ఘనంగా బుద్ధ జయంతి వేడుకలు

by Sridhar Babu |
ఘనంగా బుద్ధ జయంతి వేడుకలు
X

దిశ, నాగార్జునసాగర్ : ప్రపంచ మానవాళికి చక్కటి జీవన విధానాన్ని అందించిన గౌతమ బుద్ధుడు గొప్ప దార్శనీయకుడని, ఆయన చూపిన మార్గం ఆచరణీయమని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కె. రమేష్ నాయుడు అన్నారు. నాగార్జునసాగర్ లోని బుద్ధ వనంలో తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన 2568 వ బుద్ధ జయంతి వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరైనారు. ఆయనతో పాటు కర్ణాటక రాష్ట్రంలోని బైలు కుప్పే, సెర బౌద్ధ ఆరామానికి చెందిన గెషే నవాంగ్ జుంగె, సికింద్రాబాద్ మహాబోధి బుద్ధ విహారం నుండి వచ్చిన శీలం చారో లా నేతృత్వంలో ముందుగా బుద్ధుని పాదాల వద్ద బుద్ధ పాద వందనం సమర్పించిన తర్వాత మహా స్తూపం అంతర్భాగంలోని ఆచార్య నాగార్జున కాంస్య విగ్రహం వద్ద పుష్ప నివాళి అర్పించారు.

అనంతరం మహా స్తూపం లోని సమావేశ మందిరంలో బుద్ధ వందనంతో ప్రారంభమైన బుద్ధ జయంతి ఉత్సవ సభకు అధ్యక్షత వహించిన టూరిజం ఎండీ రమేష్ నాయుడు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే బుద్దవనంలో బుద్ధ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించమన్నారు. గౌతమబుద్ధుని బోధనలు ప్రపంచం మొత్తానికి ఆదర్శనీయమన్నారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా హాజరైన హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి చెందిన చరిత్ర విభాగం పూర్వ అధ్యక్షులు చరిత్రకారిణి ఆచార్య అలోక పరా షేర్ షీ కు బౌద్ధంలో స్నేహం అనే అంశంపై, శాతవాహన విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్స్లర్ ఆచార్య మల్లేష్ సంక శాల బౌద్ధములో సామాజికత అనే అంశంపై ప్రసంగించారు.

అనంతరం బుద్ధ వనం కన్సల్టెంట్ బౌద్ధ పరిశోధకులు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి రచించిన బుద్ధుని మొదటి ప్రవచనం, బుద్ధుని చివరి రోజులు పుస్తకాలను విశిష్ట అతిథులు ఆవిష్కరించారు. ఆ తరువాత బుద్ధ జయంతి సందర్భంగా బుద్ధ వనంలో నిర్వహించిన వ్యాసరచన పోటీలలో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో బుద్ధ వనం ఓ ఎస్ డీ సుదన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉపేందర్ రెడ్డి , హోటల్స్ జీఎం నాదన్, నల్లగొండ జిల్లా పర్యాటక అధికారి శివాజీ, విజయ విహార్ మేనేజర్ కిరణ్, బౌద్ధ అభిమానులు ఈ వేడుకలలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story

Most Viewed