బీజేపీని గద్దెదించడమే కమ్యూనిస్టుల లక్ష్యం: తమ్మినేని వీరభద్రం

by Disha Web Desk 23 |
బీజేపీని గద్దెదించడమే కమ్యూనిస్టుల లక్ష్యం: తమ్మినేని వీరభద్రం
X

దిశ, చిట్యాల: సామాన్య ప్రజల సమస్యలను గాలికొదిలేసి కార్పొరేట్ శక్తుల మెప్పుకోసం పనిచేస్తూ దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ రంగాలకు విక్రయించి, నిరుద్యోగులకు ఉపాధి లేకుండా చేస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే కమ్యూనిస్టుల ఏకైక లక్ష్యమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సిపిఎం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర కార్యక్రమంలో భాగంగా సోమవారం చిట్యాల పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూతొమ్మిదేళ్ల బిజెపి పాలనలో ప్రభుత్వ సంస్థలన్నీ కారు చౌకగా కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే కుట్ర బీజెపి ప్రభుత్వం చేస్తుందని ఆయన దుయ్యబట్టారు. దేశంలో బలహీన వర్గాల అభ్యున్నతి కోసం రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్లు రద్దు చేసే కుట్రతో బీజెపి ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తుందని ఆరోపించారు.

ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తే ఇక రిజర్వేషన్లు అనేవి ఉండవు కాబట్టి ఎల్ఐసి, బ్యాంకింగ్, రైల్వే, విద్యుత్ రంగాలను ప్రైవేటుపరం చేస్తున్నాడనీ ఆయన విమర్శించారు. అందుకే ప్రభుత్వ రంగ సంస్థలని, ప్రభుత్వ ఆస్తుల్ని అప్పనంగా కార్పొరేట్ సంస్థలకు అమ్ముకుంటున్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు కమ్యూనిస్టు లు సమరశీల పోరాటాలు కొనసాగిస్తామన్నారు.

ఒకే దేశం, ఒకే ఎన్నిక, ఒకే భాష అని పదేపదే చెబుతున్న బీజెపి ప్రభుత్వం ఒకే మతం, ఒకే కులం అని ఎందుకు చెప్పదని ఆయన ప్రశ్నించారు. బీజేపీని గద్దె దించాలంటే లౌకిక శక్తులన్నీ ఏకమై పనిచేయాలన్నారు. తమిళనాడులో స్టాలిన్, ఉత్తరప్రదేశ్ లో అఖిలేష్ యాదవ్, బీహార్ లో నితీష్ కుమార్, ఢిల్లీలో కేజ్రీవాల్ వంటి ముఖ్యమంత్రులు అందరూ బిజెపికి వ్యతిరేకంగా సమీకృతం అవుతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా బిజెపికి వ్యతిరేకంగా పోరాటం చేయడంలో ముందుంది అన్నారు.

అందుకే బీఆర్ఎస్ తో భవిష్యత్తులో కలిసి ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. తెలంగాణలో రానున్న ఎన్నికల్లో కమ్యూనిస్టులతో కలిసి పని చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ ఆసక్తి కనబరుస్తుందని, పొత్తుల విషయంపై ఇంకా స్పష్టత రాలేదన్నారు. నకరికల్లు నియోజకవర్గం మొదటి నుంచి ఆరుసార్లు కమ్యూనిస్టు పార్టీకి నియోజకవర్గ ప్రజలు మద్దతు ఇచ్చారని అదే రకంగా భవిష్యత్తులో కూడా కమ్యూనిస్టులకు మద్దతు ఇచ్చేందుకు ప్రజలు ఆసక్తితో ఉన్నారన్నారు. ప్రజా చైతన్య యాత్రకు సీపీఐ, కాంగ్రెస్, టిడిపి పార్టీల నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సభలో పార్టీ కేంద్ర సభ్యులు చెరుపల్లి సీతారాములు జిల్లా నాయకులు కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, జిల్లా నాయకులు తుమ్మల వీరారెడ్డి, ప్రభావతి, జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్య, నారా బోయిన శ్రీనివాస్, జిట్ట సరోజ, తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed