వాటిపై చర్చకు సిద్ధమా..? మంత్రి జగదీష్ రెడ్డికి కోమటిరెడ్డి సవాల్

by Disha Web Desk 19 |
వాటిపై చర్చకు సిద్ధమా..? మంత్రి జగదీష్ రెడ్డికి కోమటిరెడ్డి సవాల్
X

దిశ, సంస్థాన్ నారాయణపురం: 2014 తర్వాత మంత్రి జగదీశ్ రెడ్డి ఆస్తులపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సవాల్ విసిరారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా, సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో బీజేపీ ముఖ్య కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత మూడున్నర సంవత్సరాలుగా అసెంబ్లీలో నియోజకవర్గ సమస్యలపై ప్రస్తావించిన.. ప్రభుత్వం ఏనాడు పట్టించుకోలేదన్నారు. కానీ తాను రాజీనామా చేయగానే నియోజకవర్గంలో అభివృద్ధి పనులను శరవేగంగా చేపడుతున్నారని తెలిపారు.

యావత్ ప్రపంచ మునుగోడు ఉప ఎన్నిక వైపే చూస్తోందని.. దేశంలో తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా మునుగోడు ఉప ఎన్నికల గురించి చర్చించుకుంటున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాడడానికే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరానని చెప్పారు. కేసీఆర్ తర్వాత ముఖ్యమంత్రిగా కేటీఆర్, ఆయన మనవడు ఏలాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు ఉండకూడదని ఉద్దేశంతోనే 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిస్తే.. 12 మందిని టీఆర్ఎస్‌లోకి తీసుకున్నారని ఆరోపించారు. జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డికి విద్యుత్ శాఖకు బదులుగా కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ శాఖను కేటాయించినట్లు ఎద్దేవా చేశారు.

సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్‌కు నిధులు తీసుకువెళుతుంటే.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అభివృద్ధి పనులకు నిధులు తీసుకురాలేని దద్దమ్మ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. మునుగోడు నియోజకవర్గ ప్రజల సమస్యలను కేసీఆర్‌తో మాట్లాడడానికి ఒక్కరోజు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదని అన్నారు. రాష్ట్రంలో రాజరిక, కుటుంబ పాలన సాగుతోందని.. దానికి చరమగీతం పాడాలంటే మునుగోడు ఉప ఎన్నికలలో తనను తిరిగి ఆశీర్వదించాలని కోరారు. మునుగోడు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారి ఆత్మ గౌరవాన్ని పెంచేలా పని చేస్తానని చెప్పారు. 2009 తర్వాత ప్రజల సేవ కోసం తన ఆస్తులు అమ్ముకున్నానని.. అదే జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి వేల కోట్ల ఆస్తులు సంపాదించారని ఆరోపించారు.

రాజీనామా చేస్తే తనకు రిస్క్ ఉందని తెలిసి కూడా.. ప్రజా సంక్షేమం కోసమే రాజీనామా చేశానని వ్యాఖ్యానించారు. పదవి ఉన్నా లేకున్నా ప్రజలకు సేవ చేస్తానని తెలిపారు. ప్రస్తుతం జరిగే ఉప ఎన్నిక వ్యక్తి, పార్టీ కోసం వచ్చింది కాదని.. ప్రజల భవిష్యత్తును నిర్ణయించే విధంగా ఉప ఎన్నికల తీర్పు ఉండాలన్నారు. మునుగోడులో జరిగే ధర్మయుద్ధం అహంకారానికి వ్యతిరేకంగా, ఆత్మగౌరవం కోసం జరుగుతుందని పేర్కొన్నారు. మోడీ, అమిత్ షా సారధ్యంలోని బీజేపీ ప్రభుత్వంతోనే రాష్ట్రంలో కుటుంబ పాలన అంతం అవుతోందన్నారు. మునుగోడు ప్రజల తీర్పు దేశంలోనే సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని ఆయన ఆకాంక్షించారు.

ఈ నెల 21న మునుగోడులో జరిగే బహిరంగ సభలో తనతో పాటు భారీ సంఖ్యలో వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు బీజేపీలో చేరనున్నట్లు ఆయన వెల్లడించారు. అనంతరం తన తల్లి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కుటుంబాలకు 8 లక్షల రూపాయలను అందజేశారు. ఈ సందర్భంగా నారాయణపురం గ్రామానికి చెందిన ఇద్దరు వార్డు సభ్యులు బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర నాయకులు దోనూరి వీరారెడ్డి, నాయకులు జక్కల విక్రమ్ యాదవ్, గుత్తా శ్రీధర్ రెడ్డి, కోన్ రెడ్డి నరసింహ, కరంటోతూ శ్రీను నాయక్, ఉప సర్పంచ్ సంజీవ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed