతోంది. ముఖ్యంగా రోజురోజుకు అభ్యర్థిత్వాల పేర్లు మారుతున్నట్లుగా ఆశావాదులే చెప్పుకోవడం మరో విశేషం. ఎవరు ఎన్ని చెప్పుకున్నా...రాజకీయాలు ఎలా సాగుతున్నా చివరికి ఎవరి అభ్యర్థిత్వం వెలువడనుందో..? తెలవాలంటే వేచి చూడాల్సిందే.

Next Story