తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీల పనైపోయింది: మంత్రి హరీష్ రావు

by Disha Web Desk 19 |
తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీల పనైపోయింది: మంత్రి హరీష్ రావు
X

దిశ, నేరేడుచర్ల: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీల పనైపోయిందని.. వారిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. శుక్రవారం హుజూర్‌నగర్ నియోజకవర్గంలో మంత్రి హరీష్ రావు, మంత్రి జగదీశ్ రెడ్డి కలిసి నేరేడుచర్ల పట్టణంలోని రాంపురంలో బస్తీ దవఖాన, గరిడేపల్లి మండలంలోని పోనుగోడు, రాయిని గూడెంలలో పల్లె దవఖానాలను ప్రారంభించారు. అలాగే మఠంపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. హుజూర్‌నగర్ నియోజకవర్గంలో గతంలో కంటే ప్రజల ఆదరణ పెరిగిందని.. ఈ ఆదరణ చూస్తుంటే ఈ సారి 52,000 మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని అన్నారు. రానే రాదు.. అన్న తెలంగాణాను తెచ్చుకున్నామని.. తెలంగాణ వచ్చిన సందర్భంగా జూన్ 2 నుండి ఘనంగా వేడుకలు నిర్వహించుకుందాం అనుకుంటే.. కాంగ్రెస్ వాళ్ళు ఫెయిల్యూర్ వేడుకలు నిర్వహించుకుంటామని చెప్పడం ప్రజలను అవమానించడమేనన్నారు.

దేశంలో ఎక్కడి లేని విధంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. తెలంగాణ సంక్షేమ పథకాలను ఆచరిస్తుందని దేశం ఆ పథకాలను అనుసరిస్తుందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాజీనామా చేయని కిషన్ రెడ్డి ఏమని ఉత్సవాలు చేస్తారని ప్రశ్నించారు. తెలంగాణకు మొండిచేయి చూపినందుకా.. తెలంగాణకు రావలసిన నిధులు రాకుండా ఆపినందుకా.. ఇంకా అనేక అంశాలను చర్చిస్తూ తెలంగాణకు ఏ విధంగా సహకారం అందించినందుకేనా ఉత్సవాలను జరిపేదని సెటైర్లు వేశారు. రేవంత్ రెడ్డి వక్ర బుద్ధి గల నాయకుడని విమర్శించారు. తప్పుడు ప్రచారం చేస్తున్న నాయకుడు నమ్మొద్దని.. అభివృద్ధి చేస్తున్న నాయకులను నమ్మి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు..

ఎప్పుడైనా ఎక్కడైనా గెలిచేది బీఆర్ఎస్: జగదీష్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చిన ఎక్కడైనా గెలిచే పార్టీ బీఆర్ఎస్ అని మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉత్తమ్, రేవంత్, బండితో సహా ప్రతి ఒక్కరికి లాభం జరిగిందని అన్నారు. సాగర్ 55 ఏళ్ల చరిత్రలో 16 సార్లు వరుసగా పంటలకు నీరు అందించింది తెలంగాణ ప్రభుత్వంలోనేనని అన్నారు. గతంలో పంటలు పండించుకునేందుకు రైతులు జనరేటర్‌ను పెట్టుకునే వారిని గుర్తు చేశారు. కానీ నేడు అలాంటి సమస్య లేదని 24 గంటలు రైతులకు అందిస్తుందని తెలిపారు. ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తెచ్చింది కరువు.. ఫ్లోరిస్ మాత్రమేనని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగులను తయారు చేసింది కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు.

కేసీఆర్ నాయకత్వమే ప్రజలకు శ్రీరామరక్ష అని కొనియాడారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి ఇంటింటికి వెళ్లి తెలియచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కరరావు, బొల్లం మల్లయ్య యాదవ్, చిరుమర్తి లింగయ్య, ఆర్డీవో వెంకా రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జయ బాబు, వైస్ చైర్మన్ శ్రీలత రెడ్డి, డీఎంహెచ్ఓ కోటాచలం, డాక్టర్ సాహితి, డాక్టర్ హర్షవర్ధన్ తాహాశీల్దార్ సరిత కార్తికేయ, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు అధికారులు, నాయకులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed