మునుగోడు అభివృద్ధికి సహకరించండి: ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

by Disha web |
మునుగోడు అభివృద్ధికి సహకరించండి: ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
X

దిశ, మునుగోడు: మునుగోడును అన్ని రంగాలలో అబివృద్ధి చేసేందుకు పార్టీలకతీతంగా సహకరించాలని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కర్నాటి స్వామియాదవ్ అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ఆసరా పెన్షన్లు, పంట పెట్టుబడికి రైతు బంధు, సేద్యానికి ఉచిత విద్యుత్ సరఫరా, కేసీఆర్ కిట్, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ అందిస్తూ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్తున్నారని తెలిపారు. గొర్రెల కొనుగోలులో అవకతవకలు జరుగకుండా చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

ఎన్నికల నిబంధనల దృష్ట్య గొర్రెల పంపిణీ ఆలస్యమైందన్నారు. మునుగోడు అభివృద్ధిపై నెలకోసారి సమీక్ష సమావేశాన్ని నిర్వహించాలన్నారు. కొన్ని గ్రామాలలో వృద్ధులకు పింఛన్ అందక, లబ్ధిదారులకు రేషన్ బియ్యం అందక పక్క గ్రామాలకు కిలో మీటర్ల దూరం నడిచి వెళ్ళి తెచ్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి గ్రామానికి నిర్వాహకులు వెళ్ళి ప్రజలకు అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. తనకున్న తక్కువ సమయంలోనే మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ఈ ప్రాంతానికి గౌరవం తీసకొస్తానన్నారు. ఈ సమావేశంలో మునుగోడు వైస్ ఎంపీపీ అనంత వీణస్వామిగౌడ్, తహసీల్దార్ క్రిష్ణారెడ్డి, ఎంపీడీవో జానయ్య, వ్యవసాయశాఖ అధికారి శ్రీనివాస్ గౌడ్, ఎంఈవో నర్సింహ్మ, వైద్యాధికారి అబ్దుల్ జమీర్, పశువైద్యాధికారి వెంకన్న, శైలజ తదితరులు పాల్గొన్నారు.Next Story