అక్కడి నుండే కేసీఆర్ పతనం ప్రారంభం : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

by Disha Web Desk 13 |
అక్కడి నుండే కేసీఆర్ పతనం ప్రారంభం : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
X

దిశ, చండూర్: మునుగోడు లో జరిగే ఉప ఎన్నిక నుండే కేసీఆర్ అవినీతి, కుటుంబ పాలనకు పతనం ప్రారంభమవుతుందని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. గురువారం చండూర్‌లోని మార్కండేయ దేవాలయంలో చేనేత కార్మికుల ఒకరోజు నిరసన దీక్ష కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చేనేత వస్త్రాలపై జీఎస్టీ తొలగించి, వారికి చేనేత బంధు పథకాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చేనేత వస్త్రాలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సూచించారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకంలో రెండు చేనేత వస్త్రాలను లబ్ధిదారులకు ఉచితంగా ఇవ్వాలన్నారు. గతంలో 77 రోజులు చేనేత కార్మికులు నిరసన దీక్ష చేశారని వీరి సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. అమరవీరుల ఆత్మబలిదానాలతో సాధించుకున్న తెలంగాణ నేడు కేసీఆర్ చేతిలో బందీ అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు.

మునుగోడు ప్రజలు ఇచ్చే తీర్పు తెలంగాణ ప్రజల భవిష్యత్తును నిర్ణయిస్తుందని ఆయన గుర్తు చేశారు. తాను కాంట్రాక్టుల కోసం అమ్ముడుపోయానని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయని, నన్ను గెలిపించిన ప్రజల ఆత్మగౌరవాన్ని అమ్మే వ్యక్తిని కాదన్నారు. మార్కండేయ గుడి సాక్షిగా నేను అమ్ముడుపోయినట్లు మంత్రి జగదీశ్వర్ రెడ్డి నిరూపించాలని ఆయన సవాల్ విసిరారు. జగదీశ్వర్ రెడ్డి అవినీతిపరుడని 2014 ముందు ఆయన ఆస్తులు ఎంత..? ఇప్పుడు ఆయన ఆస్తులు ఎంతో..? నిరూపించుకోవాలన్నారు.

నా రాజీనామాతో కేసీఆర్ ఫామ్ హౌస్ నుండి బయటకు వచ్చి అభివృద్ధి పనులు చేస్తున్నాడన్నారు. చేనేత భీమా, గిరిజన బంధు, రోడ్లు, పెన్షన్లు ఇవన్నీ నా రాజీనామతోనే ప్రజలకు అందుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. ధనిక రాష్ట్రాన్ని 4 లక్షల కోట్ల అప్పులపాలు చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. రాబోయే ఉప ఎన్నికల్లో మునుగోడు ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చి కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో చండూర్ జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం, గట్టుపల్ ఎంపీటీసీ అవ్వారు గీత శ్రీనివాస్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కోమటి వీరేశం, దోటి వెంకటేష్, మాజీ సర్పంచ్ కోడి గిరిబాబు, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు కోడి శ్రీనివాసులు, చేనేత కార్మికులు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed