అధికార పార్టీ ఎమ్మెల్యేకు అన్నీ అడ్డంకులే.. బొల్లంకు ఈసారి టికెట్ దక్కేనా..?

by Disha Web Desk 12 |
అధికార పార్టీ ఎమ్మెల్యేకు అన్నీ అడ్డంకులే.. బొల్లంకు ఈసారి టికెట్ దక్కేనా..?
X

దిశ, కోదాడ: కోదాడ ప్రాంత రాజకీయం ఎవరికీ అంతుపట్టడం లేదు. ప్రస్తుతం అధికార పార్టీ అధికారంలో కొనసాగుతోంది. గతంలో రెండు పర్యాయాలు కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న కోదాడ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ చేతిలో వెళ్ళిపోయింది. మరోసారి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మళ్లీ అధికారం చేపట్టాలనే దిశగా అడుగులు వేస్తున్నా ఆ పార్టీలో ఏర్పడ్డ అసమ్మతి వర్గం కారణంగా ఈసారి గడ్డు కాలమేనని పట్టణ ప్రజలు బాహాటంగా చర్చించుకుంటున్నారు. 2018 ఎన్నికల సమయంలో టీడీసీ నుంచి టీఆర్ఎస్‌లోకి వచ్చిన బొల్లం మల్లయ్య యాదవ్‌కు ఆ పార్టీ ముఖ్య నాయకులు అందరూ సహకరిస్తేనే అతి స్వల్ప మెజారిటీతో ఆయన గెలుపు సాధ్యమైందని ఇప్పుడు ఆయన చుట్టూ వారెవరు లేరు కాబట్టి .. అసలు ఎమ్మెల్యేకు టికెట్ వస్తుందా రాదా అనే అయోమయంలో కార్యకర్తలు ఉండటంతో ఆ పార్టీకి గడ్డ కాలమేనని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. కోదాడలో అసమ్మతి వారి వర్గం ఎమ్మెల్యే పై పోటీగా గ్రామాల్లో ప్రచార కార్యక్రమాలను చేపట్టింది.అందుకే ఈసారి కోదాడ రాజకీయం రసకందాయంగా మారుతుంది అనడంలో అతిశయోక్తి లేదు.

ఎమ్మెల్యే బొల్లం రాజకీయ ప్రస్థానం..

ప్రస్తుత ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ 2007లో కోదాడ నియోజకవర్గానికి కాంగ్రెస్ నాయకుడిగా వచ్చిన ఆయన అప్పటి శాసనసభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తో సఖ్యత గా లేరు.2009 ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నం చేసినా చివరి నిమిషంలో రాకపోవడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేశారు.ఆ తర్వాత టీడీపీలో చేరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.2014 ఎన్నికలల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి చేతిలో 13,374 ఓట్లతో పరాజయం పాలయ్యారు.ఆ తర్వాత కూడా టీబాపీలోనే కొనసాగిన ఆయన 2018 ఎన్నికల్లో తనకు టికెట్ రావడం లేదని తెలిసి అనుహ్యంగా టీఆర్ఎస్ లో చేరి టికెట్ దక్కించుకున్నాడు.సీనియర్ నాయకుల సహకారంతో కేవలం 759 ఓట్ల స్వల్ప తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి పై గెలుపొందారు.

గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు

1. కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిని 30 పడకల నుండి 100 పడకల ఆసుపత్రిగా మార్చడం. ఈ హామీ అమలు కాకపోగా ఆసుపత్రిలో పడకలను 20 నుంచి 15 కు తగ్గించారు. ఇప్పుడు పురుషులకు సంబంధించిన వార్డు తీసివేశారు.ఆసుపత్రి ఆక్రమణ, తొలగింపు,అభివృద్ధిపై హామీలు ఇచ్చిన అది అమలు కాలేదు.

2. కోదాడలో క్రీడాకారుల కోసం స్టేడియం నిర్మిస్తామని హామీ ఇచ్చారు.అది అమలు కాలేదు.

3. మోతే,మునగాల, నడిగూడెం మండలం లో చివరి భూములకు నీరందించడం. కాళేశ్వరం ప్రాజెక్ట్,ఎస్ ఆర్ ఎస్ పీ వల్ల ఆయా ప్రాంతాల్లో కొంత మేర మాత్రమే నీళ్ళు వస్తున్నాయి.

4. కోదాడ పట్టణంలో మౌలిక వసతుల కల్పనలో విఫలం,పూర్తి స్థాయిలో మార్కెట్, ఇతర వసతులు లేవు.

