- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
లక్షల రూపాయల వ్యయం.. మొక్కలు మాయం...

దిశ, చివ్వేంల : పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత. మొక్కలు నాటుదాం వాటిని సంరక్షిద్దాం. ఇలాంటి నినాదాలు తరచూ ప్రభుత్వపరంగా మొక్కలు నాటే కార్యక్రమంలో పాలకులు, అధికారులు వల్లెవేసే మాటలు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద జాతరైన పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఈ జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాదిగా భక్తులు వస్తారు. 2023 ఫిబ్రవరి నెలలో పెద్దగట్టు జాతరలో భక్తులను ఆకర్షించడం కోసం చెరువు కట్ట రోడ్డుకు మొక్కలు నాటారు. అందుకుగాను లక్షల రూపాయలు వెచ్చించారు. అయితే 2023 గత జాతరలో నాటిన మొక్కలు కనిపించటం లేదు. మొక్కలు నాటడం, పెంపకం, సంరక్షణ కొంత కాగితాల మీదనే పరిమితమైందనట్లు కనిపిస్తుంది.
ఐస్ ముక్క ఒకరి చేతుల నుంచి మరొకరి చేతులకు మారుతుంటే ఎలా కరుగుతుందో అలా వివిధ దశల్లో పెద్దగట్టు జాతరకు కేటాయించిన నిధులు దుర్వినియోగం అవుతున్నాయని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగితాల మీద లెక్కలు చూపినా, క్షేత్రస్థాయిలో మొక్కలు కనిపించకపోవటం పై ఉన్నతాధికారులు నోరు మెదపరు. ఖర్చు ఘనంగా ఉన్నా, ఫలితం గురించి ఆరా తీయరు. అందరి భాగస్వామ్యం ఉండటంతో గత జాతరలో నాటిన మొక్కలు ఏవీ అని పరిశీలించకుండా అధికారులు, నాయకులు జేబులు నింపుకోవడం కోసం జాతరకు వచ్చే భక్తులను ఆకట్టుకోవడం కోసం మళ్లీ మొక్కలు నాటడం షరామామూలైపోయిందని పలువురు ఆరోపిస్తున్నారు.
గత జాతరలో చెరువు కట్టకు నాటిన మొక్కల్లో సగం బతికినా చెరువు కట్ట నుంచి మర్రిచెట్టు వరకు పచ్చదనం గణనీయంగా ఉండేది. అయితే ఆ పరిస్థితి లేకపోవటం పై ప్రజలు పెదవి విరుస్తున్నారు. జాతర సమయంలోనే కోట్ల రూపాయల నిధులు కేటాయించి తాత్కాలిక పనులు చేస్తూ జాతర అయిపోయిన వెంటనే దిక్కు మొక్కు లేకుండా మొక్కలు నాటిన తర్వాత సంరక్షణ చర్యలు చేపట్టని అధికారులు, సిబ్బందిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారో, గతంలో నాటిన మొక్కలు లేకపోవడం లక్షల రూపాయల నిధులు వృధా కావడం పట్ల జిల్లా ఉన్నత స్థాయి అధికారులు, ఎలా స్పందిస్తారో ఎదురు చూడాలి.