మన బహుళ అంతస్తులు భద్రమేనా..?

by Aamani |
మన బహుళ అంతస్తులు భద్రమేనా..?
X

దిశ,సూర్యాపేట టౌన్: సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలు అనేకం ఉన్నాయి. సెల్లార్ అనుమతులు లేకుండా, ఫైర్ ఇంజన్ తిరిగే అవకాశం లేకుండా, సెట్ బ్యాక్ లేకుండా, రెండు మూడు ఫ్లోర్లకు మాత్రమే అనుమతులు తీసుకుని ఐదారు అంతస్తుల భవనాలను నిర్మించారు. వీటన్నింటి విషయాలు సంబంధిత సూర్యాపేట టౌన్ ప్లానింగ్ అధికారులకు తెలియనిది కాదు. కొత్తగా నిర్మాణంలో ఉన్న చాలా భవనాలు సైతం నిబంధనలు అతిక్రమించినవే. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో ఆరు అంతస్తుల భవనం కూలి ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఈ క్రమంలోసూర్యాపేట పట్టణంలో, జిల్లాలో నిర్మాణంలో ఉన్న భవనాలు భద్రమేనా..? అనుమానం కలుగుతుంది. టౌన్ ప్లానింగ్ అధికారులు, అందులో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు అక్రమాలకు మార్గాలు సూచించడం, విచారణకు బదులు సెటిల్మెంట్లు చేస్తుండడం పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

పక్క జిల్లా లో కుప్పకూలిన భవనం..

భద్రాచలంలో అనుమతి లేకుండా నిర్మిస్తున్న బహుళ అంతస్తుల భవనం కుప్పకూలిన నేపథ్యంలో జిల్లాలోని భవనాల భద్రత పై ప్రజల్లో సందేహాలు మొదలయ్యాయి. ప్రజాప్రతినిధులు, అధికారుల అండా ఉందంటూ పలువురు యథేచ్ఛగా నిబంధనలు అతిక్రమించి భవనాలు నిర్మిస్తుండడం విశేషం. చర్యలు తీసుకోవాల్సిన అధికార యంత్రాంగం మే చోద్యం చూస్తుండడంతో త్రివ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సూర్యాపేట పట్టణంలోని కుడ కుడ రోడ్డు లో సెల్లర్ అనుమతులు లేకుండా ఓ బహుళ అంతస్తు నిర్మించారు. గతంలో ఈ బిల్డింగ్ పై పలు కథనాలు పత్రికలలో రావడం తో అధికారుల దృష్టికి వెళ్ళింది. దీంతో భారీగా సూట్ కేసులు చేతులు మారడంతో ఆ బిల్డింగ్ ని ముట్టుకోకుండా వదిలేశారని ఆరోపణలు ఉన్నాయి.. నిర్మల హాస్పిటల్ రోడ్డు లో అనుమతులు లేకుండా బహుళ అంతస్తు పై మరో అంతస్తుని నిర్మించారు. దీని వెనుక టౌన్ ప్లానింగ్ కార్యాలయంలో పనిచేస్తు, రోజు ద్విచక్ర వాహనంపై బిల్డింగులు చుట్టూ, రేకుల షెడ్ల చుట్టూ తిరుగుతూ డబ్బులు వసూలు చేస్తున్న ఓ ఉద్యోగి చేతులు తడపడం తో ఆ బిల్డింగ్ వైపు వెళ్లలేదని విమర్శలున్నాయి. కొత్త కలెక్టరేట్ రోడ్ లో నియమ నిబంధనలు లేకుండా ఓ ప్రైవేటు పాఠశాల కోసం నిర్మించిన అంతస్తు పై మళ్లీ మరో అంతస్తు నిబంధనలు విరుద్ధంగా నిర్మిస్తున్న ఆ భవన యజమాని మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ కార్యాలయంలో ఓ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి కి భారీగానే చేతులు తడిపాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. పొట్టి శ్రీరాములు సెంటర్ నుంచి మున్సిపాలిటీ కార్యాలయం వరకు నాలుగు బహుళ అంతస్తులు నిర్మాణం అవుతున్నాయి. కనీసం అటువైపు సంబంధిత అధికారులు తొంగి చూసిన దాఖలాలు కూడా లేవు.

ఎంజీ రోడ్డు లోని మధు గార్మెంట్స్ పక్కనే ఓ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరగగా, ప్రతిరోజు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఆ షాపు ముందు నుంచే రాకపోకలు సాగిస్తున్న, నిర్మాణ దారులకు ఎలాంటి హెచ్చరికలు జారీ చేయకపోవడంతో సెట్ బ్యాక్ లేకుండానే నిర్మాణం చేశారు. సాయి దీప్తి హాస్పిటల్ పక్కనే మరో భవనం అక్రమంగా సెల్లార్ నిర్మాణం జరిపి, అదనంగా ఒక ఫ్లోర్ అక్రమంగా నిర్మించినప్పటికీ సంబంధిత శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. అమ్మ హాస్పిటల్ పక్కన మరొక బిల్డింగ్, వినూత్న హాస్పిటల్ పక్కన గల్లీలో మరొక బిల్డింగ్ ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండానే నిర్మాణాలు జరుగుతున్నాయి. కొన్ని భవనాలు అనుమతి తీసుకొని, అనుమతికి మించి అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా కూడా సంబంధిత శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఎలాంటి అనుమతి లేకుండా జనగా ఎక్స్ రోడ్, నిర్మల హాస్పిటల్ రోడ్, నిర్మల హాస్పిటల్ ఎదురు గల్లీలో ఓ బహుళ అంతస్తు, ఎన్ హెచ్ 65 రోడ్డుకి అనుకొని మరో బిల్డింగ్, కుడ కుడ రోడ్డు లో ఓ బిల్డింగ్ పొట్టి శ్రీరాములు సెంటర్ లో నాలుగు బిల్డింగులు ఇలా పట్టణంలో ఎలాంటి అనుమతులు లేకుండా సెల్లార్లు తీస్తూ, బిల్డింగుల మీద అంతస్తులు నిర్మిస్తున్న సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో భారీగా ముడుపులు ముట్టాయని బహిరంగ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనుమతులు లేకుండా బిల్డింగులు నిర్మిస్తుడడo తో ఎప్పుడు కూలుతాయోనని సూర్యాపేట పట్టణ ప్రజలు ప్రమాదం పొంచి ఉందని భయపడుతున్నారు.

ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం : సూర్యాపేట మున్సిపాలిటీ కమిషనర్ శ్రీనివాస్

సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో అనుమతులు లేకుండా బిల్డింగులు నిర్మిస్తున్నారన్న విషయం మా దృష్టికి రాలేదు. మా దృష్టికి వస్తే వెంటనే అనుమతులు లేకుండా నిర్మిస్తున్న బిల్డింగుల పై మున్సిపాలిటీ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. బిల్డింగులు నిర్మిస్తున్న భవన యజమానులు కచ్చితంగా మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకొని తమ బిల్డింగ్ లను నిర్మించుకోవాలి. టౌన్ ప్లానింగ్ లో ఉద్యోగం చేస్తున్నవారు డబ్బులు తీసుకున్నట్లు మాకు ఎలాంటి ఫిర్యాదు రాలేదు. నిబంధనలను అతిక్రమించి ఎవరైనా డబ్బులు తీసుకుంటే వారిపై చర్యలు తీసుకుంటాం.



Next Story

Most Viewed