5. కోదాడ పెద్ద చెరువు ఆక్రమణలను తొలగించి టూరిస్ట్ స్పాట్స్‌గా మార్చడం.ఇక్కడ చెరువు కట్ట నిర్మించడం,ఇటీవల దేవాలయం నిర్మించడం మినహా అభివృద్ధి లేదు.

6. కోదాడ పట్టణంలో పార్కులు లేవు.

7. రహదారులు,మిషన్ భగీరథ నీళ్ళు పూర్తిగా రావడం లేదు.

8.లిఫ్ట్‌లు,చెక్ డ్యాం లు పూర్తి కాకపోవడం

ఎమ్మెల్యే అనుకూల అంశాలు

1.నియోజకవర్గంలో విస్తృత పరిచయాలు ఉండడం.

2.సామాన్యులకు కూడా అందుబాటులో ఉండడం.

3.నిత్యం ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొనడం.

4.ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ప్రచారం చేసుకోవడం.

5.ఇతర పార్టీల వారిని పార్టీలో చేర్చి పార్టీని బలోపేతం చేయడం.

ఎమ్మెల్యేకు వ్యతిరేక అంశాలు

1. తన గెలుపునకు సహకరించిన వారిని దూరంగా ఉంచడం, ఏక పక్షంగా, నిరంకుశంగా వ్యవహరించడం.

2. టీఆర్ఎస్లో గతంలో ఉన్న వారిని కాదని ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రజా ప్రతినిధులుగా,పార్టీ నాయకులుగా అవకాశం ఇవ్వడం.

3. మున్సిపాలిటీ చైర్ పర్సన్ గా తాను ఎంపిక చేసిన శిరీష ఆమె భర్తతో విభేదాలు.ఆమెను అవమానించడం.

4. అవినీతి ఆరోపణలు.నియోజకవర్గంలో అక్రమ వ్యాపారాలు అన్నీ ఆయన కనుసన్నల్లోనే నడుస్తున్నాయని ఆరోపణలు.

5. గంజాయి, మట్టి, ఇసుక, మద్యం, రేషన్ బియ్యం అక్రమ రవాణాలలో ఆయన అనుచరులు, కొందరు పార్టీ నాయకులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

6. నియోజకవర్గంలో సొంత పార్టీలో పలువురు నాయకులతో సఖ్యత లేకపోవడం,వివాదాలు, నాయకులను లెక్క చేయకపోవడం.

పార్టీలో కొనసాగుతున్న అసమ్మతి

2018 ఎన్నికల్లో కోదాడ ఎమ్మెల్యేగా బొల్లం మల్లయ్య యాదవ్ గెలిచినప్పుడు మొదటి సంవత్సరం అందరి నాయకులతో కలిసి ప్రయాణం కొనసాగించారు.కానీ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే కంటే వేనేపల్లి చందర్రావుకు, అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం ప్రతి విషయం చందర్రావు దృష్టికి తీసుకురావాలని చెబుతూ ఉండడంతో ఎమ్మెల్యే అది సహించలేదు. ఎమ్మెల్యేగా కొనసాగుతున్న నాకు పార్టీలో ఒక వర్గం ఏర్పాటు చేసుకోవాలని ఆయన ముఖ్య నాయకులను చందర్రావును శశిధర్ రెడ్డిని పక్కకు పెట్టారని కార్యకర్తలే బాహాటంగా చెబుతున్నారు. ఒక్కొక్కరిని ముఖ్య నాయకులను దూరం చేసుకుంటూ తన వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఎమ్మెల్యే ముందుకు కొనసాగారు. ముఖ్య నాయకులలో చందర్రావు,శశిధరరెడ్డి తో పాటు ఎర్నేని బాబు,ముత్తవరపు పాండురంగారావు, మెహబూ జానీ,వంటి నేతలను పక్కకు పెట్టారు.

వీరందరూ అసమ్మతి వైరి వర్గంగా మారారు.వీరితోపాటు అనంతగిరి జెడ్పీటీసీ,మోతే జెడ్పీటీసీ,ఎంపీపీ,చిలుకూరు ఎంపీటీసీ ఎంపీపీ,కూడా ఈ వైరి వర్గానికి మద్దతుగా నిలిచారు.దీంతో కోదాడలో అసమ్మతి రాజకీయం రోడ్డు కెక్కింది.ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఏర్పడిన వైరీవర్గం నేరుగా ఆయనకు వ్యతిరేకంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎమ్మెల్యేకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు.ఇటీవల నడిగూడెం జెడ్పీటీసీ ఈ వర్గంలో చేరారు.

