మళ్లీ మన రాజ్యమే వస్తుంది

by Disha Web Desk 15 |
మళ్లీ మన రాజ్యమే వస్తుంది
X

దిశ, మిర్యాలగూడ టౌన్ : అడ్డగోలు హామీలతో కాంగ్రెస్​ గద్దెనెక్కి రైతులను పట్టించుకోవడం లేదని, మళ్లీ మన రాజ్యమే వస్తుందని మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. మిర్యాలగూడలో నిర్వహించిన రోడ్డు షో లో పాల్గొని మాట్లాడారు. నాలుగు నెలల క్రితం ధీమాగా ఉన్న రైతులు నేడు దిగాలుగా ఉన్నారని అన్నారు. తెలంగాణ బతుకు పోరాటం నీళ్ల కోసమేనని అన్నారు. 1956 నుంచి నేటి వరకు మన శత్రువు కాంగ్రెస్ పార్టీయే అన్నారు. సాగర్ ఆయకట్టులో 10 ఏళ్ల లో 18 పంటలకు నీరందించామన్నారు. దద్దమ్మలకు చేతగాక కేఆర్ఎంబీకి అప్పగించి పంటలు ఎండగోడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

జిల్లాలో ఇరిగేషన్, మరో మంత్రి ఉండి కూడా కేఎంబీఆర్ కు అప్పగించారని విమర్శించారు. సాగర్ ఎడమ కాల్వ ఆయకట్టుకు అన్యాయం చేస్తుంటే అప్పుడు కోదాడ నుండి హాలియా వరకు పాదయాత్ర చేసినట్లు చెప్పారు. రైతులు రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతా అంటున్నాడు ఓ మంత్రి అని పేర్కొన్నారు. రైతుల వద్ద కూడా చెప్పులుంటాయని అన్నారు. సాగర్ లో నీళ్లు ఇచ్చే అవకాశం ఉన్నా ఇవ్వలేదని అన్నారు. ఇప్పుడు కరంట్ కూడా బంద్ అయిందని తెలిపారు. తాము భగీరథ కింద నీళ్లు ఇచ్చినామని, నేడు అవి కూడా బంద్ అయ్యాయని అన్నారు. అన్నదాతల సపోర్ట్ లేకుండా ఏదీ నడవదన్నారు. తాము రైతు బంధు ఇవ్వగా నేడు అది కూడా బంద్ చేశారని ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్లు కూడా సరిగా లేదని, ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో రైతులు అర్ధం చేసుకోవాలని అన్నారు.

వివాహానికి తులం బంగారం ఇస్తాం అని మాయమాటలు చెప్పారని అన్నారు. రుణమాఫీ, మహాలక్ష్మి పథకం కింద 2500, నిరుద్యోగ భృతి 4000 ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ బలం పెంచితే ప్రభుత్వం మెడలు వంచి పని చేయిస్తామన్నారు. సీఎం రేవంత్ భాష దారుణంగా ఉందని, నన్ను పట్టుకొని జైల్ లో వేస్త అంటాడా? అని ప్రశ్నించారు. హామీలకు పంగ నామాలు పెట్టి మోసం చేశారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మూసీ, ఉదయసముద్రం నింపి వాటి ద్వారా పెద్దదేవులపల్లి నింపాలని ప్రణాళికలు రచించినట్లు పేర్కొన్నారు. అంబేద్కర్ జయంతి రోజున హైదరాబాద్ లోని విగ్రహానికి అవమానం చేశారని అన్నారు. తప్పకుండా మళ్లీ మన రాజ్యం వస్తదని అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed