ఆవిర్భావ వేడుకల్లో... అసంతృప్తి సెగలు

by Disha Web Desk 15 |
ఆవిర్భావ వేడుకల్లో... అసంతృప్తి సెగలు
X

దిశ , కోదాడ టౌన్ : కోదాడ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు ఇంట్లో బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ అగ్ర నేత తన ఆవేదనను వెలిబిచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా మాజీ డీసీసీబీ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు అధికార పార్టీ నాయకులపై తీవ్ర ఆరోపణలు చేశారు. తనను బలవంతంగా పార్టీలోకి లాగారని, తన హయాంలో కాపుగల్లు సొసైటీలో ఎలాంటి అవినీతి చోటుచేసుకోలేదని, ఉద్దేశపూర్వకంగానే కేసులు బనాయించి అరెస్ట్ చేయించారని ధ్వజమెత్తారు. ఎనభై రెండు లక్షల ధాన్యం కుంభకోణం తాను చేశాననటం అవాస్తవమని, కోదాడ రూరల్ పోలీసులు చార్జ్ షీట్ వెయ్యకుండా తనను అరెస్ట్ చేశారని అన్నారు. కుంభకోణం కేసు వివరాలు తెలుపుతూ కోదాడ సొసైటీలో 15 వేల క్వింటాలు , కాపుగల్లు సొసైటీలో 3900 క్వింటాల ధాన్యం కుంభకోణం జరిగిందని 2015లో సొంత పార్టీ వారే కేసు పెట్టించారన్నారు. తిరిగి 2017లో అధికార పార్టీ నాయకులు తనను కూడా కేసులో ఇరికించారని చెప్పారు. కాంగ్రెస్ లో తాను డీసీసీబీ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో మంత్రి కేటీఆర్ , అప్పటి మరో జిల్లా మంత్రి ఇతర నాయకుల ఒత్తిడితో టీఆర్ఎస్ పార్టీ లో చేరానన్నారు. పార్టీలో చేరే ముందు నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు ఇస్తామన్నారని వివరించారు. అక్రమ కేసు విషయంలో కూడా తనకు న్యాయం చేస్తామని స్వయంగా కేటీఆర్ హామీ ఇచ్చరన్నారు. తీరా ఆ కేసులో అధికారులు ఇరుక్కుంటారని అందుకోసం నన్ను కేసులో ఇరికించారని వాపోయారు. కోదాడ , కాపుగల్లు సొసైటీలలో ఎంక్వైరీ చేసి కోదాడ సొసైటీలో అధికారుల తప్పిదం అని వారిపై చర్యలు తీసుకొని , కాపుగల్లు సొసైటీ విషయంలో సెక్షన్ 51 ప్రకారం ఎంక్వరీ చేసి నా తప్పు లేదని తెలిసి కూడా తనను ఇరికించారని వాపోయారు. అనంతరం తాను హైకోర్టుకు పోయి ట్రిబ్యునల్ ద్వారా కేసు విచారణ జరిపించానన్నారు.

హైకోర్టు జడ్జి విచారించి సివిల్ సప్లై కార్పొరేషన్ ద్వారా అరవై రెండు లక్షల రూపాయలు విడుదల చేయాలన్న ఆదేశంతో రైతులకు చెల్లించడం జరిగిందని అన్నారు. ఇదంతా జరిగి ఏడాదిన్నర దాటిందని తెలిపారు. బలవంతంగా పార్టీలో చేర్చుకొని గొంతులు కోయవద్దని ఆవేదన వ్యక్తం చేశారు. సొంత పార్టీ నేతలే తనపై బురద జల్లుతూ పబ్బం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు జరిగిన అన్యాయంపై పార్టీలో ఉండే పోరాడుతానన్నారు. పోలీసులను అడిగితే పై నుండి ఒత్తిడి ఉందని అందుకే అరెస్టు చేశామని చెప్పారన్నారు. హైకమాండ్ కేవలం ఎమ్మెల్యేలకు మాత్రమే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుందని, మిగతా నాయకులను కూడా అలానే చూడాలని కోరారు. ఎమ్మెల్యేలు చేసే దందాలు అన్నీ అధిష్టానానికి తెలిసే జరుగుతున్నాయని ఆరోపించారు. ఆస్తులు పోగొట్టుకుని ఉద్యమం చేసిన నాయకులు నేడు నియోజకవర్గం లో అనేక సమస్యలు , అవమానాలు ఎదుర్కొంటున్నామని అన్నారు. తనకు కోర్టు వ్యక్తిగత పూచికత్తు పై బెయిల్ మంజూరు చేసిందన్నారు. కార్యక్రమంలో వేనేపల్లి చందర్ రావు , కన్మంతరెడ్డి, శశిధర్ రెడ్డి, మహబూబ్ జానీ, వనపర్తి లక్ష్మీనారాయణ, ఎర్నేని వెంకటరత్నం బాబు, తిపిరిశెట్టి.రాజు, గుంపుల శ్రీనివాస రెడ్డి, బొలిశెట్టి నాగేంద్ర బాబు, బండ్ల కోటయ్య, గుండపునేని నాగేశ్వర రావు పాల్గొన్నారు.


Next Story

Most Viewed