Land Scam : రూ.30 కోట్ల విలువైన సర్కార్ స్థలం స్వాహా

by Dishanational2 |
Land Scam : రూ.30 కోట్ల విలువైన సర్కార్ స్థలం స్వాహా
X

దిశ, శేరిలింగంపల్లి : ఎక్కడ సర్కార్ స్థలాలు ఉంటాయో ఆ చుట్టుపక్కలే భూములు కొనుగోలు చేసి నిర్మాణాలు చేప్పడుతున్నాయి కొన్ని నిర్మాణ సంస్థలు. క్రమంగా ఆ ప్రభుత్వ స్థలాన్ని కూడా తమ నిర్మాణాల్లో కలుపుకుని రాత్రికి రాత్రే వాటి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి సెక్యూరిటీ గార్డును పెట్టి అందులోకి ఎవరినీ రాకుండా అడ్డుకుంటున్నాయి. దీంతో ఆయా ప్రాజెక్టుల చుట్టూ ఉన్న ప్రభుత్వ భూములు ఉన్నాయో లేవో కూడా తెలియకుండా పోతున్నాయి. ఇలాంటి నిర్మాణాలకు నిర్మాణ సంస్థలు పెట్టే పేర్లు, వినియోగదారులను ఆకట్టుకునేందుకు చేసే ప్రయత్నాలు కూడా కొనుగోలుదారులను ఇట్టే ఆకర్షిస్తున్నాయి. లేక్ వ్యూ, వాటర్ ఫ్రంట్, నేచర్ వ్యూ అంటూ తమ ప్రాజెక్ట్ ముందు, వెనుక ఉన్న చెరువులు, కుంటలు, పచ్చని ప్రకృతిని కూడా తమ సేల్స్ కోసం వాడేసుకుంటున్నాయి. ఇలాగే కొండాపూర్ బొటానికల్ గార్డెన్ వద్ద చేపట్టిన నిర్మాణ సంస్థ ప్రభుత్వ స్థలాన్ని కబ్జాచేసి దర్జాగా వాడేసుకుంటుందనే ఆరోపణలు ఉన్నాయి. కోట్లాది రూపాయల స్థలాన్ని ఎంచక్కా తన స్వాధీనంలోకి తీసేసుకుందని తెలిసింది.

బడా నిర్మాణ సంస్థ భూమాయ..

కొండాపూర్ ఏఎంబీ మాల్ అంటే తెలియని వారుండరు. ఇక్కడికి అనునిత్యం వేలాదిమంది సందర్శకులు వస్తూపోతూ ఉంటారు. అలాగే నూతనంగా అటు కొండాపూర్, ఇటు హైటెక్ సిటీ, మరోవైపు గచ్చిబౌలిని కనెక్ట్ చేస్తూ నగరంలో రెండో అతిపెద్ద ఫ్లై ఓవర్ ఇటీవలే ప్రారంభం అయింది. సరిగ్గా ఈ ఫ్లై ఓవర్ పక్కనే, ఏఎంబీ మాల్ వెనకాలే కొత్తగూడ సర్వే నెంబర్ 44, 57, 72పి పక్కనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ భూమి, ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో సర్వే నెంబర్ 44లో 1.21 గుంటల సర్కార్ స్థలం ఉన్నట్లు అధికారులు రెవెన్యూ రికార్డుల్లో పేర్కొన్నారు. అయితే 2008లో ఇందులో నుంచి ఓ రియలేస్టెస్ సంస్థ యాక్షన్‌లో 1.10 గుంటలు కొనుగోలు చేసింది. అది పోగా మరో 11 గుంటల మిగులు భూమి అలాగే ఉండి పోయింది. అయితే ఇటీవల ఇక్కడ ఓ బడా నిర్మాణసంస్థ భారీ అపార్ట్మెంట్‌ల నిర్మాణం చేపట్టింది. ఇంత వరకు బాగానే ఉన్నా తమ అసలు ప్లాన్ ఇక్కడే అమలు చేసి సర్కార్ స్థలాన్ని చెరబట్టింది.

కోట్లాది రూ. విలువైన భూమిలో రియల్ దందా..

