బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్‌లో చేర్చుకునేదే..లే..

by Mahesh |   ( Updated:2024-04-22 02:14:12.0  )
బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్‌లో చేర్చుకునేదే..లే..
X

దిశ, మిర్యాలగూడ టౌన్: పదవి పోయినా.. అధికారం లేకపోయినా నాయకులకు కంటిమీద కునుకు ఉండదు. ఎప్పుడు అధికార పార్టీలోకి వెళ్ళాలి. ఏ మంత్రిని కలవాలి. అందరికంటే ముందే కండువా మార్చుకోవాలి అని చూస్తుంటారు. అయితే కాంగ్రెస్ లో చేరాలనుకుంటున్న ఇతర పార్టీల నాయకులకు, ప్రజా ప్రతినిధులకు మిర్యాలగూడలో రాజకీయ పాచిక పారేటట్లు కన్పించడం లేదు. చేరికలను ప్రోత్సహించేది లేదని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు భీష్మించుకొని ఉన్నారు.

ఇది నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో విభిన్న పరిస్థితి. మిర్యాలగూడ నియోజకవర్గం ఆర్థిక మూలలకు ఆయువు పట్టుగా పేరు ఉన్నది. ఇక్కడ ఏ పార్టీ ఎమ్మెల్యే అధికారంలో ఉంటే ఆయనతో పాట అనుచరుల హవా సాగిస్తుంటారు. దీంతో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నేతలు చేరికలకు గేట్లు ఎప్పుడు ఎత్తుతరా అని ఎదురుచూస్తున్నారు. కానీ బీఆర్ఎస్ నేతలకు ప్రజాప్రతినిధులకు కాంగ్రెస్ లో చోటు లేదని చెప్పకనే చెబుతున్నారు. జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. కానీ మిర్యాలగూడ నియోజకవర్గంలో చేరికలను ప్రోత్సహించ కపోవడం హాట్ టాఫిక్‌గా మారింది.

చేర్చుకోవద్దని తీర్మానాలు..

ఇతర పార్టీ నేతలు అనగా ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలకు పార్టీలోకి చేర్చుకోవద్దని కాంగ్రెస్ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు తీర్మానాలు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ తీర్మానాలను జిల్లా మంత్రులకు పంపేందుకు సిద్దమయ్యారనే చర్చ జోరుగా సాగుతోంది. బీఆర్ఎస్ నేతలను పార్టీలోకి తీసుకోవద్దని ఇటీవల ఓ కాంగ్రెస్ నాయకుడు ఏకంగా వినూత్నంగా ఫ్లెక్సీతో దీక్ష చేయడం విశేషం. ఇందుకు ప్రధాన కారణం గత పదేళ్లలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, ప్రజాప్రతినిధులను పలు రకాలుగా ఇబ్బందులకు గురి చేయడమేనని నియోజకవర్గ వ్యాప్తంగా చర్చించుకుంటున్నారు.

ఎమ్మెల్యే నిర్ణయమే కీలకం

మిర్యాలగూడ నియోజకవర్గంలో వలసల విషయంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డిదే కీలకంగా కన్పిస్తుంది. ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు పార్టీ మారడానికి సన్నిహిత సంబంధాలున్నా మాజీ మంత్రి జానారెడ్డి , మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ,ఉత్తమ్ కుమార్ రెడ్డిలను కలిసి తాము సిద్ధంగా ఉన్నామని విన్నవించుకున్నట్లు తెలిసింది. ఈ విషయంమై ఎమ్మెల్యే అభిప్రాయం ఫైనలని తేల్చి చెప్పారని రాజకీయ సర్కిల్ హట్ హట్ గా నడుస్తుంది. చేరికలు జరిగితే పార్టీలో వ్యతిరేకత వస్తుందని పార్టీ పెద్దలకు ఎమ్మెల్యే వివరించారని ఆ పార్టీ నాయకులు బహిరంగంగా చెప్పుకుంటున్నారు.



Next Story

Most Viewed