ఆ పాఠశాలలో కూర్చోవాలంటే... క్షణక్షణం భయం భయం...

by Sumithra |
ఆ పాఠశాలలో కూర్చోవాలంటే... క్షణక్షణం భయం భయం...
X

దిశ, అనంతగిరి : ఆ పాఠశాలకు 60 ఏండ్ల చరిత్ర ఉంది. అనేక మంది విద్యార్థులను ఉన్నత స్థానాలలో నిలబెట్టింది. రాజకీయ, ప్రభుత్వ, ప్రైవేట్, క్రీడా, వ్యాపార, రంగాలలో రాణించేందుకు ఆ పాఠశాల అనేక మందికి విద్యాబుద్ధులు నేర్పింది. ఘన చరిత్ర ఉన్నా నేడు శిథిలావస్థకు చేరుకుని, మూగబోయి కనీస మరమ్మత్తుల కోసం వేచి చూస్తుంది. అధికారులు, పాలకులు మారుతున్నా ఆ పాఠశాల తలరాత మాత్రం మారటం లేదు.. వివరాల్లోకెళితే సూర్యాపేట జిల్లా అనంతగిరి కేంద్రంలోని హై స్కూల్ 60 ఏళ్ల చరిత్ర గల పాఠశాల అనేక మంది విద్యార్థుల ఎదుగుదలకు తోడ్పడింది.

ఎంతో మంది ఈ స్కూల్లో విద్యని అభ్యసించి వివిధ రంగాలలో రాణించారు రాణిస్తూనే ఉన్నారు. మండలంలోని అమీనాబాద్, పాలారం, కిష్టాపురం, మొగలైకోట, ఖానాపురం, గోల్ తండా, బొజ్జ గూడెం తండా, వెంకట్రాంపురం, వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఈ హై స్కూల్లో విద్యాబోధన కొనసాగించేవారు. ఎంతో మందికి విద్యాబుద్ధులు నేర్పిన ఈ హై స్కూల్ ఈ రోజు శిధిలావస్థకు చేరి కూలటానికి సిద్ధంగా ఉంది. స్కూల్లో ఉన్నటువంటి గదుల్లో భయం భయంగా ప్రాణాలను అరచేత పెట్టుకొని ఉపాధ్యాయులు పాఠాలు చెబుతున్నారు. అదే భయంతో విద్యార్థులకు కూడా పాఠాలు వింటున్నారు. అప్పుడప్పుడు స్లాబ్ పెచ్చులు ఊడిపడి పలువురు విద్యార్థులకు గాయాలైన సంఘటనలు కూడా ఉన్నాయి. అయినా బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు ప్రైవేట్ బడులలో డబ్బులు పెట్టి చదువుకోలేని వారు చదువు మీద ఉన్న మమకారంతో దెబ్బలు తాకుతున్న చదువును అభ్యసిస్తున్నారు.

అనంతగిరి మండలం కొత్తగా ఏర్పాటు తర్వాత ఈ పాఠశాల నిర్మాణానికి గత ప్రభుత్వం అమీనాబాద్ కి వెళ్ళే రోడ్డు మార్గంలో ఈ స్థలం కేటాయించి కొంతమేర నిర్మాణం కూడా చేశారు. కానీ పాఠశాలకు కేటాయించిన భవనాన్ని ఎమ్మార్వో ఆఫీస్ కి బదిలీ చేశారు. విద్యాబుద్ధులు నేర్చుకొని సమాజ సేవకై తోడ్పాటు అందించే విద్యార్థుల ప్రాణాలతో విద్యాధికారులు, చెలగాటం ఆడటం అనేది సరికాదని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. పాఠశాలకు కేటాయించని భవనంలో ఎమ్మార్వో ఆఫీస్ రావడంతో శిథిలావస్థలో ఉన్నటువంటి హైస్కూల్లోనే విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్నారు. ఇప్పటికైనా విద్యాధికారులు స్పందించి విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాట మాడకుండా కొత్త భవనం నిర్మించి విద్యార్థులకు కేటాయించాలని విద్యార్థి తల్లిదండ్రులు అధికారులను కోరుతున్నారు.



Next Story

Most Viewed