KCR కు 300 ఎకరాల భూమెందుకు... ఆయనేమన్న నాగలి పట్టి దున్నుతడా? : ఆర్ఎస్ ప్రవీణ్

by Dishanational1 |
KCR కు 300 ఎకరాల భూమెందుకు... ఆయనేమన్న నాగలి పట్టి దున్నుతడా? : ఆర్ఎస్ ప్రవీణ్
X

దిశ, సంస్థాన్ నారాయణపురం: ముఖ్యమంత్రి కేసీఆర్, రాజగోపాల్ రెడ్డి, రేవంత్ రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, స్రవంతి రెడ్డిలు భూమి దున్నగలరా? విత్తనాలు వేయగలరా? కలుపు తీయగలరా? మరి వాళ్లకు వందల ఎకరాల భూమి ఎందుకని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్పీ ప్రశ్నించారు. మూడు వందల ఎకరాల భూమి ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎందుకని, భూమి చదును చేసి వ్యవసాయం చేసేవారి భూమిని గుంజుకుని, వారికి పట్టాలివ్వకుండా అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. గురువారం బహుజన రాజ్యాధికార పాదయాత్ర మండల పరిధిలోని జనగాం, ఆరెగూడెం, మర్రిబావితండా, సఫావట్ తండా, బోటిమీది తండాలలో కొనసాగింది. భోజన సమయం తర్వాత సీత్యాతండా, పొర్లగడ్డ, చిల్లపురం, వాయిళ్లపల్లి గ్రామాలలో కొనసాగనుంది.

ఈ సందర్భంగా ఆర్ఎస్పీ మాట్లాడుతూ.. బహుజన రాజ్యం వస్తే ప్రతి నిరుపేద కుటుంబానికి ఎకరం భూమితోపాటు పట్టా ఇస్తామని హామి ఇచ్చారు. పేద, బహుజన బిడ్డలు పైలెట్ కావాలంటే బహుజన్ సమాజ్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. తరతరాలుగా బహుజనులు కూలీలుగానే మిగిలిపోయారని, మన పిల్లలు కూడా మనలాగే కూలీలు కాకుండా ఉండాలంటే ఏనుగు గుర్తును గెలిపించాలన్నారు. కేసీఆర్ ప్రభుత్వం యువతకు నాణ్యమైన విద్య, ఉద్యోగం ఇవ్వడంలేదు, వాళ్లు మాత్రం విదేశాల్లో కూడా వ్యాపారం చేసుకుంటూ రూ. కోట్లు సంపాదిస్తున్నారని మండిపడ్డారు. ఓట్ల సమయంలో డబ్బు మద్యం పంచి మోసం చేసి అభివృద్దికి దూరంగా ఉంచుతున్నారని విమర్శించారు. తండాల్లో కనీస వసతులు కూడా కల్పించలేని ప్రభుత్వం హైదరాబాద్ లో భవనాలు కడుతున్నామని మోసం చేస్తున్నారని ఆరోపించారు. సంపదకు, విద్య, ఉద్యోగాలకు దూరం చేసి పేద బిడ్డలను కుట్రపూరితంగా జైలుకు పంపుతున్నారని, ఇప్పటికీ జైళ్లలో ఎనభై శాతం బహుజన ప్రజలే మగ్గుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఇలాంటి అన్యాయం, దోపిడీ పోవాలంటే బహుజన రాజ్యం రావాలన్నారు.


బహుజన రాజ్యంలో బహుజనులు వ్యాపారవేత్తలు, డాక్టర్లు, ఇంజనీర్లుగా తయారవుతారని తెలిపారు. మన భూములు మనకు దక్కుతాయని, నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం అందుతాయన్నారు. జనగాం గ్రామంలో పార్వతమ్మ అనే వృద్ధ మహిళ తన ఫించన్ నుండి ఐదు వందల రూపాయలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి విరాళంగా అందజేసింది. తమ పిల్లలు బాగుపడాలంటే బహుజన రాజ్యం రావాలని ఆమె నినదించింది. నారాయణపురం మండల కేంద్రంతోపాటు జనగామలో వివిధ పార్టీల నుండి ఆర్ఎస్పీ సమక్షంలో బీఎస్పీలోకి భారీగా చేరారు. ఈ పాదయాత్రలో రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటేష్ చౌహాన్, జిల్లా నాయకులు ఏర్పుల అర్జున్, అబేందర్, వెంకటయ్య, మహిళా కన్వీనర్ కత్తుల పద్మ, మండల నాయకులు కత్తుల పరమేష్, నర్సింహ, శంకరాచారి తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed