రాజకీయాలతో గణేష్ ఉత్సవాలను ముడి పెట్టొద్దు : ఎస్సై ప్రవీణ్ కుమార్

by Sumithra |
రాజకీయాలతో గణేష్ ఉత్సవాలను ముడి పెట్టొద్దు : ఎస్సై ప్రవీణ్ కుమార్
X

దిశ, తుంగతుర్తి : గణేష్ నవరాత్రి ఉత్సవాలను రాజకీయాలకు అతీతంగా జరుపుకోవాలని, ఉత్సవాల పై రాజకీయ నాయకుల ప్రమేయాలు ఉంటున్నట్లుగా వస్తున్న ప్రచారాలలో ఎలాంటి వాస్తవాలు లేవని తుంగతుర్తి పోలీస్ సబ్ ఇన్స్ పెక్టర్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో గత 30 ఏళ్ల నుండి అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో కలిసికట్టుగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుగుతుండేవని, అయితే ఇటీవలే ఆ సంఘం రెండు వర్గాలుగా విడిపోయి ఎవరికి వారే కమిటీలు ఏర్పాటు చేసుకొని విగ్రహాల ప్రతిష్టకు పూనుకున్నారని తెలిపారు. ఇందులో భాగంగానే అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ వద్ద విగ్రహాల ప్రతిష్టాపన స్థలం పై ఘర్షణ వాతావరణం ఏర్పడగా తాము అక్కడికి వెళ్లి సమస్యను పరిష్కరించామని ఆయన తెలిపారు.

అయితే కొందరు వ్యక్తులు ఈ సంఘటనను వీడియో తీసి వైరల్ చేయడంతో పాటు రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్నట్లుగా పోస్టులు పెట్టారని వివరించారు. అయితే ఇందులో ఎలాంటి వాస్తవం లేదని పేర్కొంటూ ఇలాంటి ప్రచారాన్ని ఎవరు కూడా నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రతిఒక్కరు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఎంతటి వారైనా చట్ట పరిధికి కట్టుబడి ఉండాలని హెచ్చరించారు. ముఖ్యంగా తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఘర్షణల వాతావరణం వైపు వెళ్లకుండా కట్టడి చేసుకోవాలని ఆయన తల్లిదండ్రులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.



Next Story

Most Viewed