వైరి వర్గం నుండి హన్మంతరెడ్డి శశిధర్ రెడ్డికి టికెట్ వస్తుందంటూ నేరుగా వారు ప్రకటనలు ఇస్తూ ఉండటం కార్యకర్తలలో అయోమయానికి గురి చేస్తుంది. వాటిని బలపరిచేలా శశిధర్ రెడ్డి కేటీఆర్ ని కలవడం మంత్రి జగదీశ్వర్ రెడ్డి తో సన్నిహితంగా మెలగడం వంటివి కారణాలుగా కనిపిస్తున్నాయి.వైరి వర్గం ఎమ్మెల్యే కు వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహించినా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక పార్టీ అగ్ర నేతల అభయ హస్తం ఉంది అనేది ప్రచారం.

విమర్శిస్తే కేసులు...అదే ఆయనకు మైనస్‌లు..

సాధారణంగా ఒక పార్టీ ఎమ్మెల్యేను ప్రతిపక్ష పార్టీలు,సామాజిక కార్యకర్తలు కానీ,రిపోర్టర్లు కానీ ప్రశ్నిస్తూ ఉంటారు.వాటికి సమాధానం చెబుతూ వారి విమర్శలను తిప్పికొడుతూ ముందుకు కొనసాగాలి. కానీ కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ విషయంలో మాత్రం ఎవరైనా ప్రశ్నించినా విమర్శలు చేసినా వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారనే వాదన ప్రజలలో ఉంది. ఇదే గ్రామాల్లో సైతం సొంత పార్టీ వారు కాకుండా ఇతర పార్టీ వారిపై కూడా ఆ గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకులకు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్న వారిని ప్రోత్సహిస్తూ ఉండడంతో గ్రామాల్లో పార్టీ పటిష్టంగా దెబ్బతీసే విధంగా తయారైంది.సోషల్ మీడియాలో ఎమ్మెల్యేను ప్రశ్నించారనే నెపంతో బీఎస్పీ పార్టీ నాయకుడిని అరెస్టు చేసి జైలుకు పంపించడంతో అప్పట్లో అది పెద్ద చర్చ అయింది.

అంతేకాకుండా కోదాడ ప్రాంతానికి చెందిన ఒక రిపోర్టర్ పై కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడ్డారని విమర్శలు కూడా బలంగా ఉన్నాయి.గత 20 రోజుల క్రితం జరిగిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో భాగంగా అక్కడికి వచ్చిన మున్సిపల్ చైర్మన్ పై కూడా కేసు నమోదు చేర్పించడంతో ఎమ్మెల్యేకు వైరి వర్గానికి మరింత గొడవలకు కారణమైనదని తెలుస్తుంది. ఇటీవల గోండ్రియాల సొసైటీ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం విషయంలో ఎమ్మెల్యే,వైరి వర్గం ఇరువురు జోక్యం చేసుకోగా వైరు వర్గం అట్టి అవిశ్వాస తీర్మానం వేగిపోయాలా చేశారు. అంతేకాకుండా దళిత బంధులో కూడా ఒకే గ్రామానికి కేటాయించడం,కేటాయించిన విషయంలో కూడా అక్కడి ఓ ప్రజాప్రతినిధి భారీ మొత్తంలోనే అవినీతికి పాల్పడిందని ఆరోపణలు ఉన్నాయని, అంతటి ఆరోపణలు వచ్చిన ఎమ్మెల్యే మాత్రం చర్యలు తీసుకోకపోవడంపై ఎమ్మెల్యే హస్తం కూడా ఉందా అనే విమర్శలు వచ్చాయి.

ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు విషయంలో ప్రతి ఒక్క దళిత బంధులో 2 నుంచి 3 లక్షలు అవినీతి జరిగిందంటూ చెప్పడం గమనార్హం.మట్టి మాఫియా,మద్యం సిండికేట్,ఇసుకలో కూడా ఎమ్మెల్యే హస్తం ఉందని ప్రతిపక్ష పార్టీలు బలంగా విమర్శించాయి.ఎమ్మెల్యే పై వచ్చినటువంటి ఆరోపణలను అన్నిటిని వైరీవర్గంలోని ముఖ్య నాయకులు పార్టీ అధినేతకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ దృష్టికి తీసుకు వెళ్లారని సమాచారం.ఎమ్మెల్యే వైరీవర్గం ప్రచారంలో దూసుకు వెళ్తూ ఉండడం పార్టీ రాష్ట్ర అగ్ర నేతలతో టచ్ లో ఉండడంతో ఈసారి టికెట్ ఎమ్మెల్యేకు కష్టమై అంటూ గ్రామాల్లో ప్రచారం ప్రారంభమైంది.

