అక్కడ ఆ సీఎం పంచినట్లే.. తెలంగాణలో ఏడు లక్షల ఎకరాల భూమిని పంచుతాం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

by Disha Web Desk 13 |
అక్కడ ఆ సీఎం పంచినట్లే.. తెలంగాణలో ఏడు లక్షల ఎకరాల భూమిని పంచుతాం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
X

దిశ, మర్రిగూడ: తెలంగాణ రాష్ట్రంలో ఓట్లు బహుజనులవి అయితే, ఆస్తులు ఆధిపత్య వర్గాల చేతుల్లో ఉన్నాయని ఇది తీరని అన్యాయమని బీఎస్పీ రాష్ట్ర చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. బహుజన రాజ్యాధికార యాత్ర రెండవ విడతలో భాగంగా 129వ రోజు నాంపల్లి మండలంలో కొనసాగింది. వడ్డెపల్లి, టి.పి గౌరారం, మళ్ళపురాజుపల్లి గ్రామాల్లో పర్యటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణను దోచుకున్నది చాలక ఇపుడు దేశం మీద పడుతున్నారని విమర్శించారు. చర్లగూడెం, క్రిష్ణరాయపల్లి వంటి ప్రాజెక్టులతో కోట్లు కూడబెట్టుకుని, భూమి కోల్పోయిన, ఇళ్ళు కోల్పోయిన వారిని అడ్డా కూలీలుగా తయారు చేశారని గుర్తు చేశారు. సంపాదించిన సొమ్ముతో అబద్దాలు ప్రచారం చేస్తూ.. అడ్వర్టైజ్ మెంట్లు ఇస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు.

మునుగోడు నియోజకవర్గంలో కూడా రెండు లక్షల ఓట్లు బహుజనులవే అయినా, ఒక్క సారి కూడా ఎమ్మెల్యేగా గెలవలేదన్నారు. మునుగోడులో ఓట్లేసి గెలిపించిన పేదల కోసం కనీసం రోడ్డు, బస్సు సౌకర్యం, విద్య వైద్య సౌకర్యాలు కూడా కల్పించలేకపోయారన్నారు. ప్రజలు సమస్యలు చెప్పుకోడానికి కనీసం మునుగోడులో క్యాంపు కార్యాలయం కూడా లేదన్నారు. కోటి రూపాయలతో నిర్మించిన క్యాంపు కార్యాలయం తాగుబోతుల అడ్డాగా మారిందన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఎమ్మెల్యేలు కాకుండా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, రాజగోపాల్ రెడ్ఢి ఒక్కటై డ్రామాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలను మోసం చేసే వాళ్లు అసెంబ్లీలో ఉంటే, నిజాయితీపరులైన పేదలు జైలులో మగ్గుతున్నారన్నారు. ప్రజలంతా నకిలీ అంబేడ్కరిస్టుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.


ప్రస్తుతం మోడీ, కేసీఆర్, కేటీఆర్, సంజయ్ అందరూ నీలి కండువా వేసుకుని అంబేడ్కర్ పేరు చెప్పి మోసం చేస్తున్నారని తెలిపారు. అంబేడ్కర్, కాన్షీరాం పేరు చెప్పినా, నీలి కండువా వేసుకున్నా, నీలి జెండా పట్టిన ఏనుగు గుర్తుకే ఓటేయాలని పేర్కొన్నారు. గడియ గౌరారం లోని లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయాన్ని సందర్శించారు. మహిళలకు రక్షణ కావాలంటే బీఎస్పీ ని గెలిపించాలన్నారు.

గుజరాత్ లో బిల్కిస్ బానో నిందితులను సన్మానం చేసిన బీజేపీ ని ఓడించాలని పిలుపునిచ్చారు. అందుకే ఈ దోపిడీ దొంగలను మునుగోడులో ఓడించి మునుగోడులో బహుజనుడిని గెలిపించాలని కోరారు. ఉత్తరప్రదేశ్ లో మాయావతి ముఖ్యమంత్రిగా ఏడు లక్షల ఎకరాల భూమిని పంచినట్లే, తెలంగాణలో కూడా పంచుతామని హామీ ఇచ్చారు. గౌరారం, మళ్ళపురాజు పల్లి గ్రామంలో ప్రజలను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పలు గ్రామాల్లో పార్టీ జెండా ఆవిష్కరించారు. యాత్రలో జిల్లా అధ్యక్షులు పూదరి సైదులు, జిల్లా నాయకులు పూదరి నరసింహ, నియోజకవర్గ అధ్యక్షులు పల్లె లింగస్వామి, ఏర్పుల అర్జున్, మహిళా కన్వీనర్లు కత్తుల పద్మ యాదవ్, ఎలిజబెత్, సుజాత, మండల కన్వీనర్ వినోద్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed