ఆబ్కారీ శాఖ అక్రమ వసూళ్లు...ప్రతి నెల వైన్స్ ల నుంచి రూ. 1 కోటికి పైనే....?

by Kalyani |
ఆబ్కారీ శాఖ అక్రమ వసూళ్లు...ప్రతి నెల వైన్స్ ల నుంచి రూ. 1 కోటికి  పైనే....?
X

దిశ, నల్గొండ బ్యూరో : మద్యం వ్యాపారులను పీల్చి పిప్పి చేస్తూ అధికారులు తమ జేబులు నింపుకుంటున్నారని విమర్శలు జోరుగా ఉన్నాయి. ఏ వ్యాపారిని అడిగిన అధికారుల నుంచి ఎదురయ్యే ఇబ్బందులు చెప్తుంటారు. వాళ్ల ఇబ్బందులు కష్టాలు అధికారులకు అవసరం లేదు . వైన్స్ యాజమానుల నుంచి బలవంతంగా వసూలు చేసుకోవడం మాత్రం తెలిసిందే... ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అధికారులు అడిగింది ఇవ్వకపోతే ఇక వైన్స్ యజమానికి తిప్పలు తప్పవు అందుకే వాళ్ళు అడిగింది తడవుగా అన్ని పనులు చక్కబెట్టి పంపిస్తారని సమాచారం..

ఉమ్మడి జిల్లాలో వైన్స్ లు....

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 336 వైన్స్ లున్నాయి.. అంతేగాకుండా 56 బార్, రెస్టారెంట్ ఉన్నాయి. అందులో నల్లగొండ జిల్లాలో 155, సూర్య పేట జిల్లాలో 99, యాదాద్రి భువనగిరి 82 వైన్స్ ఉన్నాయి. ప్రతి ఏడాది ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ నుంచి వైన్స్ లను రెన్యువల్ చేసుకోవాలి. రెండేళ్లకు ఒకసారి షాపుల కేటాయింపుకు నోటిఫికేషన్ విడుదల చేసి డ్రా పద్ధతి ద్వారానే షాపుల ఎంపిక జరుగుతుంది.

ప్రతి వైన్స్ నుంచి జబర్దస్త్ గా రూ. 1 కోటి పైగా .......?

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ అధికారులు వైన్స్ ల నుంచి పెద్ద ఎత్తున వసూలు చేస్తున్నట్లు సమాచారం ఉంది. ప్రతి నెల ఒక వైన్స్ నుంచి రూ. 23వేలు, బార్ నుంచి రూ.20వేలు జబర్దస్త్ గా వసూలు చేస్తున్నారని తెలిసింది. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న 336 వైన్స్ సుమారు రూ.80లక్షలు, 56 బార్ ల నుంచి రూ.20వేలు చొప్పున సుమారు రూ.36 లక్షలు వసూళ్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా వైన్స్, బార్ ల నుంచి రూ. 1 కోటికి పైగానే వసూళ్లు చేస్తున్నట్లు వినికిడి.

వసూళ్ల సొమ్ము పంపకం ఇలా.....!!

ఇదిలా ఉంటే ప్రతి వైన్స్ నుంచి రూ. 23వేలు, స్థానికంగా ఉన్న ఎక్సైజ్ పోలీసు అధికారులు వసూళ్లు చేస్తారని సమాచారం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు రూ. 90లక్షల వసూళ్లు చేస్తారని సంబంధిత శాఖ లోనే జోరుగా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఆ వసూలు చేసిన సొమ్ము లో ఉమ్మడి జిల్లా స్థాయిలో ఉన్న ఓ అధికారికి రూ.2500, ఆ తర్వాత స్థాయి అధికారికి రూ.2000, విభజన జిల్లా స్థాయి అధికారికి రూ.3000, మరో అధికారికి రూ.1500ల చొప్పున మొత్తం రూ.9వేలు పై అధికారుల జేబుల్లోకి వెళతాయని సమాచారం. మిగతా రూ.14వేలలో 40శాతం స్టేషన్ లో ఉండే అధికారికి, రెండో అధికారికి 30శాతం, పంపకాలు చేసుకోగా మిగతా సొమ్ము ను క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది తీసుకుంటారని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం.

ఇదే పద్ధతిలో ఉమ్మడి జిల్లాలో ఉన్న 56 బార్ ల నుంచి సుమారు రూ .11లక్షలకు పైగా వస్తున్న సొమ్ము ను కూడ అలాగే పంపకాలు చేసుకుంటారని తెలుస్తోంది. ఇలా వసూలు చేస్తున్న అక్రమాల పట్ల వైన్ యాజమాన్యం ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దీనిపై విచారణ చేసి అక్రమవసులకు పాల్పడుతున్న అధికారిపై చర్యలు తీసుకోవాలని వైన్ షాపులో యజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి.



Next Story

Most Viewed