మునుగోడులో అత్యధిక దివ్యాంగులు ఉండటానికి కారణం వారే: మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్

by Disha Web Desk 19 |
మునుగోడులో అత్యధిక దివ్యాంగులు ఉండటానికి కారణం వారే: మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్
X

దిశ, చౌటుప్పల్: గత పాలకుల దుర్మార్గంతోనే నియోజకవర్గంలో అత్యధికంగా దివ్యాంగులు అయ్యారని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా 46 లక్షల మందికి ఆసరా పింఛన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కార్యాలయంలో 57 సంవత్సరాలు నిండిన వారికి నూతన ఆసరా పింఛన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. మునుగోడు నియోజకవర్గంలో 40 వేల మందికి ఆసరా పింఛన్ అందుతున్నాయని.. చౌటుప్పల్, నారాయణపురం మండలంలో 15000 మందికి ఆసరా పెన్షన్లు అందుతున్నాయని తెలిపారు. గతంలో పాలించిన పాలకులు చేసిన దుర్మార్గపు పాలన వల్లే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ భూతం ప్రజలకు శాపంగా మారిందని విమర్శించారు.

40సంవత్సరాలు పాలించిన ప్రభుత్వాలు ప్లోరోసిస్ సమస్యను పట్టించుకోక దుర్మార్గంగా వదిలేశారని, తెలంగాణ ఏర్పడకముందు సాక్షాత్తు ప్రపంచ ఆరోగ్య సంస్థ , ఐక్యరాజ్యసమితి‌లు మునుగోడులో ఇదే పరిస్థితి కొనసాగితే "నో మ్యాన్ జోన్" గా మారే అవకాశం ఉందని హెచ్చరించాయని గుర్తుచేశారు. ఫ్లోరైడ్ సమస్యపై ఇక్కడి ప్రజలు అనేక ఉద్యమాలు చేశారని, తెలంగాణ ఉద్యమంలో గ్రామ గ్రామాన తిరిగిన ఉద్యమ నాయకుడు కేసీఆర్.. ఫ్లోరైడ్ సమస్య పరిష్కారం గురించి కేంద్ర ప్రభుత్వాలకు దృష్టికి తీసుకెళ్లిన ఎవరు పట్టించుకోలేదని తెలిపారు. ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ మిషన్ భగీరథ పథకం తీసుకొచ్చి తద్వారా ఫ్లోరోసిస్ మహమ్మారిని తరిమేశాడని కొనియాడారు.

పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గడిచిన ఏడాదిలో మునుగోడులో నియోజకవర్గంలో ఒక్క ఫ్లోరోసిస్ కేసు కూడా నమోదు కాలేదని చెప్పడం కేసీఆర్ విజయమని ప్రశంసించారు. తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో రైతులు, చేనేత కార్మికులు ఆకలి చావులతో అలమటించే వారని.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం, చింతల దామోదర్ రెడ్డి కౌన్సిలర్లు బాబా షరీఫ్, అరుణ, పోలోజు శ్రీధర్ బాబు, ఆలే నాగరాజు, బండమీది మల్లేశం తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed