- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
పగిలిన అలుగు.. రైతు గుండెల్లో గుబులు..

దిశ, చిలుకూరు: మండలంలోనే పెద్ద జలవనరు బేతవోలు వీర్లదేవి చెరువు ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యంతో చెరువు శిఖం భూమి ఆక్రమణలకు గురవుతోంది. ఆక్రమణలు పోను ప్రస్తుతం ఉన్న చెరువులోనైనా నీటిని నిల్వ చేసే వెసులుబాటు కనిపించడం లేదు.
అలుగును ధ్వంసం చేసి రెండు నెలలు..!
ఇటీవల రెండు నెలల క్రితం బేతవోలు చెరువు పూర్తి స్థాయిలో నిండింది. చెరువు ఆక్రమిత భూములు చెరువు నీటితో నిండాయి. పైరుకు నష్టం అవుతుందని భావించిన కొందరు చెరువు నీటిని బయటకు వదిలేందుకు రాత్రికి రాత్రే చెరువు అలుగును బరాలతో పేల్చేయడంతో చెరువు నీరంతా వృథాగా బయటకు వెళ్లుతుంది. ఈ చెరువు కింద దాదాపు మూడు వేల ఎకరాల్లో రైతులు సాగు చేస్తుంటారు. సాగు నీరు అందక ఆ రైతుల పొలాలన్నీ ఎండిపోయే దశకు చేరాయి. అల్పపీడన వర్షాలతో పైరు చస్తూ బతుకుతోంది తప్ప చెరువు నీరు మాత్రం అందుబాటులోకి రావడం లేదు.
వచ్చారు.. చూశారు.. వెళ్లారు..!
అలుగును పేల్చిన కొన్ని రోజులకు సంబంధిత అధికారులు వచ్చి దానిని చూసి వెళ్లారు. నెల రోజుల దాటినా అలుగుకు మరమ్మతులు చేపట్టిన దాఖలాలు లేవు. ఈలోగా మళ్లీ వర్షాలు రావడం, చెరువు అలుగు స్థాయికి నీరు చేరడం, ఆ ధ్వంసమైన అలుగు నుంచి నీరు వృథాగా బయటకు వెళ్లడం ఓ తంతుగా మారింది. చెరువులో నిల్వ ఉండాల్సిన నీరు ఇలా బయటకు వెళుతుండడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఓ గుత్తేదారు అలుగును పరిశీలించి వెళ్లారని స్థానిక రైతులు చెబుతున్నారు.
సాగర్ నీరు వదిలితే పరిస్థితి ఏంటి..?
అక్టోబర్ 1న సాగర్ ఎడమ కాల్వ నీటిని విడుదల చేస్తారని, చెరువులను నీటితో నింపుతామని ఇటీవల జిల్లా మంత్రి, కొందరు ఎమ్మెల్యేలు ప్రకటనలు చేశారు. వారన్నట్లుగానే జరిగితే బేతవోలు చెరువులో నీరు నిల్వ ఉండే పరిస్థితి కనిపించడం లేదు. ఆ ధ్వంసమైన అలుగు మరమ్మతులు చేసేదెన్నడు? చెరువులో నీరు నిల్వ ఉండేదెన్నడు? అని చెరువు ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కాస్త అన్నదాతను కాపాడండయ్యా.