భువనగిరిలో రోజురోజుకు పెరుగుతున్న వలస కూలీలు.. ప్రత్యేక నిఘా

by Mahesh |
భువనగిరిలో రోజురోజుకు పెరుగుతున్న వలస కూలీలు.. ప్రత్యేక నిఘా
X

యాదాద్రి భువనగిరి జిల్లాలో వలస కార్మికుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. వివిధ రాష్ట్రాల నుంచి వలస వచ్చి ఇక్కడ అనేక మంది ఇక్కడే తిష్ఠ వేశారు. నిత్యం పని కోసం అడ్డాల వద్ద ఎదురుచూస్తుంటారు. దొరికిన పనికి వెళ్తుంటారు. భువనగిరి జిల్లా కేంద్రంతో పాటు, బీబీనగర్, బొమ్మలరామారం, భువనగిరి మండలం పాటు ఆయా మండల కేంద్రంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి నివాసం ఉంటూ గృహ నిర్మాణ పనులు, పరిశ్రమలు, ఆయా దుకాణాలు, హోటల్స్‌లలో పనులు చేస్తున్నారు. ఇలా పనిచేస్తున్న వారి వివరాలు లేబర్ శాఖ వద్ద లేవు. వారి వివరాల సేకరణకు కార్మిక శాఖ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. స్థానిక కూలీల వివరాలు తెలిసినప్పటికీ.. వలస వచ్చిన వారి గురించి ఎవరికీ తెలియడం లేదు. వలస కూలీల చిరునామా, ఆధార్ కార్డులు, ఇతరత్రా వివరాలపై భువనగిరి ఏసీపీ రాహుల్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఇల్లు అద్దెకు ఇచ్చే ఇంటి ఓనర్ల దగ్గర అయినా వీటికి సంబంధించిన సమాచారం ఉందా లేదా అనే విషయాలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం.-దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లాలో వలస కార్మికుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న వలస కూలీలు భువనగిరి జిల్లా కేంద్రంతో పాటు, బీబీనగర్, బొమ్మలరామారం, భువనగిరి మండలం పాటు ఆయా మండల కేంద్రాలలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి నివాసం ఉంటూ గృహ నిర్మాణ పనులు, పరిశ్రమలు, ఆయా దుకాణాలు, హోటల్స్ లలో పనులు చేస్తున్నారు.

జిల్లా‌ కేంద్రంలో అధికంగా..

ఇతర రాష్ట్రాల నుంచి చాలామంది వలస కూలీలు జిల్లా కేంద్రంలో తిష్ఠ వేశారు. పట్టణంలోని చాల‌ కాలనీలలో అయిదారుగురు కూలీలు కలిసి ఒక చిన్న గది అద్దెకు తీసుకొని జీవనం సాగిస్తున్నారు. ప్రతి నిత్యం ఉదయం పట్టణంలోని జగదేవపూర్ చౌరస్తా వద్దకు వచ్చి వేచి చూస్తారు. కూలీలంతా ఇక్కడికే వచ్చి పని కోసం నిలబడతారు. ఎవరికైతే పని అవసరం ఉంటుందో వారు వచ్చి వీరితో కూలి మాట్లాడుకుని తీసుకొని వెళ్తుంటారు. మరి కొంత మంది ఒక కాంట్రాక్టర్ కింద పని చేస్తూ ఉంటారు.‌ ఆ కాంట్రాక్టర్ అవసరమున్నవారితో పనికి మాట్లాడుకుని తన కింద ఉన్న కూలీలను పంపుతుంటారు.

మరి కొంత మంది దుకాణాలు, హోటళ్లలో..

ఇలా కొంత మంది కూలీలు రోజువారీ పనికి బయటికి వెళ్తుండగా, మరి కొంత మంది జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాలు, ఇతర గ్రామాలలో పలు రకాల దుకాణాలలో, హోటల్లలో పరిశ్రమల్లో రోజువారీ కూలీలుగా పనిచేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఇలా బయట నుంచి వచ్చే వారి వివరాలు స్థానికంగా ఏ శాఖ అధికారులు సేకరిస్తున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది.

సమాచార సేకరణ‌పై ఏసీపీ దృష్టి

ఇలా వలస కూలీల చిరునామా, ఆధార్ కార్డులు, ఇతరత్రా వివరాలపై భువనగిరి ఏసీపీ రాహుల్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇల్లు అద్దెకు ఇచ్చే ఇంటి ఓనర్ల దగ్గర అయినా వీటికి సంబంధించిన సమాచారం ఉందా లేదా అనే విషయాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేకంగా భువనగిరి పట్టణంలో చాలావరకు ఇతర రాష్ట్రాలకు కూలీలు వచ్చి వివిధ రకాల పనుల్లో నిమగ్నమయ్యారు. ఇంకా కొన్ని పరిశ్రమలలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మైనర్లు కూడా పనిచేస్తున్నారన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎమైన అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారికి గురించిన సమాచార సేకరణ ఎలా జరుగుతుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతుండడంతో వీరిపై ప్రత్యేకంగా ఉంచినట్లు సమాచారం. ఉపాధి పేరిట సొంతూరిని వదిలి ఇక్కడికి వస్తున్న కార్మికులు నిత్యం పని కోసం లేబర్ అడ్డా వద్ద ఎదురుచూస్తుంటారు. అడ్డా మీద దొరికిన పనికి వెళ్తుంటారు. ఇలా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కూలీల సమాచారం సేకరణపై పోలీసులు ఇప్పటికే నిమగ్నమైనట్లు తెలుస్తోంది.

వ్యసనాలకు బానిసలుగా..

వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికుల్లో అనేక మంది వ్యసనాలకు బానిసలుగా మారుతున్నట్లు తెలుస్తోంది. ఉదయం లేవగానే తంబాకు, గుట్కా, గంజాయి, మద్యం సేవించి పనికి వెళ్తుంటారని, మత్తులోనే పనిచేస్తుంటారని తెలుస్తోంది. జిల్లాకు బీహార్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి కార్మికులు వలస వస్తున్నారు.

వలస కూలీల సమాచారంపై దృష్టి సారించాం

భువనగిరి పట్టణంతో పాటు, డివిజన్ పరిధిలో ఉన్న వలస కూలీల సమాచారంపై పోలీస్ శాఖ తరపున దృష్టి సారించాం. పలు పరిశ్రమలు, హోటల్స్, రోజువారి కార్యకలాపాలలో ఏఏ రాష్ట్రాలకు కూలీలు పనిచేస్తున్నారనే విషయాలతో పాటు వారిని పనికి తీసుకువెళ్లే కాంట్రాక్టర్ల దగ్గర నుంచి పోలీస్ శాఖ సమాచారాన్ని సేకరిస్తుంది. ఇతర‌ రాష్ట్ర కూలీలతో పాటు ఇక్కడి వారిలో కూడా ఎవరైనా అనుమానస్పదంగా కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలి.-: రాహుల్ రెడ్డి, ఏసీపీ, భువనగిరి



Next Story

Most Viewed