కోమటిరెడ్డి పార్టీ మారింది అందుకోసమే: AICC కార్యదర్శి బోస్ రాజ్ కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 19 |
కోమటిరెడ్డి పార్టీ మారింది అందుకోసమే: AICC కార్యదర్శి బోస్ రాజ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, సంస్థాన్ నారాయణపురం: ప్రజాస్వామ్యంలో అభ్యర్థులు చనిపోతే ఉపఎన్నికలు రావడం సహజమని.. కానీ అందుకు భిన్నంగా మునుగోడు ఉపఎన్నిక వచ్చిందని ఏఐసీసీ సెక్రటరీ బోస్ రాజు అన్నారు. మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారని.. ఆయనకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. శుక్రవారం సంస్థాన్ నారాయణపురం మండల కాంగ్రెస్ కార్యకర్తలతో ఏర్పాటు చేసిన విస్తృతస్థాయి సమావేశానికి కాంగ్రెస్ లీడర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏఐసీసీ సెక్రటరీ బోస్ రాజ్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని 175 గ్రామ పంచాయతీలలో రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ జెండా ఆవిష్కరణ చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అందులో భాగంగా సంస్థాన్ నారాయణపురం మండలం పోర్ల గడ్డ తండాలో ఉదయం 11 గంటలకు పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు తెలిపారు. తనతో పాటు ప్రతి గ్రామపంచాయతీలో రాష్ట్రస్థాయి లీడర్లు జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.

మునుగోడు ఎమ్మెల్యేగా గెలిచి ఎలాంటి అభివృద్ధి పనులు చేయని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్‌లో పదవులు అనుభవించి పార్టీ మారాడని విమర్శించారు. కోమటిరెడ్డి పెద్ద కాంట్రాక్టుల కోసమే పార్టీ మారుతున్నారని ఆరోపించారు. అభ్యర్థి ఎవరైనా కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కార్యకర్తలంతా సహకరించాలని, 15 నుంచి 20 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించనున్నట్లు తెలిపారు. డబ్బుతో రాజకీయం చేసే వ్యక్తులకు మునుగోడు ప్రజలు సరైన తీర్పు ఇవ్వాలని, మన మునుగోడు మన కాంగ్రెస్ నినాదంతో కార్యకర్తలు అంత ముందుకు వెళ్లాలని సూచించారు.

మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి మాట్లాడుతూ.. శనివారం నుండి నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి వరుస పర్యటనలు చేపడతారని.. కార్యకర్తలు ఎవరు మనోధైర్యం కోల్పోవద్దని సూచించారు. అమ్ముడుపోయిన సర్పంచ్, ఎంపీటీసీలు తమ తమ పదవులకు రాజీనామా చేసేలా గ్రామాలలో ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు. త్యాగాల పునాదుల మీద ఏర్పడిన కాంగ్రెస్ దేశంలో మౌలిక సదుపాయాలను కల్పించిందని గుర్తు చేశారు. ఈ సమావేశంలో ఏఐసీసీ సెక్రటరీ రోహన్ చౌదరి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, రాములు నాయక్, చెరుకు సుధాకర్, గండ్ర సత్యనారాయణ రావు, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, చల్లమల కృష్ణ రెడ్డి, పాల్వాయి స్రవంతి, పల్లె రవికుమార్ గౌడ్, పున్న కైలాష్ నేత, స్థానిక నాయకులు గడ్డం మురళీధర్ రెడ్డి, ఏపూరి సతీష్, రాచకొండ రమేష్ బాబు, చిలువేరు శంకర్ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed