చెరువులను తలపిస్తున్న రహదారులు…పట్టించుకోని ప్రజాప్రతినిధులు

by Kalyani |
చెరువులను తలపిస్తున్న రహదారులు…పట్టించుకోని ప్రజాప్రతినిధులు
X

దిశ,మర్రిగూడ: అస్తవ్యస్తంగా ఉన్న రహదారులు చిన్నపాటి వర్షపు నీటికి చెరువులను తలపిస్తున్నాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రజా ప్రతినిధులు అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. మర్రిగూడ, నాంపల్లి మండలాల్లో సోమవారం కురిసిన వర్షానికి రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. లెంకలపల్లి గ్రామానికి ఆనుకుని ఉన్న చెరువు గండిపడి మర్రిగూడ నల్గొండ వెళ్లే రహదారి చెరువుగా మారింది. దీంతో మండల కేంద్రానికి రాకపోకలు సోమవారం సాయంత్రం నుంచి నిలిచిపోయాయి. గతంలోనే ఆ ప్రాంతంలో పెద్దపెద్ద గుంతలు ఏర్పడి ప్రయాణికులు ప్రయాణించాలంటేనే జంకే పరిస్థితి ఉంది. వాహనదారులు అనేకమంది గుంతలలో పడి ఆసుపత్రుల పాలైన సంఘటన అనేకం ఉన్నాయి.

నిత్యం నల్గొండ నుండి మర్రిగూడ కు వచ్చే వాహనాలలో అధికారులు ప్రయాణిస్తూనే ఉన్న పట్టించుకునే నాథుడే కరువయ్యారు. అలాగే నాంపల్లి మండలం నుండి కేతేపల్లి గ్రామం వెళ్లే దారిలో ఉన్న బ్రిడ్జి అడుగు మేర గుంతలు పడడంతో వర్షపు నీటికి గుంతలు నిండి రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. అసలే వర్షాకాలం కావడంతో రోడ్ల పరిస్థితి చెరువులను తలపించే విధంగా ఉంటే ప్రయాణికులు ఎలా ప్రయాణిస్తారని, ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తక్షణ మరమ్మతులు చేపట్టి ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆయా మండలాల ప్రజలు కోరుతున్నారు.

Next Story

Most Viewed