100 సార్లు జైలుకెళ్లడానికైనా సిద్ధం: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 19 |
TPCC Chief Revanth Reddy Slams CM KCR Over Food in Welfare Hostels
X

దిశ, సంస్థాన్ నారాయణపురం: ప్రజాస్వామ్యంలో ఎన్నికలంటే టీఆర్ఎస్, బీజేపీలకు డబ్బులు పెట్టి ఓటర్లను కొనడమే పనిగా తయారైందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం గుడిమల్కాపురం నుంచి సర్వేలు వరకు రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. అనంతరం సర్వేల్ గ్రామంలో ఆయన మాట్లాడుతూ.. దేశానికి ఎంతో మంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఇలాంటి ఉన్నతాధికారులను అందించిన రెసిడెన్షియల్ పాఠశాల కలిగిన సర్వేలు గడ్డ నుండి మాట్లాడటం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.

పార్టీ మారిన కొందరు వ్యక్తులు తనపై ఆరోపణలు చేస్తూ.. జైలులో చిప్పకూడు తిన్న వ్యక్తితో తాము ఉండలేమంటున్నారని తాను దొంగతనం చేసి జైలుకు వెళ్లలేదని అన్నారు. పేద ప్రజల పక్షాన కొట్లాడుతున్న అందుకే కేసీఆర్ 120 కేసులు నమోదు చేసి తనను జైలుకు పంపించారని, పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం వందల సార్లు జైలుకు వెళ్లడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఢిల్లీ నుండి అమిత్ షా, గజ్వేల్ నుండి కేసీఆర్ వచ్చి మునుగోడు ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా.. ఓట్లు అడిగే ధైర్యం ఎక్కడ నుండి వచ్చిందని ప్రశ్నించారు. తమ దగ్గర ఉన్న దొంగ సొమ్ముతో ఓటర్లను కొని గెలుస్తామనే అహంకారంతో ఉన్నారని ఎద్దేవా చేశారు.

మునుగోడు ప్రజలు చైతన్యవంతులని ఎవర్ని గెలిపించాలో వారికి బాగా తెలుసునని అన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో గిరిజనులకు భూములు ఇస్తే.. ముఖ్యమంత్రి కేసీఆర్ కృష్ణరాయన్ పల్లి, శివన్నగూడెం ప్రాజెక్టుల పేరుతో ఆ భూములను గుంజుకుని నిర్వాసితులను చేశాడని విమర్శించారు. మల్లన్న సాగర్ నిర్వాసితుల భూములకు ఎక్కువ ధరలు చెల్లించి ఇక్కడి ప్రజల భూములకు అతి తక్కువ ధరలు చెల్లిస్తున్నారని ఆరోపించారు. మునుగోడు ప్రాంతంలో అభివృద్ధి చెందిందంటే అది కాంగ్రెస్ పార్టీ హయాంలో మాత్రమేనని.. ఇక్కడ ఓట్లు అడిగే హక్కు ఒక్క కాంగ్రెస్ పార్టీకే ఉందని స్పష్టం చేశారు.

ఎన్నికల్లో గెలవడానికి కేసీఆర్ కమ్యూనిస్టుల కాళ్ళు మొక్కుతున్నాడని.. వారిని కరీంనగర్, ఖమ్మంలో ఉండే కమ్యూనిస్టు నాయకులు క్షమించిన ఇక్కడి కార్యకర్తలు కేసీఆర్‌ను క్షమించడానికి సిద్ధంగా లేరని పేర్కొన్నారు. పొత్తులో భాగంగా దేవరకొండలో కాంగ్రెస్ పార్టీ కష్టపడి సీపీఐ ఎమ్మెల్యేను గెలిపిస్తే.. అధికార టీఆర్ఎస్ పార్టీలోకి లాక్కున్న విషయాన్ని కమ్యూనిస్టు కార్యకర్తలు మర్చిపోలేదని గుర్తు చేశారు. అక్రమంగా సంపాదించిన సొమ్ముతో ఓటర్లను కొని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని గెలవాలని బీజేపీ, టీఆర్ఎస్‌లు చూస్తున్నాయని.. మరోసారి వారిని గెలిపిస్తే బందిపోట్ల లాగా మారి మన ఇళ్లలో సామాన్లను లారీలలో ఎత్తుకుపోతారని విమర్శించారు.

తెలంగాణ ఇచ్చిన సోనియా, రాహుల్ గాంధీలను ఈడీ కేసుల పేరుతో కేంద్ర ప్రభుత్వం వేధిస్తోందని.. వారికి అండగా నిలవాల్సిన అవసరం తెలంగాణ ప్రజలపై ఉందని అన్నారు. మునుగోడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతిని ఆశీర్వదించి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, మాజీ ఎంపీ రాజయ్య, గండ్ర సత్యనారాయణ రావు, పల్లె రవికుమార్, చలమల కృష్ణారెడ్డి, కైలాస్ నేత తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed