పింఛన్ల పంపిణీలో ఉద్రిక్తత.. ఎమ్మెల్యే అనుకూల, వ్యతిరేక వర్గాల తోపులాట..

by Disha Web Desk 14 |
పింఛన్ల పంపిణీలో ఉద్రిక్తత.. ఎమ్మెల్యే అనుకూల, వ్యతిరేక వర్గాల తోపులాట..
X

దిశ, చిలుకూరు: బేతవోలులో ఆసరా పింఛన్ల పంపిణీ విషయంలో గురువారం గ్రామ సచివాలయం దగ్గర ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇటీవల టీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురైన టీఆర్ఎస్ మండల పార్టీ మాజీ అధ్యక్షుడు వట్టికూటి నాగయ్య భార్య చంద్రకళ ప్రస్తుతం సర్పంచ్‌గా ఉన్నారు. ఇటీవల గ్రామంలో లబ్ధిదారులకు మంజూరైన పింఛన్ కార్డులను గ్రామ సచివాలయం ఆవరణలో పంపిణీ చేయాలని బుధవారం సమావేశమైన సర్పంచ్, ఇద్దరు ఎంపీటీసీలతో సహా పాలకవర్గం తీర్మానించింది.

ఎమ్మెల్యే అనుచరులైన పార్టీ గ్రామ అధ్యక్షుడు తాళ్లూరి శ్రీనివాస్ తదితరులు గ్రామంలోని ఫంక్షన్ హాల్లో జరపాలని పట్టుబట్టారు. గురువారం ఉదయం తమ కార్డులు తీసుకుందామని లబ్ధిదారులంతా గ్రామ సచివాలయానికి చేరుకున్నారు. సచివాలయం నుంచి కార్డులు ఫంక్షన్ హాల్‌కు తీసుకెళ్లేందుకు కొందరు ప్రయత్నించగా సర్పంచ్ వర్గీయులు అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది.

పోలీసులు ఇరు వర్గాలను సముదాయించేందుకు ప్రయత్నిస్తున్నారు. వృద్ధులైన లబ్ధిదారుల, కొందరు గ్రామస్తులు ఈ చర్యపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాన్ని గ్రామ సచివాలయంలో నిర్వహిస్తే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. పైగా పంచాయతీ పాలకవర్గం కూడా తీర్మానం చేసింది కదా అని ప్రశ్నిస్తున్నారు. కార్డు కోసం వచ్చిన లబ్ధిదారులు నీరు నిండిన కళ్లతో దిక్కులు చూస్తున్నారు.

Next Story