ఆత్మీయ సమ్మేళనంలో నాయకుల మధ్య కొరవడిన సమ్మేళనం

బీఆర్ఎస్ ప్రభుత్వం ఆత్మీయ సమ్మేళనాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి మండల,నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేసేందుకు కసరత్తులు చేస్తూ పూర్తిస్థాయిలో విజయవంతం అయింది.కానీ కోదాడ నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనంలో నాయకుల మధ్య సమ్మేళనం కొరవడిందనే చర్చ కొనసాగుతుంది. ఎమ్మెల్యేకు వైరివర్గంగా ఉన్న అసమ్మతి వర్గం సమ్మేళనం కార్యక్రమంలో కనిపించకపోవడంతో కోదాడలో ఆత్మీయ సమ్మేళనం ఎక్కడ విజయవంతం అయిందో అర్థం కావడం లేదంటూ నాయకులు,కార్యకర్తలు బాహాటంగానే చర్చించుకుంటున్నారు.

మరికొంతమంది వైరి వర్గంలోకి

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎమ్మెల్యేకు అనుకూలంగా ఉంటున్న నాయకులు పలువురు ఎమ్మెల్యే వ్యతిరేకవర్గమైన వర్గం లోకి జంప్ అయ్యే అవకాశం ఉందని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే మోతే జడ్పిటిసి ఎంపీపీ,నడిగూడెం జడ్పిటిసి,చిలుకూరు జడ్పిటిసి,ఎంపీపీ, బేతవోలు గ్రామ సర్పంచ్ అనంతగిరి జడ్పిటిసి,పార్టీకి దూరంగా ఉంటున్నారు. అదే బాటలో అనంతగిరి ఎంపీపీ కూడా వెళ్లే అవకాశం ఉందని, వారితో పాటు అనంతగిరి మండల పలువురు సర్పంచులు సైతం వైరీవర్గంలో భారీగా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. మునగాల మండల కేంద్రానికి చెందిన ఒక ముఖ్య నాయకులు చందర్రావుకు శశిధర్ రెడ్డికి నిరంతరం టచ్ లో ఉంటున్నారని, ఈ మధ్య మోతే లో చందర్రావు ఫామ్ హౌస్ లో ఏర్పాటుచేసిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి కూడా హాజరైనట్లు సమాచారం.ఎక్కడైనా ప్రతిపక్ష పార్టీ నుంచి తలనొప్పి అధికార పార్టీకి వస్తుంది.

కానీ కోదాడలో మాత్రం సొంత పార్టీ నేతల నుంచి ఎమ్మెల్యేకు తలపోటుగా మారింది. ఎమ్మెల్యే ముఖ్య నాయకులను అందరిని పక్కకు పెట్టుకుంటూ రావడం ప్రస్తుతం ఆయన దగ్గర ఉన్న నాయకులలో ఏ ఒక్కరు కూడా ప్రభావితం చేసే వారు లేరని ఎమ్మెల్యే ఇదంతా ఎందుకు కావాలని చేస్తున్నారో అర్థం కావడం లేదంటూ పార్టీ నాయకులు కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు.గత సంవత్సర కాలంలో కోదాడ నియోజకవర్గం లో దాదాపు 6 సర్వేలు నిర్వహించారని సమాచారం.అన్ని సర్వేల్లోనూ ఎమ్మెల్యే బొల్లంకు నాయకుల నుంచి వ్యతిరేక పవనాలు వీచినట్లు సమాచారం.

ఇప్పుడు కోదాడలో అధికార పార్టీ గెలవడం ఒక ఎత్తు అయితే ముందు టికెట్ ఎవరికి వస్తుందనే చర్చ నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా కొనసాగుతుంది.ఇది ఇలా ఉంటే బొల్లం మల్లయ్య యాదవ్ కు టికెట్ రాదంటూ పలువురు బెట్టింగులకు కూడా దిగుతూ ఉండడంతో కోదాడ రాజకీయం ఎటువైపుకు దారితీస్తుందో అర్థం కావడం లేదు.సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధిష్టాన జోక్యం ఎంతవరకు ఉంటుందో వేచి చూడాలి.

Next Story