బట్టి విక్రమార్క ది గమ్యం, గమనం లేని పాద యాత్ర.. శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

by Sumithra |
బట్టి విక్రమార్క ది గమ్యం, గమనం లేని పాద యాత్ర.. శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
X

దిశ, మిర్యాలగూడ : కాంగ్రెస్ ఎమ్మెల్యే బట్టి విక్రమార్క చేస్తున్న పాదయాత్రకి గమ్యం, గమనం లేదని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే నల్లమోతు బాస్కర్ రావుతో కలిసి ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్యం కోసం బట్టి విక్రమార్క రోజుకు 3 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నారని ఎద్దేవా చేశారు. నల్గొండ క్లాక్ టవర్ దగ్గర జరిగిన సభకు 150 మంది మాత్రమే హాజరవడం ద్వారా కాంగ్రెస్ కి ప్రజాధరణ లేదని స్పష్టం అయిందన్నారు. ప్రచారంకోసం తనపై, మంత్రి జగదీష్ రెడ్డి పై ఆరోపణలు చేస్తున్నాడన్నారు. తన హయాంలో జాతీయ రహదారి రెండు కేంద్రియ విద్యాలయాలు ఏర్పాటు చేశానన్నారు. తెలంగాణా ప్రజల కోసం అభివృద్ధి కోసం నేతల ఆహ్వానం మేరకు పార్టీలు మారానే తప్ప అధికారం కోసం కాదన్నారు. సీఎం కేసీఆర్ చొరవతో ఎస్ఎల్ బీసీ ప్రాజెక్టు పనులు చురుగ్గా సాగుతున్నాయని, మరో 9 కిలోమీటర్ల పనులకు ప్రభుత్వం అడ్వాన్స్ నిధులు ఇచ్చినట్లు తెలిపారు.

జిల్లాలో 7వేల కోట్లతో పెండింగ్ సాగు నీటి ప్రాజెక్టులు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ఎంపీ ఉత్తమ్ ఏమి అభివృద్ధి చేసారో ప్రజలకు వివరించాలన్నారు. పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తికాకుండా గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసులు వేసి స్టేలు తీసుకొచ్చిన దుర్మార్గులు కాంగ్రెస్ నేతలు అని ఆరోపించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కలు ఒక్కరోజు కూడా తెలంగాణ కోసం పోరాటం చేయలేదని, అధికారం కోసం ఆంధ్ర నాయకులకు సంచులు మోసిన వాళ్ళు మాపై ఆరోపణలు చేయడం గురివింద సామెత తలపిస్తున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యతిరేకుల సమూహంగా మారిందని మండి పడ్డారు. గత తొమ్మిది సంవత్సరాలలో కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, డిండి, ప్రాజెక్టులను పూర్తి చేసి నీటిని అందించిన ఘనత సీఎం కేసీఆర్ ప్రభుత్వానిదన్నారు. తిరిగి బీఆర్ఎస్ ని గెలిపించడం ద్వారానే సంక్షేమం అభివృద్ధి జరుగుతుంది అన్నారు. సమావేశంలో ఆగ్రోస్ కార్పొరేషన్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిరు నగర్ భార్గవ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులు చింత రెడ్డి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

Next Story