అడ్మిషన్ల కోసం గ్రామాల బాట..

by Disha Web Desk 20 |
అడ్మిషన్ల కోసం గ్రామాల బాట..
X

దిశ, తుంగతుర్తి : నియోజకవర్గ కేంద్రమైన తుంగతుర్తిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల యాజమాన్యం అడ్మిషన్ల కోసం గ్రామాల బాట పట్టారు. మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు మా కళాశాల ద్వారా బాటలు వేయించండి... అంటూ ప్రచారాన్ని కొనసాగిస్తోంది. సెలవు దినాలే అయినప్పటికీ కళాశాల సిబ్బంది మాత్రం అవేమీ పట్టించుకోకుండా ప్రచారంలో మునిగి తేలుతున్నారు. ఈ మేరకు కళాశాలలో ఉన్న లెక్చరర్లు ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో టీంలుగా ఏర్పడ్డారు. రోజుకు ఒక టీం చొప్పున గ్రామాలకు వెళుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాల విశిష్టతను వివరిస్తూ విద్యార్థుల అడ్మిషన్ల కోసం కృషి చేస్తున్నారు. కళాశాలకు చెందిన లెక్చరర్లు నాగయ్య, భగత్ సింగ్, మధుకర్, ప్రవీణ్, ప్రదీప్, రాంబాబు, పుల్లయ్య, గణేష్, నాగేశ్వరరావు, సంతోష్, అనిత, దయాకర్, తదితరులంతా టీంలుగా ఏర్పడి ఈ నెలాఖ వరకు గ్రామాలలో పర్యటిస్తూ విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను చైతన్య పరుస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివితే విద్యార్థులకు భవిష్యత్తు పరంగా కలిగే ప్రయోజనాలను లెక్చరర్ల బృందాలు కూలంకషంగా వివరిస్తున్నాయి. ఇదిలా ఉంటే వచ్చేనెల మొదటి తేదీ నుండి 12 వరకు కళాశాల యాజమాన్యం మూకుమ్మడిగా ఆర్భాటంతో ప్రచారాలు చేస్తూ అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించారు.

ప్రచారంలో కళాశాలలో చదివిటాపర్ గా నిలిచిన విద్యార్థుల ఫోటోలతో ముద్రించిన కరపత్రాలు విస్తృతంగా పంపిణీ చేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ, సీఈసీ గ్రూపులతో పాటు రెండు ఒకేషనల్ కోర్సులు కళాశాలలో ఉండగా ఒక్కొక్క గ్రూపులో 88 మంది విద్యార్థులకు మాత్రమే ప్రవేశాలు ఉంటాయి. అంతకంటే ఎక్కువ మంది విద్యార్థుల ప్రవేశం జరిగితే రెండో గ్రూపుగా ఏర్పాటు చేయాలని కళాశాల యాజమాన్యం నిర్ణయించింది. ఇదిలా ఉంటే ఇప్పటికే వెలుగుపల్లి, కాశీతండ, దేవునిగుట్ట తండ, రావులపల్లి, వెంపటి, అర్వపల్లి, తదితర ప్రాంతాలలో లెక్చరర్ల టీం బృందాలు ప్రచారాన్ని కొనసాగించాయి. గత ఏడాది కంటే ఈసారి అడ్మిషన్ల ప్రక్రియ పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వ జూనియర్ కళాశాల యాజమాన్యం ముందుకు సాగుతోంది. కాగా ప్రభుత్వ జూనియర్ కళాశాల టీం సభ్యులు చేపడుతున్న ప్రచారం గ్రామాలలో అందరిని ఆకట్టుకుంటుంది.



Next Story

Most Viewed