నేడే నల్లగొండ‌లో కేసీఆర్ భారీ బహిరంగ సభ

by Mahesh |
నేడే నల్లగొండ‌లో కేసీఆర్ భారీ బహిరంగ సభ
X

దిశ, నల్లగొండ బ్యూరో: కృష్ణ బేసిన్ ప్రాజెక్టులను, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) ను కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నేడు నల్లగొండ జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. కేంద్రంలోని మర్రిగూడ బైపాస్ సమీపంలో జరిగే బహిరంగ సభకు రెండు లక్షల మందిని తరలించేందుకు పార్టీ నేతలు ప్రయత్నం చేస్తున్నారు. అయితే డిసెంబర్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల అనంతరం కేసీఆర్ మొదటిసారిగా పార్టీ బహిరంగ సభలో పాల్గొంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు అంతా కూడా ఈ సభకు హాజరు కానున్నారని తెలుస్తుంది.

గత మూడు రోజుల నుంచి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, జిల్లాకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు బహిరంగ సభ కోసం నియమించిన ఇన్చార్జులు అంతా సభా ప్రాంగణం ఏర్పాటు జనం తరలింపు లాంటి కార్యక్రమాలను దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారు. కెఆర్ఎంబిని కేంద్ర ప్రభుత్వానికి అప్పగించడం వల్ల ప్రజలకు తీవ్రంగా నష్టం జరుగుతుందని భావించిన బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకే ఈ సభ ఏర్పాటు చేసిన విషయం అందరికీ తెలిసిందే. కానీ సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వం కేఆర్ఎంబిని కేంద్ర ప్రభుత్వానికి అప్పగించే ప్రసక్తే లేదని తీర్మానం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో నేడు జరిగే సభలో పార్టీ అధినేత కేసీఆర్ ఏం మాట్లాడుతారని తెలంగాణ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కేసీఆర్ బహిరంగ సభకు రూట్ మ్యాప్

దేవరకొండ, తిప్పర్తి రోడ్డు నుండి వచ్చే వాహనాలు మర్రిగూడ రోడ్ గుడి వద్ద పార్కింగ్ చేసుకోవాలి

సూర్యాపేట,మిర్యాలగూడ నుంచి వచ్చే వాహనాలు.. సభాస్థలి‌కి దగ్గరలో రోడ్డుకు రెండు వైపులా పార్కింగ్ చేసుకోవాలి

నార్కట్ పల్లి నుంచి వచ్చే వాహనాలు MNR గార్డెన్ ఫంక్షన్ హాల్ వెనుక పార్కింగ్ చేసుకోవాలని తెలిపారు



Next Story