బీఆర్ఎస్ నేతల అరెస్ట్.. భువనగిరిలో ఉద్రిక్త పరిస్థితులు

by Aamani |
బీఆర్ఎస్ నేతల అరెస్ట్.. భువనగిరిలో ఉద్రిక్త పరిస్థితులు
X

దిశ,యాదాద్రి భువనగిరి ప్రతినిధి : భువనగిరి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణా రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు భువనగిరి బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయం పై దాడి చేయడంతో దానికి నిరసనగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భువనగిరి వినాయక చౌరస్తా వద్ద మహా ధర్నా చేపడతామని బీఆర్ఎస్ పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిని యాదగిరిగుట్టలో, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ ను హైదరాబాద్ లో హౌస్ స్టేషన్ చేశారు.


భువనగిరి పట్టణానికి వచ్చే దారులలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి, బీఆర్ఎస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. భువనగిరి పట్టణంలో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. ఇదే క్రమంలో భువనగిరి జూనియర్ కళాశాల ఎదురుగా మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డిలతో మరి కొంతమంది పార్టీ కార్యకర్తలు వినాయక చౌరస్తా వైపు వెళ్తుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని అరెస్టు చేస్తుండగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.


మాజీ జడ్పీ చైర్మన్ ఎలిమినేట్ సందీప్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చింతల వెంకటేశ్వర్ రెడ్డిలు నేరుగా వినాయక చౌరస్తా వద్దకు చేరుకోగా అక్కడే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో నాయకులకు పోలీసులకు మధ్య వాగ్వివాదం నెలకొంది. వినాయక చౌరస్తా వద్ద భారీగా మోహరించిన పోలీసులు అక్కడికి వచ్చే బీఆర్ఎస్ కార్యకర్తలను ఎప్పటికప్పుడు అరెస్టు చేసి జిల్లాలోని ఆయా పోలీస్ స్టేషన్లకు తరలించారు. డీసీపీ రాజేష్ చంద్ర పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున సిబ్బందిని మోహరించారు.



Next Story

Most Viewed