అక్కడ గజం ధర రూ.లక్ష పలుకుతుంది. ఈ ప్రాంతంలో 60 గజాల స్థలం ఉన్నా కోటీశ్వరుల కిందే లెక్క. ఇలాంటి స్థలపై కన్నేసిన నిర్మాణ సంస్థ తాను అనుకున్న ప్లాన్‌ను ఆచరణలో పెట్టింది. నిర్మాణం పేరున స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేశారు. అందులో యాక్షన్‌లో పోనూ మిగిలిన 11 గుంటల స్థలం కూడా కలిపేసుకున్నారు. దీంతో ఆ స్థలంలోకి వెళ్లాలంటే తప్పనిసరిగా ఆసంస్థ ఏర్పాటు చేసిన గేట్ నుంచి వెళ్లాల్సిందే. అయితే నిర్మాణాలు జరుగుతున్న క్రమంలో భారీ గేట్ ఏర్పాటు చేసి అక్కడ సెక్యూరిటీని పెట్టి ఎవరిని అందులోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. దీనిపై సీపీఎం శేరిలింగంపల్లి మండలశాఖ ప్రతినిధులు ఈ ఏడాది ఏప్రిల్ 1న తహశీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. కోట్లాది రూపాయల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకుని పేదల డబుల్ బెడ్రూంలకు కేటాయించాలని, లేదంటే ఇతర ప్రభుత్వ అవసరాలకు వాడుకోవాలని కోరారు.

రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ..

కొత్తగూడ సర్వేనెంబర్‌లోని 44లో ప్రధాన రహదారికి ఆనుకుని 11 గుంటలు ప్రభుత్వ స్థలానికి అడ్డుగా ఫెన్సింగ్ వేసి కబ్జాకు యత్నం చేస్తున్నారంటూ సీపీఎం నాయకుల ఫిర్యాదుతో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ శ్రీనయ్య పర్యవేక్షణలో సిబ్బంది స్థలం చుట్టూ కడీలు ఏర్పాటు చేశారు. అలాగే ఇది ప్రభుత్వ స్థలం అంటూ హెచ్చరిక బోర్డు పెట్టారు. అక్కడ నిర్మాణం చేపట్టిన రియలెస్టేట్ సంస్థ ఇప్పుడా బోర్డును తొలగించి చుట్టూ కడీలను సైతం ధ్వంసం చేశారు. దీనిని బుధవారం రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ శ్రీనయ్య, సీపీఎం నాయకులు శోభన్ పరిశీలించారు. బోర్డు ఉన్న పక్కనుంచే రోడ్డును వేసిన ఆ నిర్మాణదారులు ప్రభుత్వ స్థలాన్ని ఎంచక్కా తమదిగా వాడేసుకుంటున్నారు. ఈ విషయంపై రెవెన్యూ అధికారులు ఆ సంస్థ ప్రతినిధులను ఆడిగేందుకు ప్రయత్నించినా ఎవరూ స్పందించకపోవడం వారి బరితెగింపుకు అద్దం పడుతుంది.

ప్రభుత్వ స్థలాన్ని పరిరక్షించండి..

ప్రభుత్వ స్థలాలు కనుమరుగవుతున్నా అధికారులు మిన్నకుంటున్నారు. గతంలో తాము ఫిర్యాదు చేస్తే వచ్చి బోర్డుపాతిన అధికారులు ఇన్నాళ్లు ఈవైపు కన్నెత్తి చూడలేదు. కోట్లాది రూపాయల స్థలాన్ని స్వాధీనం చేసుకుని పేదల డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం కేటాయించాలి.

- సీపీఎం నాయకుడు శోభన్

చర్యలు తీసుకుంటాం..

కొత్తగూడ సర్వే నెంబర్ 44లో 11 గుంటల స్థలం ఉన్నట్లు రెవెన్యూ రికార్డుల్లో ఉంది. మేము ఇది ప్రభుత్వ స్థలంగా గుర్తించి ఇక్కడ బోర్డు ఏర్పాటు చేశాం. కానీ దానిని కావాలనే తొలగించారు, హద్దురాళ్లు తొలగించారని మా పరిశీలనలో గుర్తించాం. దీనిపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తాం. చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం.

- ఆర్‌ఐ శ్రీనయ్య



Next Story

Most Viewed