ఆదివాసీలను, గిరిజనులను మోసం చేయడానికే ఆ పథకం: ఆర్ఎస్ ప్రవీణ్

by Disha Web |
ఆదివాసీలను, గిరిజనులను మోసం చేయడానికే ఆ పథకం: ఆర్ఎస్ ప్రవీణ్
X

దిశ, చౌటుప్పల్: ఆదివాసీలను, గిరిజనులను మోసం చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజన బంధు పథకం ప్రవేశపెట్టారని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని తూప్రాన్ పేట గ్రామం నుండి బహుజన రాజ్యాధికార పాదయాత్రను ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. 2014, 18 ఎన్నికల్లో కేసీఆర్‌కు గిరిజనులు ఎందుకు గుర్తు రాలేదు? అని ప్రశ్నించారు. ఉప ఎన్నిక కోసమే గిరిజన బంధు పథకం తీసుకొచ్చారని విమర్శించారు. నిరుద్యోగులను మోసం చేయడానికే గిరిజనులకు 10% రిజర్వేషన్ హామీని ముందుకు తీసుకొచ్చారని దుయ్యబట్టారు.

గిరిజనులు, ఆదివాసీల మీద గౌరవం ఉంటే ఒక గిరిజన మహిళను రాష్ట్రపతిగా ఎన్నుకుంటుంటే అగ్రవర్ణ నాయకుడు యశ్వంత్ సిన్హాకు ఎందుకు మద్దతిచ్చారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం పేరుతో యువకులను తాగుబోతులుగా మారుస్తుందని విమర్శించారు. తెలంగాణలో బహుజన రాజ్యం తీసుకురావడానికి ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దోపిడీ పాలన, గడీల పాలన పోతేనే బహుజనుల బతుకులు మారుతాయని, 8 సంవత్సరాల నుండి టీఆర్ఎస్ చేస్తున్న దోపిడీ పాలన గురించి ప్రజలకు వివరిస్తామని అన్నారు. తూప్రాన్ పేట గ్రామంలో భవన నిర్మాణ కార్మికులకు ఆయన కాసేపు ముచ్చటించారు.

Telugu News , Latest Telugu News. Telangana News. Political News. Cinema News. Crime News. AP News. Web Stories. Latest Photo Galleries

Next Story

Most Viewed