అభివృద్ధి పేరుతో అక్రమ మట్టి దందా

by Dishaweb |
అభివృద్ధి పేరుతో అక్రమ మట్టి దందా
X

దిశ, బీబీనగర్ : బీబీనగర్ మండలం జియపల్లి గ్రామంలో అక్రమ మట్టి దందా జోరుగా కొనసాగుతోంది. ప్రభుత్వ స్థలం నుంచి టిప్పర్ల ద్వారా సుమారు పది అడుగుల మేర మట్టిని తవ్వి పక్కనే ఉన్న ఘట్కేసర్ మండలంలోని ప్రైవేట్ వెంచర్లకు మట్టిని తరలిస్తున్న అధికారులు చోద్యం చూస్తున్నారు. సుమారు నాలుగు ఎకరాలకు పైగా ఉన్న స్థలం నుంచి ఈ మట్టి కొనసాగింపు దందా గత పదిహేను రోజులుగా గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతోంది.

పాలశీతలీకరణ భవనం నిర్మాణం‌ సాకుతో.......

జియా పల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 215 లో ఉన్న నాలుగు ఎకరాల స్థలంలో గ్రామంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో పాలశీతలీకరణ కేంద్రం ఏర్పాటు చేయడానికి అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు నిర్ణయించుకున్నారు. అయితే దీనికి సంబంధించి ఇంతవరకు ఎలాంటి ప్రొసీడింగ్స్ కూడా రాలేదు. కానీ అధికార పార్టీ నాయకులు మాత్రం వెనువెంటనే ఆ స్థలం నుంచి మట్టిని త్రవ్వడం ప్రారంభించారు. అయితే ఈ కేటాయించిన స్థలంలో చిన్నపాటి గుట్ట ఉండడంతో దానిని చదును చేసే సాకుతో సుమారు పదిహేను అడుగుల మేర మట్టిని తవ్వేశారు. రోజుకు సుమారు 100 ట్రిప్పుల వరకు ఈ మట్టిని తరలిస్తున్నారని, ఒక్క ట్రిప్పు విలువ సుమారు ఆరు వేలకు పైగా ఉంటుందని, దీని ప్రకారం ఇప్పటివరకు కోట్లాది రూపాయలను అధికార పార్టీ నాయకులు దండుకుంటున్నారని పలువురు చెబుతున్నారు.

అధికార పార్టీ నాయకుల వెంచర్లకు తరలింపు....

ఈ మట్టిని మండలంలోని పలు గ్రామాలలో రోడ్ల నిర్మాణానికి, ఇతరత్రా ప్రజల అవసరాలకు వాడుకోకుండా ఘట్కేసర్ లోని అధికార పార్టీ నాయకులు చేపడుతున్న వెంచర్లకు తరలించి డబ్బులు దండుకుంటున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అయితే ఇంత బహిరంగంగా జరుగుతున్న ఈ తీరుపై గ్రామస్తులు బీబీనగర్ ఎస్సైకి, మండల తహసీల్దార్ కు ఫిర్యాదు చేశారు. అయితే ఈ వ్యవహారానికి భువనగిరి ఎమ్మెల్యే అండతో మండలంలోని ఒక ముఖ్య ప్రజా ప్రతినిధి దీని వెనుక ఉండటంతో అధికారులు కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ మట్టి తరలింపు చర్యను అడ్డుకొని, విలువైన ప్రకృతి సంపదను కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.


Next Story

Most Viewed