మున్సిపాలిటీలో వార్డు సభల పై ప్రజల అసంతృప్తి..

by Sumithra |
మున్సిపాలిటీలో వార్డు సభల పై ప్రజల అసంతృప్తి..
X

దిశ, చిట్యాల : చిట్యాల మున్సిపల్ కేంద్రంలో ప్రారంభమైన వార్డు సభలకు మున్సిపల్ సిబ్బంది సమాచార లోపం వల్ల అంతంతమాత్రంగానే హాజరయిన ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 26 నుంచి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న ఇందిరమ్మ ఇండ్లు, నూతన రేషన్ కార్డుల మంజూరు, రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల అమలు కోసం లబ్ధిదారులను గ్రామసభల ద్వారా ఎంపిక చేసేందుకు నిర్వహిస్తున్న గ్రామ, వార్డు సభలకు అధికారుల సమాచార లోపంతో ప్రజలు గైర్హాజరవుతున్నారు. మంగళవారం మున్సిపాలిటీ కేంద్రంలోని ఒకటి, రెండు, మూడు, నాలుగు వార్డులలో నిర్వహించిన వార్డు సభలకు ప్రజల స్పందన కరువైంది. ఈ సభలలో మున్సిపల్ వార్డు అధికారులు ముందుగా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు లబ్ధిదారుల పేర్లను చదివి వినిపించారు. ఈ సందర్భంగా రెండో వార్డులో జరిగిన సభలో చైర్మన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని మాట్లాడుతూ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కానీ అర్హులు తిరిగి దరఖాస్తు చేసుకోవాలని అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు..

అర్హుల పేర్లు జాబితాలో లేవని నిలదీత..

అర్హులైన చాలామంది పేర్లు అర్హుల జాబితాలో లేకపోవడంతో పలువురు అధికారులను నిలదీశారు. జాబితాలో పేర్లు లేని అర్హులు తిరిగి దరఖాస్తు చేసుకోవాలని చెప్పడంతో తిరిగి దరఖాస్తు చేసుకున్నారు.

1వ వార్డు సభకు హాజరుకాని ప్రజలు..

చిట్యాల మున్సిపల్ కేంద్రంలోని 1వ వార్డు శివనేని గూడెంలో మంగళవారం జరిగిన వార్డు సభకు ప్రజలు సమాచార లోపంతో ఎవరు హాజరు కాలేదు. వార్డులో సభ పెడుతున్న విషయం వార్డు ప్రజలకి తెలియకపోవడంతో వారు పనులలోకి వెళ్లిపోయారు. తమగ్రామం మున్సిపాలిటీలో విలీనం కాకముందు గ్రామపంచాయతీ సిబ్బంది గ్రామసభ ఉన్నప్పుడు ముందురోజు గ్రామం మొత్తం డప్పు కొట్టించి టాం టాం వేయించేవారు. కానీ తమ గ్రామాన్ని మున్సిపాలిటీలో విలీనం చేశాక తమ వార్డుకు సంబంధించిన సమావేశాల గురించి తమకు సమాచారం లేకుండా పోయిందని ప్రజలు వాపోతున్నారు. ప్రజలంతా తమ పనులల్లోకి వెళ్లాక అధికారులు తీరిగ్గా వెళ్లి వార్డు సభ నిర్వహించారు. వార్డుసభ ఉన్న విషయాన్ని టామ్ టామ్ ఎందుకు వేయించలేదని గ్రామస్తులు అధికారులను నిలదీయడంతో అధికారులు తమకు అలాంటి ఆదేశాలు ఏమీ రాలేదని నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారని గ్రామస్తులు తెలిపారు. చాలా వరకు వార్డుసభ ఉన్న విషయం తెలవకపోవడంతో జాబితాలో తమ పేరు లేనివారు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం లేకుండా పోయిందని దీనికి కారణం అధికారుల నిర్లక్ష్యమేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..

భూస్వాములకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు.. జాబితాలో అర్హులకు దక్కని చోటు..

మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు శివనేనిగూడెంలో మంగళవారం జరిగిన వార్డు సభలో రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు లబ్ధిదారుల జాబితాను అధికారులు చదివి వినిపించగా అందులో నిజమైన అర్హులకు ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో పేరు లేదని, 20, 50 ఎకరాలు భూమి ఉన్న భూస్వాముల పేర్లు ఉన్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్ల జాబితాలు పారదర్శకంగా లేవని, అధికారుల లోపంతోనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు కాకుండా అనర్హులకు దక్కుతున్నాయని వాపోతున్నారు.

Advertisement

Next Story

Most Viewed