మోత్కుపల్లి అసమ్మతిగళం! నేడు యాదగిరిగుట్టలో అనుచరులతో సమావేశం?

by Disha Web Desk 7 |
మోత్కుపల్లి అసమ్మతిగళం! నేడు యాదగిరిగుట్టలో అనుచరులతో సమావేశం?
X

దిశ, నల్లగొండ బ్యూరో: మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత మోత్కుపల్లి నర్సింహులు పార్టీపై అసమ్మతి గళం వినిపించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఇందు కోసం తన అనుచరులతో గురువారం ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం. దళిత బంధు స్కీమ్ ప్రవేశపెట్టిన కొత్తలో సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని బీజేపీ నేతగా ఉన్న మోత్కుపల్లి అభినందించారు. అంతేకాకుండా దళితుల సాధికారిత మీద జరిగిన మీటింగ్‌కు కేసీఆర్ నర్సింహులును స్వయంగా ఆహ్వానించారు. ఆ తర్వాత మోత్కుపల్లి బీఆర్ఎస్‌లో చేరిపోయారు. అనంతరం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సీఎం ఎక్కడ పర్యటించినా ఆయన వెంట కనిపించారు. ఆ సమయంలో మోత్కుపల్లికి దళిత బంధు స్కీమ్‌కు రాష్ట్ర చైర్మన్ పదవిని కట్టబెడతారని ఊహాగానాలు వెలువడ్డాయి.

కానీ ఆ పదవి సంగతి పక్కనపెడితే కనీసం పలకరించే వారు కూడా లేకుండాపోయారు. అయినా ఓపికగా ఉన్న మోత్కుపల్లి నెల రోజుల క్రితం తన మనసులోని మాటను బయటపెట్టారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఏ నియోజకవర్గం నుంచైనా పోటీ చేసే అవకాశాన్నివ్వాలని కోరారు. అయితే ఇటీవల బీఆర్ఎస్ విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో సిట్టింగులకే టికెట్లు కేటాయించారు. దీంతో మోత్కుపల్లి తీవ్ర అసంతృప్తికి గురైనట్లు తెలిసింది. భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించేందుకు ఆలేరు సెగ్మెంట్‌కు చెందిన అనుచరులతో సమావేశమవుతున్నారని సమాచారం. అయితే మోత్కుపల్లి పార్టీ మారుతారా? పార్టీలోనే ఉండి సీఎంపై ఒత్తిడి తీసుకువస్తారా అనేది వేచి చూడాలి.

Also Read: తుమ్మల నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి..!బుజ్జగింపులకు దిగిన బీఆర్ఎస్ అధిష్టానం

Next Story